టైటిల్: గాలివాన
జానర్: క్రైమ్ అండ్ మిస్టరీ, థ్రిల్లర్
నటీనటులు: సాయి కుమార్, రాధికా శరత్ కుమార్, చాందిని చౌదరి, నందిని రాయ్, చైతన్య కృష్ణ, శరణ్య, తాగుబోతు రమేష్ తదితరులు
దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి
నిర్మాత: శరత్ మరార్
సంగీతం: హరి గౌర
సినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థ
ఓటీటీ: జీ5
విడుదల తేది: ఏప్రిల్ 14, 2022
ప్రస్తుతం ఓటీటీల హవా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ 'జీ5' తనదైన ముద్ర వేస్తూ వెబ్ సిరీస్‌లు, సినిమాలతో ముందుకు సాగుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే బీబీసీతో కలిసి జీ5, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ 'గాలివాన' వెబ్ సిరీస్‌ను నిర్మించాయి. ఈ వెబ్ సిరీస్‌తో సీనియర్ నటుడు సాయి కుమార్, రాధికా శరత్ కుమార్‌లు తొలిసారిగా డిజిటల్ తెరకు పరిచయమయ్యారు. కిర్రాక్ పార్టీ, తిమ్మరుసు చిత్రాల దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి ఈ వెబ్‌సిరీస్‌ను డెరెక్ట్ చేశాడు. సాయి కుమార్, రాధికా శరత్ కుమార్‌తోపాటు చాందిని చౌదరి, నందిని రాయ్, చైతన్య కృష్ణ, అశ్రిత, శరణ్య ప్రదీప్, తాగుబోతు రమేష్ తదితరులు నటించిన ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 14న జీ5లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొత్తం 7 ఎపిసోడ్‌లు ఉన్న 'గాలివాన' వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
కొమర్రాజు (సాయి కుమార్) కూతురు గీత, సరస్వతి (రాధికా శరత్ కుమార్) కుమారుడు అజయ్ వర్మ చిన్నప్పటి నుంచి ఒకరినొకరు ప్రేమించుకుంటారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. హనీమూన్‌కు వెళ్లిన ఈ జంటను శ్రీను అనే యువకుడు దారుణంగా హత్య చేస్తాడు. తర్వాత కారులో పారిపోతూ గాలివాన కారణంగా సరస్వతి ఇంటి ముందు యాక్సిడెంట్‌కు గురవుతాడు. తీవ్ర గాయాలపాలైన శ్రీనును సరస్వతి కుటుంబ సభ్యులు కాపాడి చికిత్స అందించడానికి సిద్ధమవుతారు. ఇంతలో వారి కూతురు అల్లుడిని చంపింది శ్రీనునే అని తెలుస్తుంది. ఆ మరసటి రోజు శ్రీను హత్యకు గురవుతాడు. శ్రీను చంపింది ఎవరు ? తమ వాళ్లను చంపిన వ్యక్తి తమ ఇంట్లోకి వస్తే ఆ కుటుంబ సభ్యులు ఏం చేశారు ? అసలు గీత, అజయ్ వర్మలను శ్రీను ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది ? అనేది 'గాలివాన' వెబ్ సిరీస్ కథ.
విశ్లేషణ:
బీబీసీ మినీ సిరీస్‌గా వచ్చిన 'వన్ ఆఫ్ అజ్'కు అఫిషియల్ రీమేక్‌గా తెరకెక్కిందే 'గాలివాన' వెబ్ సిరీస్. కిర్రాక్ పార్టీ, తిమ్మరుసు వంటి రీమేక్ సినిమాలను డైరెక్టర్ చేసిన శరణ్ కొప్పిశెట్టి ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఇదివరకూ శరణ్ కొప్పిశెట్టి డైరెక్ట్ చేసినవి రీమేక్ చిత్రాలే కావడంతో ఈ బీబీసీ మినీ సిరీస్‌ను కూడా తెలుగు నేటివిటీకి తగినట్లే చిత్రీకరించాడు. పల్లెటూరులో జరిగే ఈ కథకు అనువుగా పాత్రల ఎంపిక బాగుంది. ఆయుర్వేద వైద్యుడిగా సాయి కుమార్, ముగ్గురు పిల్లల ఒంటరి తల్లిగా రాధికా శరత్ కుమార్. సరస్వతి పిల్లలుగా చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, తదితరులు వారి పాత్రలకు చక్కగా సరిపోయారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటను హత్య చేయడంతో ప్రారంభమైన 'గాలివాన' ఆసక్తిగా ఉంటుంది. తర్వాత మర్డర్ చేసిన వ్యక్తి దంపతుల ఇంటి ముందు యాక్సిడెంట్‌కు గురికావడం, అతనే కిల్లర్ అని ఆ కుటుంబ సభ్యులకు తెలవడం, ఇంతలో అతను కూడా చంపబడటం థ్రిల్లింగ్‌గా ఫస్ట్ ఎపిసోడ్ సాగుతోంది.
ఇక తర్వాత ఎపిసోడ్‌లు సాదాసీదాగా ఉంటాయి. కొంచెం సీరియల్ అనుభూతిని కలిగిస్తాయి. అయితే తమ పిల్లల హత్యతో రెండు కుటుంబాలు ఎలాంటి వేదనకు గురయ్యాయి అనేది చాలా చక్కగా చూపించారు. పాత్రల పరిచయం, వారి స్వభావం చూపించే ప్రయత్నంలో కొంతవరకు బోరింగ్‌గా అనిపిస్తుంది. తర్వాత జంటను చంపిన కిల్లర్ పట్టుకునేందుకు వచ్చిన పోలీస్ ఆఫిసర్‌గా నందిని రాయ్ ఎంట్రీతో కథలో ఆసక్తి మొదలవుతుంది. ఒక పక్క నందిని రాయ్ కిల్లర్‌ను పట్టుకునే ప్రయత్నం చేయగా మరోవైపు కిల్లర్ శవాన్ని మాయం చేసే పనిలో రెండు కుటుంబాలు ఉండటం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అలాగే ఈ సీన్లు కొద్దివరకు 'దృశ్యం' మూవీని తలపిస్తాయి. అలాగే కిల్లర్ శ్రీనును హత్య చేసింది తమలోని వారే అని ఒకరిపై ఒకరు అనుమానపడటం మనుషులను పరిస్థితులను ఎలా మారుస్తాయే తెలిసేలా అద్దం పడుతాయి. సరస్వతి భర్త ఎపిసోడ్ నిడివి పెంచినట్లే ఉంది గానీ అంతగా ఆకట్టుకోలేదు. ఒక ట్విస్ట్ తర్వాత ఒక ట్విస్ట్‌తో చివరి రెండు ఎపిసోడ్స్ ఉత్కంఠభరితంగా సాగాయి. 7 ఎపిసోడ్‌లు కాకుండా కొన్ని ఎపిసోడ్‌లు తీసేస్తే ఈ వెబ్ సిరీస్ మరింతబాగా ఆకట్టుకునేది.
ఎవరెలా చేశారంటే ?
ఆయుర్వేద వైద్యుడిగా, గ్రామానికి పెద్ద దిక్కుగా సాయి కుమార్ నటన బాగుంది. ఆయన పాత్రకు తన నటనతో న్యాయం చేశారనే చెప్పవచ్చు. ఇక రాధిక శరత్ కుమార్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముగ్గురు పిల్లల ఒంటరి తల్లిగా, భర్త వదిలేసిన భార్యగా, అనవసరపు ఆలోచనలతో భయపడిపోయే గృహిణిగా ఆమె సరస్వతి పాత్రలో ఒదిగిపోయారు. చైతన్య కృష్ణ, చాందిని చౌదరి, అశ్రిని వేముగంటి, శరణ్య ప్రదీప్ వారి పరిధి మేర బాగానే నటించారు. నందిని రాయ్ తన నటనతో ఆకట్టుకున్న ఆ పాత్ర అంతగా ప్రభావం చూపించలేకపోయింది. నందినిరాయ్‌కు అసిస్టెంట్‌గా అంజి పాత్రలో తాగుబోతు రమేష్ నటన బాగుంది. సీనియర్ లేడీ కమెడియన్ శ్రీ లక్ష్మీ రెండు, మూడు సన్నివేశాల్లో కనిపించి పర్లేదనిపించారు. టెక్నికల్ టీం వర్క్ బాగుంది. హరి గౌర బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. అయితే థ్రిల్లర్ సినిమాలు ఫాస్ట్ స్క్రీన్ ప్లేతో ముందుకు సాగితే.. వెబ్ సిరీస్‌లు మాత్రం కాస్త నెమ్మదిగానే నారేట్ చేయబడుతాయి. ఎండింగ్‌లో వచ్చే ట్విస్ట్‌లు, కారణాలు బాగుంటే ఆ వెబ్ సిరీస్ ఆకట్టుకున్నట్టే. మొత్తంగా ఈ 'గాలివాన' వెబ్ సిరీస్ థ్రిల్లింగ్ కంటే మిస్టీరియస్‌గా బాగానే ఆకట్టుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment