galivana
-
సండే సిరీస్..: ఏది నేరం? ఏది పాపం?
పాపం చేస్తే అంతర్లోకం కల్లోలం అవుతుంది. నేరం చేస్తే చట్టం వెంటబడి జీవితం బందీ అవుతుంది. అన్నీ బాగుంటే నేరం ఎందుకు చేస్తారు? అన్నీ బాగున్నా పాపం ఎందుకు చేస్తారు? మనిషి వీలైనంత వరకు నేరం, పాపం చేయకుండా ఉండటానికే ప్రయత్నిస్తాడు. కాని నేరమో, పాపమో చేసే పరిస్థితులు వస్తే? జీ ఫైవ్‌లో తాజాగా విడుదలైన 7 ఎపిసోడ్ల ‘గాలివాన’ జీవితంలో ఎదురయ్యే అనూహ్య ప్రహేళికలను ఆసక్తికరంగా చూపిస్తుంది. నేరం చేస్తే చట్టం శిక్షిస్తుంది. పాపం చేస్తే అంతరాత్మ శిక్షిస్తుంది. కాని పాపాన్ని ఆపబోయి నేరం చేస్తే? ‘గాలివాన’ కథ ఇదే. జీవితంలో కొన్ని ఎప్పటికీ జరక్కూడదు. కాని జరిగినప్పుడు వాటిని ఆచితూచి ఎదుర్కొనాలి. ఆ నష్టాన్ని నివారించాలి తప్ప ఆ నష్టానికి విరుగుడుగా మరిన్ని నష్టాలు తెచ్చే పని చేయకూడదు. ఉద్వేగాలు చాలా ప్రమాదకరమైనవి. అందుకే ఏ నిర్ణయమైనా స్థిమితంగా, ఆలోచనతో, వాస్తవిక అవగాహనతో చేయాలి. లేకుంటే చాలా ప్రమాదం. అవును... చాలా ప్రమాదం. జీ 5లో ప్లే అవుతున్న వెబ్ సిరీస్ ‘గాలివాన’ కథ ఏమిటి? ఒక గాలివాన రోజు. రాకపోకలకు వీలు లేని రాజోలు దగ్గర ఉన్న ఒక లంక దీవి. రెండు పెద్ద పెద్ద ఇళ్లు. ఆ ఇళ్లలోని ఒక ఇంటి అమ్మాయి, మరో ఇంటి అబ్బాయికి కొత్తగా పెళ్లయ్యింది. తర్వాత వాళ్లు హనీమూన్‌కు వైజాగ్ వెళ్లారు. వాన కురుస్తున్న రోజు అది. వైజాగ్‌లో అమ్మాయి, అబ్బాయి ఆ రాత్రికి హనీమూన్ జరుపుకోవాలి. ఇక్కడ అబ్బాయి ఇంటి వాళ్లు, అమ్మాయి ఇంటి వాళ్లు రొటీన్ పనుల్లో మునిగి ఉంటారు. కాని హటాత్తుగా వైజాగ్‌లో ఉన్న కొత్త జంటను ఒక దుండగుడు దారుణంగా హత్య చేస్తాడు. వధువు ఒంటి మీదున్న నగలను దొంగిలిస్తాడు. వాటిని అమ్మి దారిన పోయే కారును దొంగిలించి ఆ వానలో అదే లంక దీవి వైపు వస్తూ యాక్సిడెంట్ అయ్యి అబ్బాయి ఇంటి ముందు కారుతో సహా బోర్లా పడతాడు. అప్పటికే దుర్వార్త ఆ రెండు ఇళ్లకు చేరింది. వధూవరులు హత్యకు గురయ్యారు. వాళ్లను చంపిన హంతకుణ్ణి టీవీలో చూపిస్తున్నారు. ఆ శోకంలో ఉన్న అబ్బాయి కుటుంబం వారు తమ ఇంటి బయట యాక్సిడెంట్‌కు గురైన కారు దగ్గరకు వస్తారు. తమ వాళ్లను హత్య చేసింది ఆ కారు నడుపుతున్నవాడే అని తెలియక ఇంట్లోకి తెచ్చి వైద్యం చేస్తారు. అమ్మాయి ఇంటి వారు కూడా హెల్ప్ చేయడానికి వస్తారు. అప్పుడే ఆ ఆగంతకుడే హంతకుడు అని తెలుస్తుంది. అంటే తమ ఇంటి ముక్కుపచ్చలారని జంటను చంపింది ఇతడేనన్న మాట. వీణ్ణి కాపాడాలా? చంపేయాలా? అందరి భావోద్వేగాలు అదుపు తప్పుతాయి. ఏం చేయాలన్న నిర్ణయాన్ని పోస్ట్‌పోన్ చేసి హంతకుణ్ణి గొడ్ల చావిడిలో పెడతారు. రాత్రి సమయం అది. గాలివాన. కాని తెల్లారే సరికి హంతకుడు చచ్చిపడి ఉంటాడు. ఎవరో