పాలగుమ్మి పద్మరాజు తనయలు సీత, రత్న
రాజమండ్రి : ‘గాలివాన కథానిక ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొందిన పాలగుమ్మి పద్మరాజు.. సినిమా రంగంలో ఎంతో ఎత్తుకు ఎదిగాక కూడా, కొంతమంది సినీవాలాలకు ఘోస్ట్ రైటర్‌గా ఎందుకు పని చేశారు?’ - ఇదే సందేహాన్ని ఆయన కుమార్తెలు సీత, రత్నలతో ‘సాక్షి’ ప్రస్తావించింది. తమ తండ్రి శతజయంత సంవత్సరాన్ని పురస్కరించుకుని రాజమండ్రిలో జరిగిన సభలో పాల్గొన్న వారు.. నాటి జ్ఞాపకాలను ఇలా ఆవిష్కరించారు.
అచ్చమైన మానవతావాది
పేరు ప్రతిష్టల కోసం మా నాన్నగారు ఎప్పుడూ పాకులాడేవారు కాదు. ఎవరు వచ్చి కోరినా, రాయడానికి అంగీకరించేవారు. ఈ నేపథ్యంలోనే పలువురు సినీ ప్రముఖులకు ఘోస్ట్ రైటర్‌గా పని చేశారు. వాళ్ల పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు. ఆయన అచ్చమైన మానవతావాది. కాలేజీ రోజుల వరకూ మా కులం ఏమిటో మాకు తెలియదు. నా (పాలగుమ్మి సీత) భర్త బాలు అనే మలయాళీ. నా (పాలగుమ్మి రత్న) భర్త కార్తికేయన్ అనే తమిళుడు. అందుకనే వివాహాలయ్యాక కూడా మేం పాలగుమ్మి సీత, పాలగుమ్మి రత్నలుగా మిగిలిపోయాం.
దేవులపల్లిని తాతయ్య అని పిలుచుకునేవాళ్లం
దేవులపల్లి కృష్ణశాస్త్రి చెన్నై వచ్చిన కొత్తలో మాతో రెండేళ్లు కలిసి ఉన్నారు. మా నాన్నగారికి తొమ్మిదేళ్ల ప్రాయంలోనే ఆయన తండ్రి గతించారు. మాకు తాత అంటే దేవులపల్లి కృష్ణశాస్త్రిగారే.
సినీ ప్రముఖులు వస్తూండేవారు
రాత్రి సుమారు 10 గంటలకు వాహినీ స్టూడియో నుంచి నాన్నగారు వచ్చేవారు. ప్రముఖ దర్శక నిర్మాత బీఎన్ రెడ్డి, సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు, దాశరథి, ఆరుద్ర, పీబీ శ్రీనివాస్ తదితరులు వస్తూండేవారు.
నాన్నగారి ప్రభావం
1978లో కాకినాడలో నాన్నగారికి సన్మానం జరిగింది. దేవులపల్లి కృష్ణశాస్త్రి ఒక అభినందన వ్యాసం రాసి పంపారు. ‘పాలగుమ్మి పద్మరాజు పాటలు రాస్తే, మా నోట్లో మన్నే’ అని వ్యాసంలో పేర్కొన్నారు. నాన్నగారు రాసిన గాలివాన, బంగారుపాప సినిమాలు పూర్తయ్యాకే మేం పుట్టాం. ఆయన ప్రభావంవల్లనే కొన్ని కథలు, సీరియళ్లకు స్క్రిప్టులు రాస్తున్నాం.
మురళీమోహన్ మాటలునీటిమూటలు
రాజమండ్రి : తెలుగు సాహిత్యానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన పాలగుమ్మి పద్మరాజు శతజయంత్యుత్సవాలను అధికారికంగా నిర్వహించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడతానంటూ.. రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ ఇచ్చిన హామీ నీటిమూటగా మిగిలిందని ప్రముఖ కథా రచయిత వేదగిరి రాంబాబు విమర్శించారు. జూన్ 24న రాజమండ్రి ఆనం కళాకేంద్రం మేడపై ఉన్న గంథం నాగసుబ్రహ్మణ్యం వేదికపై మురళీమోహన్ ఈ హామీ ఇచ్చారన్నారు.
ఈ వాగ్దానం నిజమయ్యే దాఖలాలు కనిపించడంలేదని ఆవేదన వ్యక్తం చేసారు. పాలగుమ్మి శతజయంత్యుత్సవంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. నాడు జరిగిన సభలో పాలగుమ్మి పద్మరాజు తన గురువు (దాసరి నారాయణరావు)కే గురువని, తాను పాలగుమ్మికి ‘ప్రశిష్యుడినని’ మురళీమోహన్ చెప్పుకున్నారన్నారు. కానీ, ఆచరణ శూన్యమని విమర్శించారు. తన సంస్థ వేదగిరి కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో పాలగుమ్మి శతజయంతి సంవత్సరాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీ, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల్లో కూడా సభలు నిర్వహించామని రాంబాబు తెలిపారు.
‘తెలంగాణలోని రచయితలను అక్కడి కేసీఆర్ ప్రభుత్వం ఎంతో గౌరవిస్తోంది. మనకు ఆ అదృష్టం లేదు. భారతీయ సాహిత్యంలో తొలిసారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ అంతర్జాతీయ గుర్తింపు పొందారు. రెండో వ్యక్తి తెలుగువాడైన పాలగుమ్మి పద్మరాజు. ఆ మహనీయుని శతజయంతి సందర్భంగా కనీసం ఒక చిన్నపాటి సభను నిర్వహించే శ్రద్ధ ప్రభుత్వానికి లేకపోవడం దారుణం’ అని రాంబాబు అన్నారు.