
గడప దాటని టీడీపీ
*ప్రజల్లోకి వెళ్లేందుకు జంకుతున్న క్యాడర్
*పార్టీ కార్యక్రమాలకు దూరంగా నాయకులు
*అధినేత పిలుపును పట్టించుకోని వైనం
*తమ్ముళ్లలో అలుముకున్న నైరాశ్యం
*‘రచ్చబండ’లో మాత్రం చురుగ్గా పాల్గొంటున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు
* పక్కచూపులు చూస్తున్న సీనియర్లు
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ నాయకత్వం ప్రజల్లోకి వెళ్లేందుకు జంకుతోంది. మరో ఐదు నెలల్లో జరిగే ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేయాలని, తాజా రాజకీయ పరిణామాలను అనుకూలంగా మలుచుకునేందుకు గడపగడపకూ వెళ్లాలని అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపును తమ్ముళ్లు పెద్దగా పట్టించుకోవడంలేదు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు ‘ఇంటింటికీ తెలుగుదేశం’ పేర ప్రతి గ్రామానికి పార్టీ నేతలు తరలివెళ్లాలని నిర్దేశించారు.
ఈ నెల 18న ప్రారంభమైన ఈ కార్యక్రమంపై జిల్లా నాయకత్వం అంతగా ఆసక్తి చూపడంలేదు. మూడు రోజులు గడిచినప్పటికీ సీనియర్లు ఎక్కడా సభల్లో పాల్గొన్న దాఖలాల్లేవు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘రచ్చబండ’లో చురుగ్గా పాల్గొంటున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు.. సొంత పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉన్నారు. ఏదో మొక్కుబడిగా ఒకట్రెండు మండలాల్లో ఈ కార్యక్రమం నిర్వహించి చేతులు దులుపుకున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని, ప్రతి గడప తాకి పార్టీ విధానాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వివరించాలని రాష్ట్ర నాయకత్వం మార్గనిర్దేశం చేసింది.
ఈ నేపథ్యంలోనే తొలుత సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి.. కార్యక్రమం ఉద్దేశాన్ని నాయకులకు విశదీకరించాలని జిల్లా కమిటీకి సూచించింది. జిల్లా నాయకత్వం మాత్రం విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం దేవుడెరుగు.. కనీసం నియోజకవర్గ ఇన్‌చార్జిలతో కూడా భేటీ కాకపోవడం గమనార్హం. కేవలం విలేకర్ల సమావేశంలో కార్యక్రమం షెడ్యూల్‌ను ప్రకటించి మమ అనిపించింది. ఆది నుంచి తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న జిల్లాలో అధినాయకత్వం అనుసరిస్తున్న తీరు తమ్ముళ్లను కలవరపరుస్తోంది. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో గత నాలుగేళ్లుగా నిస్తేజంలో కూరుకుపోయిన కార్యకర్తల్లో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ టానిక్‌లా పనిచేస్తుందని భావించినప్పటికీ, సీనియర్ల వ్యవహార శైలి వారికి మింగుడు పడడంలేదు.
ప్రత్యేక ప్రకటనతో డీలా!
తెలంగాణ ప్రకటనతో చోటుచేసుకున్న రాజకీయ సమీకరణలు పార్టీ నేతలను ఆత్మరక్షణలో పడేశాయి. ‘మన లేఖతోనే రాష్ట్ర విభజన జరిగిందనే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిలుపునిచ్చినప్పటికీ పార్టీ నాయకుల్లో మాత్రం ఉలుకూపలుకు లేకుండా పోయింది. తెలంగాణ ప్రకటన అనంతరం కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల దూకుడు ముందుకుసాగుతుండగా.. టీడీపీలో మాత్రం నైరాశ్యం అలుముకుంది. జిల్లాలో నెలకొన్న విచిత్ర పరిస్థితి కూడా తమ్ముళ్లను ఆత్మరక్షణలో పడేసింది.
సీమాంధ్ర ఉద్యమం ఎగిసిపడుతున్న తరుణంలో తెలంగాణ వాదం వినిపిస్తే.. జిల్లాలో గణనీయస్థాయిలో ఉన్న సీమాంధ్రుల మనోభావాలు దెబ్బతింటాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. గెలుపోటములను నిర్ధేశించే స్థాయిలో మెజార్టీ నియోజకవర్గాల్లో ఓటర్లు ఉండడంతో ప్రత్యేకవాదంపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎవరికి అనుకూలంగా మాట్లాడినా.. మరొకరితో నిష్టూరపడాల్సి వస్తుందనే భయంతో ఈ వ్యవహారంలో తలదూర్చడంలేదు.
గోడ దూకే వారెందరో?
పార్టీలో కొనసాగాలా? వేరే పార్టీలోకి జంప్ చేయాలా? అనే సంశయంలో ఉండడంతో పలువురు సీనియర్లు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకునేందుకు విముఖత చూపుతున్నట్లు అంతర్గతంగా చర్చ జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉధృతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాల్సింది పోయి.. స్తబ్ధుగా ఉండడానికి ఇదే కారణమనే ప్రచారం సాగుతోంది. తెలంగాణ లో టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు సన్నగిల్లినట్లు భావిస్తున్న కొందరు ముఖ్యులు పక్కపార్టీల వైపు చూస్తున్నారు.
టీడీపీలో కొనసాగి రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసుకోవడం కంటే.. అధికారంలోకి వచ్చే పార్టీలోకి దూకడం బెటరని భావిస్తున్న ఒకరిద్దరు అగ్రనేతలు ఇతర పార్టీల నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో టీడీపీ కార్యక్రమాలను మెల్లగా తగ్గిస్తున్నట్లు కనిపిస్తోంది.