సీఎం జగన్‌ స్పందనతో అక్రమాల పుట్ట కదులుతోంది | Irregularities In SVV College Of Nursing | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ స్పందనతో అక్రమాల పుట్ట కదులుతోంది

Published Tue, Jul 16 2019 8:29 AM | Last Updated on Tue, Jul 16 2019 8:29 AM

Irregularities In SVV College Of Nursing - Sakshi

రెండు నర్సింగ్‌ కళాశాలలు నిర్వహిస్తున్న భవనం ఇదే  

‘ఒకటే కళాశాల.. రెండు పేర్లు.. భవనం ఒకటే.. అడ్రస్‌లు వేర్వేరుగా ఉంటాయి.. విద్యార్థినులను రెండు కళాశాలల్లో చదువుతున్నట్లు చూపిస్తారు. ఏ కళాశాలకు తనిఖీలకు వస్తే అక్కడి విద్యార్థినులుగా కలరింగ్‌ ఇస్తారు. ప్రాక్టికల్‌ పరీక్షలు ఉండవు..చదువు చెప్పే గురువులు ఉండరు.. ఇంటి పని, వంట పని చేస్తే మార్కులు వేస్తూ విద్యార్థినులకు నరకం చూపించారు. ఏళ్ల తరబడి నాలుగు గోడల మధ్య జరుగుతున్న ఈ అక్రమాల దందా, నరక కూపం ఎట్టకేలకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి రావటంతో వెలుగులోకి వచ్చింది. పూర్తి స్థాయిలో విచారించిన అధికారులకు అక్కడ జరుగుతున్న అక్రమాలను చూసి ఉలిక్కిపడుతున్నారు. కళాశాల యాజమాన్యం చుట్టూ ఉచ్చుబిగుస్తోంది.

సాక్షి, తిరుపతి రూరల్‌: తిరుపతి రూరల్‌ మండలం పుదిపట్ల పంచాయతీలో ఒకే భవనంలో ఎస్వీ, శ్రీవెంకట విజయ నర్సింగ్‌ కళాశాలలను నిర్వహిస్తున్నారు. కళాశాలల నిర్వాహకురాలు విజయ పెడుతున్న వేధింపులు, గృహహింసపై విద్యార్థినులు కలెక్టర్, అర్బన్‌ ఎస్పీ, సబ్‌ కలెక్టర్, తహసీల్దార్‌లకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అధికారులు, పోలీసులు కళాశాలకు వచ్చి విద్యార్థినులను విచారించకుండానే యాజమాన్యంతో చర్చలు జరుపుకుని, కాసుల మోజులో అన్యాయం చేశారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు విన్నవించుకున్నా న్యాయం జరగకపోవటంతో గత నెల 23వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి ఈ–మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. గృహహింస, వేధింపులు, కళాశాల అక్రమాలకు సంబంధించి ఆధారాలతో వీడియోలను, ఫిర్యాదును పంపించారు. స్పందించిన సీఎం 24వ తేదీన అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో విద్యార్థినుల ఆవేదనను, వారి బాధలతో కూడిన లేఖను చూపించారు. అలాంటి కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. విద్య పట్ల, విద్యార్థుల సౌకర్యాలు, భద్రత పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దని స్పష్టం చేశారు.

పూర్తి స్థాయిలో విచారణ..
కళాశాలలో జరుగుతున్న అక్రమాలు, ఒకే కళాశాల పేరుతో రెండు కళాశాలలను నడిపిస్తున్న వైనంపై కలెక్టర్‌ భరత్‌గుప్త విచారణకు ఆదేశించారు. తిరుపతి సబ్‌ కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో విద్య, వైద్య, రెవెన్యూ, తుడా, పంచాయతీరాజ్‌ శాఖాధికారులు విచారణ జరిపారు. అక్రమాలు నిజమేనని నిర్ధారించారు. కళాశాల యాజమాన్యంపై చర్యలకు సిఫారసు చేశారు. విద్యార్థినుల ఫిర్యాదుపై ముఖ్యమంత్రి వేగంగా స్పందించారని తెలుసుకున్న ఎస్వీవీ నర్సింగ్‌ కళాశాల యాజమాన్యం తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలను మొదలుపెట్టింది. అధికారులు ఎక్కడ దాడులు చేస్తారోనని అప్రమత్తమయ్యారు. కళాశాల సూచిక బోర్డును తీసివేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కళాశాలను మూసేసినట్లు గేటుకు బోర్డులు వేలాడదీశారు.

విద్యార్థినులకు న్యాయం చేసే దిశగా...
అక్రమాలకు పాల్పడిన వెంకటేశ్వర, వెంకట విజయ నర్సింగ్‌ కళాశాలపై చర్యలకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ముందుగా విద్యార్థినులకు న్యాయం చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. అందులో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటలకు శ్రీవెంకటేశ్వర నర్సింగ్‌ కళాశాల, శ్రీవెంకటవిజయ నర్సింగ్‌ కళాశాలలో చదువుతున్న అన్ని సంవత్సరాల విద్యార్థినులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, గుర్తింపుకార్డు, అడ్మిషన్‌ కార్డులతో హాజరుకావాలని కలెక్టర్‌ భరత్‌గుప్త సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం కళాశాలపై చర్యలు తీసుకునే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.\

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement