Year Ender 2024: లీకుల నామ సంవత్సరం | year ender 2024 from neet ug to ssc mts check list of exam paper leak this year | Sakshi
Sakshi News home page

Year Ender 2024: నీట్‌ యూజీ నుంచి ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్‌ వరకూ.. లీకుల నామ సంవత్సరం

Published Tue, Dec 17 2024 9:35 AM | Last Updated on Tue, Dec 17 2024 11:09 AM

year ender 2024 from neet ug to ssc mts check list of exam paper leak this year

2024లో దేశంలో భారీ రిక్రూట్‌మెంట్‌లు జరిగాయి. అలాగే వివిధ కోర్సులలో చేరేందుకు ప్రవేశపరీక్షలు కూడా నిర్వహించారు. ఈ నేపధ్యంలో పలు పేపర్ల లీకుల కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో జరుగుతున్న పరీక్షలపై లెక్కకుమించిన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

యూపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష పేపర్ లీక్ కేసు 2024 ఫిబ్రవరిలో వెలుగు చూసింది.  ఆ తర్వాత నీట్‌ యూజీ, సీయూఈటీ, బీహార్‌ సీహెచ్‌ఓ, ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ పరీక్షా పత్రాలు లీకయ్యాయి.

యూపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష 
2024 ఫిబ్రవరిలో జరిగిన యూపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు దాదాపు 45 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష పేపర్‌ లీక్ కావడంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ రిక్రూట్‌మెంట్ పరీక్షను రద్దు చేశారు. 2024 ఫిబ్రవరి 18న పరీక్ష ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు పేపర్ లీక్ అయింది. యూపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష పేపర్లను రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు విక్రయించారని తేలింది. ఈ కేసులో 244 మందిని అరెస్టు చేశారు.

సీఎస్‌ఐఆర్‌ ఎస్‌ఓ ఎఎస్‌ఓ రిక్రూట్‌మెంట్ 
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్.. ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లలో 444 ఎస్‌ఓ, ఏఎస్‌ఓ పోస్టులకు అంటే సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌ల రిక్రూట్‌మెంట్ కోసం పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్ష పేపర్‌ను లీక్‌ చేసిన ఉదంతంలో పలు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు, సాల్వర్ ముఠాలు పోలీసులకు చిక్కారు. వీరు ఎనీడెస్క్ యాప్ ద్వారా కాపీయింగ్‌కు సహకరించారని తేలింది.

యూపీపీఎస్‌సీ ఆర్‌ఓ, ఏఆర్‌ఓ పేపర్ లీక్ 
ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2024, ఫిబ్రవరి 11న  ఆర్‌ఓ, ఏఆర్‌ఓ ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది. పేపర్ లీక్ విషయం వెలుగులోకి రావడంతో యూపీపీఎస్‌సీ ఆర్‌ఓ, ఏఆర్‌ఓ పరీక్షను రద్దు చేశారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం హర్యానాలోని మనేసర్, మధ్యప్రదేశ్‌లోని రేవాలో రిసార్ట్‌లు బుక్ చేశారు. అక్కడ ప్రశ్నాపత్రాలు లీక్‌ చేశారు.  

నీట్‌ యూజీ పేపర్ లీక్ 
నీట్‌ యూజీ పేపర్ లీక్ వార్త చాలాకాలం వార్తల్లో నిలిచింది. ఈ మెడికల్ ప్రవేశ పరీక్ష మే 5న జరిగింది. నీట్ యూజీ పేపర్ లీక్ దరిమిలా 1,563 మంది అభ్యర్థులు లబ్ధిపొందినట్లు తేలింది. ఈ ​కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో నీట్  పరీక్షలో చోటుచేసుకున్న అక్రమాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. నీట్‌ యూజీ నిర్వహణ అధికారులు రివైజ్డ్ రిజల్ట్‌లో టాపర్ల సంఖ్య 61 నుండి 17కి తగ్గించారు.

యూజీసీ నెట్‌ పేపర్ లీక్ 
2024 జూన్ 18న జరిగిన యూజీసీ నెట్‌ పరీక్షను విద్యా మంత్రిత్వ శాఖ జూన్ 19న రద్దు చేసింది. డార్క్‌నెట్‌లో యూజీసీ నెట్ పేపర్ లీక్ అయిందని, టెలిగ్రామ్ ద్వారా  అభ్యర్థులకు అందించారని తేలిందని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.

జెఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ పేపర్ లీక్ 
జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (జెఎస్‌ఎస్‌సీ) సీజీఎల్‌ పరీక్ష 2024 సెప్టెంబర్‌ 21,22 తేదీలలో జరిగింది. అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ సర్కారీ రిజల్ట్‌ కోసం ఎదురుచూస్తుండగా, ఇంతలో ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ పేపర్‌ లీక్‌ అయినట్లు వెల్లడయ్యింది.

రాజస్థాన్ ఎస్‌ఐ పరీక్ష 
రాజస్థాన్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ 2024 పేపర్ లీక్ కేసులో 37 మందిని అరెస్టు చేశారు. స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్‌ఓజీ) విచారణలో దీని వెనుక రెండు ముఠాలు ఉన్నట్లు తేలింది .  859 పోస్టుల కోసం జరిగిన ఈ రిక్రూట్‌మెంట్ పరీక్షకు 7.97 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షను 2021 సెప్టెంబర్ 13, 14, 15 తేదీల్లో నిర్వహించారు. ఈ పరీక్షా పత్రాల లీకుతో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఆర్‌సీఎస్‌సీ) పనితీరుపై పలు అనుమానాలు తలెత్తాయి.

ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్‌ ఫలితాలు 
బీహార్‌లోని పట్నాలో గల పూర్నియా డిజిటల్ పరీక్షా కేంద్రంలో ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్‌ పరీక్షలో చీటింగ్‌ జరిగినట్లు తేలింది. నకిలీ అభ్యర్థుల ద్వారా ఎస్‌ఎస్‌సీ ఎంటిఎస్ పరీక్షను రాయిస్తున్నారని తేలింది. ఈ విషయం తెలిసిన నేపధ్యంలో పోలీసులు ఈ కేంద్రంపై దాడి చేసి, ఏడుగురు ఉద్యోగులు, 14 మంది నకిలీ అభ్యర్థులతో పాటు 14 మంది అసలు అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు.

బీహార్ సీహెచ్‌ఓ పేపర్ లీక్ 
బీహార్ సీహెచ్‌ఓ పరీక్ష 2024, డిసెంబరు 1, 2, 3 తేదీలలో జరగాల్సి ఉంది. పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఈ పరీక్షను రద్దు చేశారు. బీహార్ సీహెచ్‌ఓ పేపర్ లీక్ కేసులో ఇప్పటివరకు 37 మంది నిందితులను అరెస్టు చేశారు.

పేపర్ లీక్‌లను నిరోధించడానికి రూపొందిన చట్టాన్ని 2024 జూన్‌ నుంచి అమలులోకి తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం పరీక్షల్లో పేపర్‌ లీక్‌ లాంటి అక్రమ చర్యలకు పాల్పడేవారికి మూడు నుంచి ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారు. అలాగే రూ.10 లక్షల వరకు జరిమానా విధించే  అవకాశం ఉంది. వ్యవస్థీకృత పేపర్ లీకేజీకి  కోటి రూపాయల వరకూ జరిమానా విధించనున్నారు. 
 

ఇది కూడా చదవండి: Year Ender 2024: ప్రధాని మోదీ పర్యటించిన దేశాలివే.. మీరూ ట్రిప్‌కు ప్లాన్‌ చేసుకోవచ్చు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement