- రైతులు చెల్లించిన ప్రీమియం రూ.800 కోట్లు
- మంజూరు కానున్న బీమా రూ.200 కోట్లు
- గతేడాది తీవ్ర వర్షాభావంతో నిలువునా మునిగిన రైతన్న
- అధికారులు ఏం నివేదికలు పంపుతున్నారో అర్థం కావడం లేదు
- మండిపడిన ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి
రాయచోటి : జిల్లాకు 2014 ఖరీఫ్ పంటల బీమా నామామాత్రంగా మంజూరు కానుందని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాదులోని రాష్ట్ర ఇన్సూరెన్స్ ఉన్నతాధికారులతో సోమవారం ఆయన పంటల బీమా మంజూరు విషయంపై విృ్తతంగా చర్చించారు. అనంతరం ఇన్సూరెన్స్ కార్యాలయం నుంచి ఇక్కడి విలేకరులతో మాట్లాడారు.
జిల్లాలోని వేరుశనగ పంటకు సంబంధించి ఖరీఫ్ బీమా వర్తించే 31 కరువు మండలాలకు గానూ 27 మండలాలకు మాత్రమే పంటల బీమా మంజురైనట్లు అధికారులు తెలిపారన్నారు. రైతులు 800 కోట్ల రూపాయలు ప్రీమియం చెల్లిస్తే కేవలం 200 కోట్ల రూపాయల మేర కూడా బీమా మంజూరు కానట్లు తెలుస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
బీమా మంజూరైన మండలాల్లో 30-35 శాతం మాత్రమే రైతులకందే అవకాశం ఉందన్నారు. పూర్తి వివ రాలు రెండు మూడు రోజుల్లో తెలిసే అవకాశం ఉందన్నారు. వాతావరణ బీమా వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆయన విచారం వ్యక్తం చేశారు. జూన్, జూలై వరకు ఒక దశ కింద.. ఆగష్టు, సెప్టెంబర్ వరకు మరో దశ కింద వర్షపాత వివరాలను నమోదు చేస్తున్నారన్నారు.
గత ఏడాది ఏమాత్రం వర్షాలు కురవలేదన్నారు. ఆ లెక్కల ప్రకారం అయితే జిల్లాకు 90 శాతం నుండి వంద శాతం వరకు పంటల బీమా మంజూరు కావాలన్నారు. అయితే నామమాత్రంగా మంజూరు కానుండడం పట్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఏమి నివేదికలు పంపుతున్నారో అర్థం కావడం లేదంటూ మండి పడ్డారు. కష్టాల కడలిలో కరువుతో కూరుకుపోతున్న రైతులపై కనికరం లేదా అంటూ ఆయన ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హమీ ప్రకారం రుణ మాఫీ పూర్తిగా అమలవుతుందన్న నమ్మకంతో ఎక్కువ మంది రైతులు పంట రుణాలను రెన్యువల్ చేసుకోలేక పోయారన్నారు. రెన్యువల్ చేయని వారికి పంటల బీమా వర్తించదేమోనన్న ఆందోళనలో రైతులు ఉన్నారన్నారు. పంట రుణాలను రెన్యువల్ చేయని వారికి కూడా పంటల బీమా వర్తింప చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మూడేళ్ల నుంచి పంటల బీమా రైతులకు ప్రయోజకరంగా ఉండటం లేదన్నారు.
పంటల బీమా కార్యాలయం చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నా సరైన సమాధానాలు రావడం లేదని ఆయన విమర్శించారు. ఈ ఏడాది వర్షాలు సక్రమంగా కురవడం లేదని, పంటలు, మామిడి తోటలు నిలువునా ఎండి పోతున్నాయన్నారు. అధికారులు ఈసారైనా సక్రమంగా నివేదికలు పంపి అధిక మొత్తంలో పంటల బీమా మంజూరయ్యేలా చూడాలని కోరారు.
బీమాయ!
Published Tue, Jul 28 2015 3:42 AM | Last Updated on Tue, Oct 30 2018 3:51 PM
Advertisement
Advertisement