టైటిల్: రెక్కీ (వెబ్ సిరీస్)
నటీనటులు: శ్రీరామ్, శివ బాలాజీ, 'ఆడు కాలమ్' నరేన్, సమ్మెట గాంధీ, ఎస్తేర్ నోరోన్హా, ధన్యా బాలకృష్ణ, తోటపల్లి మధు, శరణ్య ప్రదీప్ తదితరులు
నిర్మాత: శ్రీరామ్ కొలిశెట్టి
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: పోలూరు కృష్ణ
సంగీతం: శ్రీరామ్ మద్దూరి
సినిమాటోగ్రఫీ: రామ్ కె. మహేష్
విడుదల తేది: జూన్ 17, 2022 (జీ5)
ఇటీవలే 'గాలివాన' వెబ్ సిరీస్‌తో అలరించిన జీ5 తాజాగా 'రెక్కీ' అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో ముందుకు వచ్చింది. శ్రీరామ్, శివ బాలాజీ, 'ఆడు కాలమ్' నరేన్, ధన్యా బాలకృష్ణ, ఎస్తేర్ నోరోన్హా, సమ్మెట గాంధీ నటించిన ఈ వెబ్ సిరీస్‌కు పోలూరు కృష్ణ దర్శకత్వం వహించారు. 1992లో తాడిపత్రిలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందించినట్లు డైరెక్టర్ కృష్ణ తెలిపారు. 7 ఎపిసోడ్‌లుగా వచ్చిన 'రెక్కీ' వెబ్ సిరీస్ జీ5లో జూన్ 17న విడుదలైంది. క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ:
తాడిపత్రికి వరదరాజులు ('ఆడు కాలమ్' నరేన్) మున్సిపల్ ఛైర్మన్. అదే పట్టణంలో రంగ నాయకులు (రామరాజు) మాజీ మున్సిపల్ ఛైర్మన్. వీరిద్దరి మధ్య రాజకీయ పోరాటం జరుగుతుంది. ఈ క్రమంలోనే మున్సిపల్ ఛైర్మన్ వరదరాజులు హత్యకు గురవుతాడు. తర్వాత 6 నెలలకు వరదరాజులు కుమారుడు చలపతి (శివ బాలాజీ) కూడా చంపబడతాడు. ఈ హత్యలు చేసింది ఎవరు ? ఎవరు ప్లాన్ చేశారు ? వాటి వెనుక ఉన్నది ఎవరు ? వారిని ఎస్సై లెనిన్ (శ్రీరామ్) కనిపెట్టాడా ? అతను తెలుసుకున్న నిజాలు ఏంటీ ? ఈ రెండు హత్యలతో వారి ఇంట్లోని ఆడవాళ్లు ఏం నిర్ణయించుకున్నారు ? అనే తదితర ఆసక్తికర విషయాలు తెలియాలంటే 'రెక్కీ' వెబ్ సిరీస్ చూడాల్సిందే.
విశ్లేషణ:
ఒక మహిళ వల్ల కురుక్షేత్రమే జరిగిందని చెప్పుకుంటాం. అలాంటి వనితపై వ్యామోహం పెరిగితె ఎలాంటి పరిణామాలకు తావిస్తుందో ఈ వెబ్ సిరీస్ ద్వారా తెలియజేశారు. కథ చూస్తే రాజకీయ నేపథ్యమున్నట్లు అనిపించినా కామ వాంఛ, మహిళా పాత్రను ప్రధానంగా చూపించారు. అనుకున్న కథ ప్రకారం ఆద్యంతం ఆసక్తికరంగా ఆవిష్కరించారు డైరెక్టర్ పోలూరు కృష్ణ. అధికారం, రాజకీయం కథలతో అనేక సిరీస్‌లు ఇదివరకు వచ్చాయి. కానీ వీటికి కాస్త భిన్నంగా కామ వాంఛను జోడించి సక్సెస్ అయ్యారు దర్శకుడు. బంధాలు, అక్రమ సంబంధాల గురించి చక్కగా చూపించారు. సిరీస్‌లో వచ్చే మలుపులు ఊహించని విధంగా చాలా బాగా ఆకట్టుకున్నాయి. అలాగే మహిళళ పాత్రలను బలంగా చూపించారు. కానీ అక్కడక్కడ కొంతమేర అడల్ట్ సన్నివేశాలు ఉన్నాయి.
ఎవరెలా చేశారంటే?
సిరీస్ ప్రారంభం నుంచి చివరి వరకు నటీనటుల నటన అద్భుతంగా ఉంది. ఆద్యంతం వారి నటనతో సిరీస్‌ను రక్తి కట్టించారు. శ్రీరామ్, శివ బాలాజీ, ఆడు కాలమ్ నరేన్, సమ్మెట గాంధీ, ఎస్తేర్ నోరోన్హా పాత్రలు హైలెట్‌గా నిలిచాయి. శరణ్య ప్రదీప్, రాజశ్రీ నాయర్ పాత్రలు చివర్లో ఆకట్టుకుంటాయి. అలాగే మరో కీలక పాత్రలో నటించిన తోటపల్లి మధు పూర్తి న్యాయం చేశారు. ఇక సాంకేతిక అంశాల విషయానికొస్తే 1990వ దశకంలోని వాతావరణాన్ని బాగా చూపించారు. రామ్ కె మహేష్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక సంగీత దర్శకుడు శ్రీరామ్ మద్దూరి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయేలా ఉంది. 'రెక్కీ' వెబ్ సిరీస్‌కు ఈ బీజీఎం ప్రాణం పోసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఫైనల్‌గా చెప్పాలంటే మిమ్మల్ని కదలనివ్వకుండా థ్రిల్‌కు గురిచేసే వెబ్ సిరీస్ 'రెక్కీ'.
-సంజు (సాక్షి వెబ్ డెస్క్)
Comments
Please login to add a commentAdd a comment