
టీడీపీలో రగులుతున్న తీర్మానం చిచ్చు
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో టీడీపీ సభ్యుల వ్యవహారశైలిపై అధిష్టానం గుర్రుగా ఉంది. అంతర్గత కుమ్ములాటలతో పార్టీ పరువును బజారుకీడుస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గత నెల 29వ తేదీన జరిగిన కౌన్సిల్ సమావేశం టీడీపీలో వర్గపోరును బహిర్గతం చేసింది. 53వ డివిజన్లో నిర్మాణంలో ఉన్న కమ్యూనిటీ హాలుకు గొట్టెముక్కల వెంకట రామరాజు పేరు పెట్టాలంటూ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చేసిన ప్రతిపాదనను స్టాండింగ్ కమిటీ సభ్యులు బలపర్చారు. డెప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణారావు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో సభలో టీడీపీ పరువు పోయింది. చర్చ సందర్భంగా డెప్యూటీ మేయర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రత్యర్థులు ఫోన్లోరికార్డు చేసి ఎమ్మెల్యే బొండాకు వినిపించినట్లు సమాచారం. దీంతో ఆయన అగ్గిమీద గుగ్గిలం అయినట్లు తెలుస్తోంది. తాను చేసిన ప్రతిపాదనను సభకు సరైన పద్ధతిలో తీసుకురాకపోవడం, వాయిదా వేయడంపై కూడా ఎమ్మెల్యే సీరియస్‌గా ఉన్నట్లు ఆ పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తోంది.
తాజా పరిణామాల నేపథ్యంలో 44వ డివిజన్ కార్పొరేటర్ కాకుమల్లికార్జున యాదవ్ రాజీనామాకు సిద్ధమయ్యారు. హైదరాబాద్‌లో ఎమ్మెల్యే బొండాఉమా జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కాకు రాజీనామా విషయాన్ని నగరపార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బుద్దా వెంకన్న దృష్టికి తీసుకెళ్లారు. తొందరపడొద్దని ఎమ్మెల్సీ సర్దిచెప్పినట్లు భోగట్టా. కనకదుర్గ లే అవుట్ల వ్యవహారం నుంచి కమ్యూనిటీ హాలు తీర్మానాన్ని వ్యతిరేకించడం వరకు సభ్యులు క్రమశిక్షణ తప్పుతున్నారన్న అభిప్రాయానికి హైకమాండ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 3,4 తేదీల్లో ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీ భేటీ అవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నగరపాలక సంస్థలో గాడి తప్పిన పార్టీని చక్కదిద్దాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పనిలోపనిగా పదవుల మార్పుపై చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. మొత్తం మీద టీడీపీలో తీర్మానం చిచ్చు రగులుకుంది.