సునీత సాక్షిగా..భగ్గుమన్న వర్గ విభేదాలు
► బయటపడిన కళా, అచ్చెన్న వర్గాల మధ్య ఆదిపత్యపోరు
► ఎవరికి వారే అవతలి వర్గాన్ని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్
► చిరునవ్వుతోనే సమాధానం ఇచ్చిన పరిటాల
శ్రీకాకుళం అర్బన్: జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పరిటాల సునీత సాక్షిగా టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే కళావెంకటరావు వర్గాల మధ్య విభేదాలు చోటుచేసుకోవడం, ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలతో పాటు ఎవరికి వారే అవతలి వర్గాన్ని సస్పెండ్ చేయాలంటూ సునీతకు ఫిర్యాదు చేయడం విశేషం. జిల్లా పర్యటన సందర్భంగా స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బుధవారం మధ్యాహ్నం పార్టీ అంతర్గత సమావేశం సునీత నిర్వహించారు. ఈ సమీక్షకు విలేకరులను పిలవలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమైన సమావేశం 3 గంటల వరకూ జరిగింది. సమీక్ష మధ్యలో పాలకొండ, కొత్తూరు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన తగాదాలు చర్చకు వచ్చాయి.
పార్టీలో విశేషాలు ఏంటని మంత్రి అడుగగా పాలకొండ వర్గీయులు..పార్టీనేత కర్నేని అప్పలనాయుడును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ నిమ్మక జయకృష్ణ సహా నేతలంతా కుండ బద్దలుగొట్టారు. అదే సమయంలో ఆయనను ఎందుకు సస్పెండ్ చేయాలంటూ కళావెంకటరావు వర్గం భగ్గుమంది. పార్టీని పదేళ్లపాటు జెండా మోసి కష్టకాలంలో ఆదుకుని అధికారంలోకి తెస్తే తమను నిర్లక్ష్యం చేస్తున్నారని మరో టీడీపీ నాయకురాలు ఖండాపు జ్యోతి ఆరోపణలు గుప్పించారు. తనకు ఓ ఉన్నత పదవి ఇప్పిస్తామని మోసం చేశారంటూ వాపోయారు. వెనువెంటనే పాలకొండ పార్టీ ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణను పదవి నుంచి తప్పించాలని మరో వర్గం డిమాండ్ చేసింది.
దీనికి మిగతావారు కొంతమంది వంతపాడారు. వీటన్నింటికీ మూల కారణం జిల్లా మంత్రి అచ్చెన్న, ఎచ్చెర్ల ఎమ్మెల్యే కళావెంకటరావు మధ్య ఎప్పటినుంచో చోటుచేసుకుంటున్న విభేదాలేనని తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. చివరాఖరులో ఎవరినీ సస్పెండ్ చేయక్కరలేదు. మీరు చెప్పింది అధిష్టానం దృష్టికి తీసుకువెళతానంటూ పరిటాల సునీత నవ్వుకుంటునే విభేదాలను ముక్తాయించారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు శివాజీ, బగ్గు రమణమూర్తి, బెందాళం అశోక్, గుండ లక్ష్మీదేవి, సహా విప్ కూన రవికుమార్, జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి, పార్టీ నేత చౌదరి బాబ్జి, పాలకొండ, పాతపట్నం, రాజాం నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు నిమ్మక జయకృష్ణ, శత్రుచర్ల విజయరామరాజు, ఎమ్మెల్సీ కావలి ప్రతిభా భారతి, బోయిన గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.