అతణ్ణి చంపేసి ఉంటారు. ఆ చంపింది ఎవరు? అమ్మాయి తరఫు కుటుంబ సభ్యుల్లోని ఒకరా? అబ్బాయి తరపు కుటుంబ సభ్యుల్లోని ఒకరా? ఎవరు చంపారు? కాని అసలు ప్రశ్న తర్వాత వస్తుంది. అది– ఎందుకు చంపారు? బిబిసి వారు 2016లో తీయగా విపరీతమైన జనాదరణ పొందిన వెబ్ సిరీస్ ‘ఒన్ ఆఫ్ అజ్’కు తెలుగు రూపాంతరం ఈ సిరీస్. స్కాట్లాండ్లోని పర్వత ప్రాంతంలో జరిగినట్టుగా ఉండే ఒరిజినల్ కథను మన లంక దీవికి మార్చి తీశారు. హత్యకు గురైన వరుడి తల్లిగా రాధిక, వధువు తండ్రిగా సాయి కుమార్ కీలకమైన పాత్రలు. మిగిలిన పాత్రల్లో చాందినీ, చైతన్య కృష్ణ, నందిని రాయ్, తాగుబోతు రమేష్ తదితరులు నటించారు. బిబిసి, జీ 5 కలిసి ఈ నిర్మాణం చేశాయి. రచన చంద్ర పెమ్మరాజు. దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి. 7 ఎపిసోడ్ల ‘గాలివాన’ దాదాపు మూడున్నర గంటల నిడివి ఉంది. మర్డర్ మిస్టరీ కనుక ఆసక్తి సహజం. అందులో ఉప కథలు కూడా ఉండటంతో వేదికలు మారుతూ కథ ముందుకు కదులుతుంది. హంతకుణ్ణి చంపాక తమలో ఎవరో ఒకరు చంపారు అని అందరికీ తెలుసు. కాని అందరూ అందరినీ కాపాడుకోవాలనే చూస్తారు. కాని వ్యక్తులు నిస్సహాయ స్థితిలో ఉన్న సమయంలో కూడా వారిని పీక్కు తిని లబ్ధి పొందాలని చూసే వారుంటారు. బ్లాక్మెయిల్ చేసి ఇంకా టెన్షన్ ఇస్తారు. అలా టెన్షన్ పెట్టే పాత్రలు కూడా ఉన్నాయి. అంటే పరిస్థితులను బట్టి మనిషి నీచుడా, గొప్పవాడా అనేది తేలుతుంది. అదే సమయంలో నేరం, పాపం అనే చర్యల చర్చ కూడా ఉంటుంది. మన కుటుంబ సభ్యులను చంపినవాడిని చంపడం నేరం ఎలా అవుతుంది? అని అందరూ అనుకుంటారు. కాని అలా చంపడం పాపం కదా. అలాగే తల్లిదండ్రులు చేసే తప్పులు, పాపాలు పిల్లలను ఎలా వెంటాడుతాయో ఈ కథలో ఉంటుంది. పెళ్లికి ముందు ప్రేమలు, పెళ్లి తర్వాత విడాకులు అవి ఎక్కడికీ పోవు. తర్వాతి తరాలకు శాపాలుగా మారే అవకాశం ఉంటుందని చూపుతారు. అసలు కథేమిటంటే వీరిలో ఒకరు ఆ హంతకుణ్ణి చంపారు. నిజానికి వీరిలో ఒకరు ఆ కొత్త వధువరులను చంపడానికి కూడా కారకులయ్యారు. ఆ ఒకరు ఎవరు అనేదే కథ. ఖర్చుకు వెనుకాడకుండా రాధిక, సాయికుమార్ వంటి సీనియర్లను పెట్టి తీయడం వల్ల సిరీస్ నిలబడింది. కొడుకును కోల్పోయిన దుఃఖం, ఉన్నవారిని కాపాడుకోవాలనే తపన రాధికలో అలవోకగా పలికింది. సాయికుమార్ తన గొంతుతోనే సగం ఎఫెక్ట్ తీసుకు వచ్చాడు. సిరీస్‌కు మరో కీలకపాత్ర అయిన చాందిని తన శక్తికి మించి రక్తి కట్టించింది. నందిని రాయ్‌కు మంచి పాత్ర. కాని చివరి ఎపిసోడ్లు మరింత బాగుండాల్సింది. నేరం జరిగినా, పాపం జరిగినా అందుకు బదులుగా చేసే పని ఏదైనా కావచ్చుగాని ప్రాణం తీసేది మాత్రం కాకూడదు. మనిషి ప్రాణం తీస్తే అది ఏక కాలంలో నేరం, పాపం. రోజూ పేపర్లలో ఎన్నో క్షణికావేశాల చర్యలు కనిపిస్తాయి. వాటి నుంచి బయటపడి జీవితాలను కాపాడుకోవాలని ఈ సిరీస్ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఏప్రిల్ 14న విడుదలైంది. జీ5లో చూడండి. -
కొడుకును చంపినవాడే ఇంటికొస్తే.. 'గాలివాన' వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్: గాలివాన జానర్: క్రైమ్ అండ్ మిస్టరీ, థ్రిల్లర్ నటీనటులు: సాయి కుమార్, రాధికా శరత్ కుమార్, చాందిని చౌదరి, నందిని రాయ్, చైతన్య కృష్ణ, శరణ్య, తాగుబోతు రమేష్ తదితరులు దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి నిర్మాత: శరత్ మరార్ సంగీతం: హరి గౌర సినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థ ఓటీటీ: జీ5 విడుదల తేది: ఏప్రిల్ 14, 2022 ప్రస్తుతం ఓటీటీల హవా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ 'జీ5' తనదైన ముద్ర వేస్తూ వెబ్ సిరీస్‌లు, సినిమాలతో ముందుకు సాగుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే బీబీసీతో కలిసి జీ5, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్స్ 'గాలివాన' వెబ్ సిరీస్‌ను నిర్మించాయి. ఈ వెబ్ సిరీస్‌తో సీనియర్ నటుడు సాయి కుమార్, రాధికా శరత్ కుమార్‌లు తొలిసారిగా డిజిటల్ తెరకు పరిచయమయ్యారు. కిర్రాక్ పార్టీ, తిమ్మరుసు చిత్రాల దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి ఈ వెబ్‌సిరీస్‌ను డెరెక్ట్ చేశాడు. సాయి కుమార్, రాధికా శరత్ కుమార్‌తోపాటు చాందిని చౌదరి, నందిని రాయ్, చైతన్య కృష్ణ, అశ్రిత, శరణ్య ప్రదీప్, తాగుబోతు రమేష్ తదితరులు నటించిన ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 14న జీ5లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్న 'గాలివాన' వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. కథ: కొమర్రాజు (సాయి కుమార్) కూతురు గీత, సరస్వతి (రాధికా శరత్ కుమార్) కుమారుడు అజయ్ వర్మ చిన్నప్పటి నుంచి ఒకరినొకరు ప్రేమించుకుంటారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. హనీమూన్‌కు వెళ్లిన ఈ జంటను శ్రీను అనే యువకుడు దారుణంగా హత్య చేస్తాడు. తర్వాత కారులో పారిపోతూ గాలివాన కారణంగా సరస్వతి ఇంటి ముందు యాక్సిడెంట్‌కు గురవుతాడు. తీవ్ర గాయాలపాలైన శ్రీనును సరస్వతి కుటుంబ సభ్యులు కాపాడి చికిత్స అందించడానికి సిద్ధమవుతారు. ఇంతలో వారి కూతురు అల్లుడిని చంపింది శ్రీనునే అని తెలుస్తుంది. ఆ మరసటి రోజు శ్రీను హత్యకు గురవుతాడు. శ్రీను చంపింది ఎవరు ? తమ వాళ్లను చంపిన వ్యక్తి తమ ఇంట్లోకి వస్తే ఆ కుటుంబ సభ్యులు ఏం చేశారు ? అసలు గీత, అజయ్ వర్మలను శ్రీను ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది ? అనేది 'గాలివాన' వెబ్ సిరీస్ కథ. విశ్లేషణ: బీబీసీ మినీ సిరీస్‌గా వచ్చిన 'వన్ ఆఫ్ అజ్'కు అఫిషియల్ రీమేక్‌గా తెరకెక్కిందే 'గాలివాన' వెబ్ సిరీస్. కిర్రాక్ పార్టీ, తిమ్మరుసు వంటి రీమేక్ సినిమాలను డైరెక్టర్ చేసిన శరణ్ కొప్పిశెట్టి ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఇదివరకూ శరణ్ కొప్పిశెట్టి డైరెక్ట్ చేసినవి రీమేక్ చిత్రాలే కావడంతో ఈ బీబీసీ మినీ సిరీస్‌ను కూడా తెలుగు నేటివిటీకి తగినట్లే చిత్రీకరించాడు. పల్లెటూరులో జరిగే ఈ కథకు అనువుగా పాత్రల ఎంపిక బాగుంది. ఆయుర్వేద వైద్యుడిగా సాయి కుమార్, ముగ్గురు పిల్లల ఒంటరి తల్లిగా రాధికా శరత్ కుమార్. సరస్వతి పిల్లలుగా చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, తదితరులు వారి పాత్రలకు చక్కగా సరిపోయారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటను హత్య చేయడంతో ప్రారంభమైన 'గాలివాన' ఆసక్తిగా ఉంటుంది. తర్వాత మర్డర్ చేసిన వ్యక్తి దంపతుల ఇంటి ముందు యాక్సిడెంట్‌కు గురికావడం, అతనే కిల్లర్ అని ఆ కుటుంబ సభ్యులకు తెలవడం, ఇంతలో అతను కూడా చంపబడటం థ్రిల్లింగ్‌గా ఫస్ట్ ఎపిసోడ్ సాగుతోంది. ఇక తర్వాత ఎపిసోడ్లు సాదాసీదాగా ఉంటాయి. కొంచెం సీరియల్ అనుభూతిని కలిగిస్తాయి. అయితే తమ పిల్లల హత్యతో రెండు కుటుంబాలు ఎలాంటి వేదనకు గురయ్యాయి అనేది చాలా చక్కగా చూపించారు. పాత్రల పరిచయం, వారి స్వభావం చూపించే ప్రయత్నంలో కొంతవరకు బోరింగ్‌గా అనిపిస్తుంది. తర్వాత జంటను చంపిన కిల్లర్ పట్టుకునేందుకు వచ్చిన పోలీస్ ఆఫిసర్‌గా నందిని రాయ్ ఎంట్రీతో కథలో ఆసక్తి మొదలవుతుంది. ఒక పక్క నందిని రాయ్ కిల్లర్‌ను పట్టుకునే ప్రయత్నం చేయగా మరోవైపు కిల్లర్ శవాన్ని మాయం చేసే పనిలో రెండు కుటుంబాలు ఉండటం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే ఈ సీన్లు కొద్దివరకు 'దృశ్యం' మూవీని తలపిస్తాయి. అలాగే కిల్లర్ శ్రీనును హత్య చేసింది తమలోని వారే అని ఒకరిపై ఒకరు అనుమానపడటం మనుషులను పరిస్థితులను ఎలా మారుస్తాయే తెలిసేలా అద్దం పడుతాయి. సరస్వతి భర్త ఎపిసోడ్ నిడివి పెంచినట్లే ఉంది గానీ అంతగా ఆకట్టుకోలేదు. ఒక ట్విస్ట్ తర్వాత ఒక ట్విస్ట్‌తో చివరి రెండు ఎపిసోడ్స్ ఉత్కంఠభరితంగా సాగాయి. 7 ఎపిసోడ్లు కాకుండా కొన్ని ఎపిసోడ్లు తీసేస్తే ఈ వెబ్ సిరీస్ మరింతబాగా ఆకట్టుకునేది. ఎవరెలా చేశారంటే ? ఆయుర్వేద వైద్యుడిగా, గ్రామానికి పెద్ద దిక్కుగా సాయి కుమార్ నటన బాగుంది. ఆయన పాత్రకు తన నటనతో న్యాయం చేశారనే చెప్పవచ్చు. ఇక రాధిక శరత్ కుమార్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముగ్గురు పిల్లల ఒంటరి తల్లిగా, భర్త వదిలేసిన భార్యగా, అనవసరపు