ప్రశ్నపత్రం లీకైందా..? | is PG medical entrance exams paper leaked? | Sakshi
Sakshi News home page

ప్రశ్నపత్రం లీకైందా..?

Published Wed, Mar 26 2014 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 5:09 AM

is PG medical entrance exams paper leaked?

‘పీజీ మెడికల్ ఎంట్రన్స్’ స్కామ్‌లో సీఐడీ అనుమానం  
24 మంది పీజీ ర్యాంకర్లపై అధికారుల కన్ను
వర్సిటీ రిజిస్ట్రార్ బాబూలాల్ వాంగ్మూలం నమోదు
ప్రశ్నపత్రం ముద్రించిన మంగళూరులోని ప్రెస్‌లో మెటీరియల్ సీజ్

 
సాక్షి, హైదరాబాద్: పీజీ మెడికల్ ఎంట్రన్స్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై రాష్ట్ర నేరపరిశోధన విభాగం (సీఐడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ప్రాథమికంగా సేకరించిన వివరాల ప్రకారం పరీక్షకు ముందే పేపర్ లీక్ అయిందని అధికారులు అనుమానిస్తున్నారు. అలా బయటకొచ్చిన ప్రశ్నపత్రం కొందరికి అందినట్లు భావిస్తున్నారు. లీక్‌కు సూత్రధారులు, పాత్రధారులు ఎవరో కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలు మూడు రాష్ట్రాల్లో దర్యాప్తు చేస్తున్నాయి. సీఐడీ పోలీసులు మంగళవారం ఎన్టీఆర్ వర్సిటీ రిజిస్ట్రార్ ఎస్.బాబూలాల్ వాంగ్మూలం నమోదు చేశారు. పరీక్షల విభాగం అధికారులదే పీజీ ఎంట్రన్స్ నిర్వహణ బాధ్యత అని రిజిస్ట్రార్ చెప్పారు. మరోవైపు వర్సిటీ అధికారులు అంతర్గతంగా చేపట్టిన విచారణలో 24 మంది అభ్యర్థులకు వచ్చిన మార్కులు, ర్యాంకులపై అనుమానాలు వ్యక్తం కావడంతో ఈ వివరాలనూ సీఐడీ అధికారులు సేకరించారు.
 
 వీరికి పదో తరగతి, ఇంటర్, ఎంసెట్ ఎంట్రన్స్‌లో వచ్చిన మార్కులు, ర్యాంకులను విశ్లేషించిన నేపథ్యంలో దర్యాప్తు అధికారులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరంతా గతంలో కర్ణాటకకు సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (కొమెడ్ కే) రాసిన వారే. కానీ, అందులో వారు సాధించిన ర్యాంకుకు, ఏపీపీజీలో సాధించిన ర్యాంకుకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. వారు ఎవరెవరితో మెయిల్, ఫోన్ సంప్రదింపులు జరిపారనేది విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా 17 మంది వైద్య విద్యార్థులు, కొందరు ప్రైవేటు వ్యక్తులు ఈ కుంభకోణంలో కీలకపాత్ర వహించినట్లు అనుమానిస్తున్న అధికారులు వారి కోసం గాలిస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో వర్సిటీ రిజిస్ట్రార్ అందజేసిన కొందరు విద్యార్థుల సెల్ నంబర్ల ఆధారంగా నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మ రం చేశారు. సోమవారం అర్ధరాత్రి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అనుమానితుల నివాసాలపై అధికారులు దాడులు నిర్వహించినట్లు సమాచారం.
 
 ముద్రణ, రవాణా సమయంలో లీక్?
 మొత్తం ఐదు ప్రత్యేక బృందాలు హైదరాబాద్, విజయవాడతో పాటు కర్ణాటక, చండీగఢ్‌లో దర్యాప్తు చేపట్టాయి. 2012లో చండీగఢ్ పీజీ మెడికల్ ఎంట్రన్స్ స్కామ్‌లో నిందితుడిగా ఉన్న విద్యార్థికి ఈ పరీక్షలో మెరుగైన ర్యాంకు రావడంతో అతడి పాత్రను అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ బృందం చండీగఢ్ బయలుదేరింది. మరోవైపు ఎన్టీఆర్ వర్సిటీ నిర్వహించిన పరీక్ష ప్రశ్నపత్రాలు కర్ణాటకలోని మంగళూరులో ఉన్న ఓ ప్రెస్‌లో ముద్రితమైనట్లు సీఐడీ గుర్తించింది. దీంతో దర్యాప్తు కోసం ఓ బృందం అక్కడికి బయలుదేరింది. క
 
 ర్ణాటక పోలీసులకు సమాచారం ఇచ్చి ప్రెస్‌లో ఉన్న కొన్ని డాక్యుమెంట్లు, ఇతర సామగ్రిని అనధికారికంగా సీజ్ చేరుుంచారు. ఆ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నపత్రాలు రవాణా చేసే సందర్భంలో ఎస్కార్ట్ డ్యూటీలో ఉన్న సిబ్బందిని, వర్సిటీలో భద్రపరిచినప్పుడు విధుల్లో ఉన్న వారినీ ప్రశ్నించాలని సీఐడీ నిర్ణయించింది. స్కామ్ జరిగినట్లు ఆరోపిస్తున్న, ఆరోపణలు ఎదుర్కొంటున్న ర్యాంకర్లు, వారి తల్లిదండ్రుల్నీ ప్రశ్నించాలని నిర్ణయించిన సీఐడీ అధికారులు మంగళవారం కొందరి వాంగ్మూలాలు నమోదు చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement