
సమాచార కమిషనర్లను నియమించాలి
సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి
భీమవరం టౌన్/తణుకు టౌన్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సమాచార హక్కు కమిషన్లను ఏర్పాటు చేసి.. వాటికి కమిషనర్లను నియమించాలని సమాచార హక్కు కమిషన్ మాజీ కమిషనర్, సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆర్.దిలీప్‌రెడ్డి డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స.హ. కమిషన్ లేకుండా ఉంటే సరిపోతుందన్నట్లుగా ప్రభుత్వాల తీరుందని విమర్శించారు.
ఒక స్వచ్ఛంద సంస్థ పిల్ దాఖలు చేయగా స్పందించిన హైకోర్టు ఆరు వారాల్లో స.హ.కమిషన్‌ను కమిషనర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించిందని తెలిపారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ సమాచార హక్కు కమిషన్ ఏర్పాటు చేసినట్లు జీవో విడుదల చేసి వదిలేసిందన్నారు. అయితే కమిషన్ కార్యకలాపాలు ఇంతవరకూ అందుబా టులోకి రాలేదన్నారు. ఇదే రీతిలో తెలంగాణ ప్రభుత్వం సైతం సాగతీత పద్ధతిలో వ్యవహరిస్తోందన్నారు. చిత్తశుద్ధితో సమాచార హక్కు కమిషన్లను ఏర్పాటు చేసి అర్హుల్ని చీఫ్ కమిషనర్, కమిషనర్లుగా నియమించాలని ఆయన కోరారు.