ఆలోచనలతో భయపడిపోయే గృహిణిగా ఆమె సరస్వతి పాత్రలో ఒదిగిపోయారు. చైతన్య కృష్ణ, చాందిని చౌదరి, అశ్రిని వేముగంటి, శరణ్య ప్రదీప్ వారి పరిధి మేర బాగానే నటించారు. నందిని రాయ్ తన నటనతో ఆకట్టుకున్న ఆ పాత్ర అంతగా ప్రభావం చూపించలేకపోయింది. నందినిరాయ్కు అసిస్టెంట్‌గా అంజి పాత్రలో తాగుబోతు రమేష్ నటన బాగుంది. సీనియర్ లేడీ కమెడియన్ శ్రీ లక్ష్మీ రెండు, మూడు సన్నివేశాల్లో కనిపించి పర్లేదనిపించారు. టెక్నికల్ టీం వర్క్ బాగుంది. హరి గౌర బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. అయితే థ్రిల్లర్ సినిమాలు ఫాస్ట్ స్క్రీన్ ప్లేతో ముందుకు సాగితే.. వెబ్ సిరీస్‌లు మాత్రం కాస్త నెమ్మదిగానే నారేట్ చేయబడుతాయి. ఎండింగ్లో వచ్చే ట్విస్ట్‌లు, కారణాలు బాగుంటే ఆ వెబ్ సిరీస్ ఆకట్టుకున్నట్టే. మొత్తంగా ఈ 'గాలివాన' వెబ్ సిరీస్ థ్రిల్లింగ్ కంటే మిస్టీరియస్‌గా బాగానే ఆకట్టుకుంటుంది. -
ఈ అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ కానున్న క్రైం థ్రిల్లర్ ‘గాలివాన’, ఎక్కడంటే
సీనియర్ నటుడు సాయి కుమార్, రాధిక శరత్ కుమార్‌లు నటించిన వెబ్ సిరీస్ గాలివాన. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రస్తుతం ఓటీటీల హావా సాగుతున్న నేపథ్యంలో జీ5 సంస్థ తనదైన ముద్రను వేస్తూ ముందుకు కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లను ప్రేక్షకులకు అందిస్తోంది. ఈక్రమంలో తాజాగా 'గాలివాన' వెబ్ సిరీస్‌ను ఈ రోజు అర్థరాత్రి (ఏప్రిల్ 14) నుంచి స్ట్రీమింగ్ చేయబోతోంది. చదవండి: అందుకే మీకు చరణ్ డామినేషన్ ఎక్కువ ఉందనిపిస్తుంది ఈ వెబ్ సిరీస్ లో రాధిక, సాయికుమార్‌లతో పాటు చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, అశ్రిత, శరణ్య ప్రదీప్, తాగుబోతు రమేశ్ తదితరులు నటించారు. కుటుంబ అనుబంధాలకు సంబంధించిన ఎమోషన్స్ తో ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. క్వాలిటీ పరంగా ఈ వెబ్ సిరీస్ భారీగా కనిపిస్తోంది. మదర్ సెంటిమెంట్, క్రైమ్ థిల్లర్ అంశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు. ఈ సిరీస్‌ను బీబీసీ స్టూడియోస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మించారు. #Gaalivaana storm arriving tomorrow exclusively on #ZEE5.#StormComingSoon 🌪🌪 #GaalivaanaOnZEE5 #PremieresTomorrow #AZEE5Original @realradikaa #SaiKumar @iChandiniC @99_chaitu @ImNandiniRai #ThagubothRamesh #SharanyaPradeep @nseplofficial @bbcstudiosindia @sharandirects pic.twitter.com/qO5v67qmAM — ZEE5 Telugu (@ZEE5Telugu) April 13, 2022 -
పేరు ప్రతిష్టల కోసం.. నాన్న ఎన్నడూ ...
