ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం
Published Wed, Aug 28 2013 12:25 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: ఓ ఇంటర్ విద్యార్థిని ఒంటికి నిప్పంటించుకొని బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమ పేరుతో ఆమెను ఓ యువకుడు వేధించడంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని, నిందితుడిని అరెస్టు చేయాలని మృతురాలి కుటుంబీకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముకునూరు గ్రామంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాసరావు, గ్రామస్తుల కథనం ప్రకారం.. ముకునూరు గ్రామానికి చెందిన చిలుక రాజయ్య, అంజమ్మ దంపతుల కుమార్తె అనిత(18) ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ (బైపీసీ) సంవత్సరం చదువుతోంది. గ్రామంలో వీరి పొరుగింట్లో నివసిస్తున్న పుట్ట లక్ష్మణ్(20) కొంత కాలంగా అనితను ప్రేమిస్తున్నానంటూ వేధించసాగాడు.
గతంలో లక్ష్మణ్ అనిత ఇంటికి వెళ్లగా ఆమె తల్లిదండ్రులు యువకుడిని తీవ్రంగా మందలించారు. ఈక్రమంలో అనితకు వివాహం చేయాలని తల్లిదండ్రులు కొంతకాలంగా సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మణ్ అనిత ను వేరొకరిని పెళ్లి చేసుకోవద్దని, తననే వివాహమాడాలని పట్టుబట్టాడు. మంగళవారం ఉదయం ఏడు గంటల సమయంలో అనిత ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పటించుకుంది. ఇంట్లోంచి మంటలు రావడంతో పొరుగువారు గమనించగా అప్పటికే తీవ్రగాయాలతో అనిత మృతిచెందింది. ఈవిషయం తెలుసుకున్న లక్ష్మణ్ అనిత ఇంటికి వెళ్లాడు. ‘అనిత చావుకు నీవే కారణం’ అంటూ అతడిపై మృతురాలి కుటుంబీకులు, బంధువులు దాడి చేయగా లక్ష్మణ్ తప్పించుకుపోయాడు. సీఐ రాంకుమార్, ఎస్సై శ్రీనివాసరావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించే యత్నం చేయగా బంధువులు అడ్డుకున్నారు. లక్ష్మణ్‌ను అరెస్టు చేయాలని పట్టుబట్టారు. ఈక్రమంలో ఆందోళనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. లక్ష్మణ్ పై కేసు నమోదు చేస్తామని పోలీసులు వారికి సర్దిచెప్పి మృతదేహాన్ని ఇబ్రహీంపట్నం ఆస్పత్రికి తరలించారు. కాగా వేరే పెళ్లి చేసుకోవద్దంటూ లక్ష్మణ్ అనితకు బెదిరింపు ధోరణిలో రాసిన లేఖ తమకు ఇంట్లో దొరికిందంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు.
అనిత కూడా లక్ష్మణ్‌ను ప్రేమించిందా...?
కాగా అనిత ఆత్మహత్యకు సంబంధించి మరో వాదన కూడా వినిపిస్తోంది. అనిత కూడా లక్ష్మణ్‌ను ఇష్టపడిందని, వీరిద్దరూ కలిసి తిరిగారని గ్రామస్తులు కొందరు చెబుతున్నారు. ఈ ప్రేమ వ్యవహారం నచ్చని యువతి తల్లిదండ్రులు లక్ష్మణ్‌తో గొడవ పెట్టుకున్నారని సమాచారం. సోమవారం అనిత క ళాశాలకు వెళ్లలేదని, లక్ష్మణ్, ఆమె కలిసి తిరిగారని, ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అదేరోజు రాత్రి అనితను తీవ్రంగా మందలించినట్లు తెలిసింది. దీంతో ప్రేమికుడిని వదులుకోలేక, వేరే వివాహం చేసుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని స్థానికుల కథనం. కాగా అనిత చదువులో చురుకైందని కళాశాల వర్గాల సమాచారం. అనిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం సీఐ రాంకుమార్ తెలిపారు.
Advertisement