
రామలక్ష్మి మృతదేహం
అల్వాల్: ఇంటర్‌లో మార్కులు తక్కువ వచ్చాయని తల్లిదండ్రులు మందలించడంతో మనస్థాసానికిలోనైన ఓ బాలిక భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ వరప్రసాద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భీమవర ప్రాంతానికి చెందిన సత్యనారాయణ బతుకుదెరువు నిమిత్తం కుటుంబంతో సహా నగరానికి వలస వచ్చి అల్వాల్ ఫాదర్ బాలయ్యనగర్‌లో ఉంటూ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. వీరి కుమార్తె రామలక్ష్మి(17) బీమవరంలో ఇంటర్ మీడియేట్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో తక్కువ మార్కులు రావడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికిలోనైన రామలక్ష్మి బుధవారం తల్లితోపాటు ఇంటిపై పనులు చేస్తూ రెండో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతు సాయంత్రం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నారు.