రాజమండ్రి : ‘గాలివాన కథానిక ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొందిన పాలగుమ్మి పద్మరాజు.. సినిమా రంగంలో ఎంతో ఎత్తుకు ఎదిగాక కూడా, కొంతమంది సినీవాలాలకు ఘోస్ట్ రైటర్‌గా ఎందుకు పని చేశారు?’ - ఇదే సందేహాన్ని ఆయన కుమార్తెలు సీత, రత్నలతో ‘సాక్షి’ ప్రస్తావించింది. తమ తండ్రి శతజయంత సంవత్సరాన్ని పురస్కరించుకుని రాజమండ్రిలో జరిగిన సభలో పాల్గొన్న వారు.. నాటి జ్ఞాపకాలను ఇలా ఆవిష్కరించారు. అచ్చమైన మానవతావాది పేరు ప్రతిష్టల కోసం మా నాన్నగారు ఎప్పుడూ పాకులాడేవారు కాదు. ఎవరు వచ్చి కోరినా, రాయడానికి అంగీకరించేవారు. ఈ నేపథ్యంలోనే పలువురు సినీ ప్రముఖులకు ఘోస్ట్ రైటర్‌గా పని చేశారు. వాళ్ల పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు. ఆయన అచ్చమైన మానవతావాది. కాలేజీ రోజుల వరకూ మా కులం ఏమిటో మాకు తెలియదు. నా (పాలగుమ్మి సీత) భర్త బాలు అనే మలయాళీ. నా (పాలగుమ్మి రత్న) భర్త కార్తికేయన్ అనే తమిళుడు. అందుకనే వివాహాలయ్యాక కూడా మేం పాలగుమ్మి సీత, పాలగుమ్మి రత్నలుగా మిగిలిపోయాం. దేవులపల్లిని తాతయ్య అని పిలుచుకునేవాళ్లం దేవులపల్లి కృష్ణశాస్త్రి చెన్నై వచ్చిన కొత్తలో మాతో రెండేళ్లు కలిసి ఉన్నారు. మా నాన్నగారికి తొమ్మిదేళ్ల ప్రాయంలోనే ఆయన తండ్రి గతించారు. మాకు తాత అంటే దేవులపల్లి కృష్ణశాస్త్రిగారే. సినీ ప్రముఖులు వస్తూండేవారు రాత్రి సుమారు 10 గంటలకు వాహినీ స్టూడియో నుంచి నాన్నగారు వచ్చేవారు. ప్రముఖ దర్శక నిర్మాత బీఎన్ రెడ్డి, సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు, దాశరథి, ఆరుద్ర, పీబీ శ్రీనివాస్ తదితరులు వస్తూండేవారు. నాన్నగారి ప్రభావం 1978లో కాకినాడలో నాన్నగారికి సన్మానం జరిగింది. దేవులపల్లి కృష్ణశాస్త్రి ఒక అభినందన వ్యాసం రాసి పంపారు. ‘పాలగుమ్మి పద్మరాజు పాటలు రాస్తే, మా నోట్లో మన్నే’ అని వ్యాసంలో పేర్కొన్నారు. నాన్నగారు రాసిన గాలివాన, బంగారుపాప సినిమాలు పూర్తయ్యాకే మేం పుట్టాం. ఆయన ప్రభావంవల్లనే కొన్ని కథలు, సీరియళ్లకు స్క్రిప్టులు రాస్తున్నాం. మురళీమోహన్ మాటలునీటిమూటలు రాజమండ్రి : తెలుగు సాహిత్యానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన పాలగుమ్మి పద్మరాజు శతజయంత్యుత్సవాలను అధికారికంగా నిర్వహించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడతానంటూ.. రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ ఇచ్చిన హామీ నీటిమూటగా మిగిలిందని ప్రముఖ కథా రచయిత వేదగిరి రాంబాబు విమర్శించారు. జూన్ 24న రాజమండ్రి ఆనం కళాకేంద్రం మేడపై ఉన్న గంథం నాగసుబ్రహ్మణ్యం వేదికపై మురళీమోహన్ ఈ హామీ ఇచ్చారన్నారు. ఈ వాగ్దానం నిజమయ్యే దాఖలాలు కనిపించడంలేదని ఆవేదన వ్యక్తం చేసారు. పాలగుమ్మి శతజయంత్యుత్సవంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. నాడు జరిగిన సభలో పాలగుమ్మి పద్మరాజు తన గురువు (దాసరి నారాయణరావు)కే గురువని, తాను పాలగుమ్మికి ‘ప్రశిష్యుడినని’ మురళీమోహన్ చెప్పుకున్నారన్నారు. కానీ, ఆచరణ శూన్యమని విమర్శించారు. తన సంస్థ వేదగిరి కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో పాలగుమ్మి శతజయంతి సంవత్సరాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీ, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల్లో కూడా సభలు నిర్వహించామని రాంబాబు తెలిపారు. ‘తెలంగాణలోని రచయితలను అక్కడి కేసీఆర్ ప్రభుత్వం ఎంతో గౌరవిస్తోంది. మనకు ఆ అదృష్టం లేదు. భారతీయ సాహిత్యంలో తొలిసారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ అంతర్జాతీయ గుర్తింపు పొందారు. రెండో వ్యక్తి తెలుగువాడైన పాలగుమ్మి పద్మరాజు. ఆ మహనీయుని శతజయంతి సందర్భంగా కనీసం ఒక చిన్నపాటి సభను నిర్వహించే శ్రద్ధ ప్రభుత్వానికి లేకపోవడం దారుణం’ అని రాంబాబు అన్నారు.