ఆదర్శం.. ఆమె జీవనం
కొంతమందికి పదవులు వన్నె తెస్తాయి. మరి కొందరు పదవులకే వన్నె తెస్తారు. రెండో కోవకు చెందిన వ్యక్తే పుత్తిలివారిపల్లె సర్పంచ్ నారమల్లి హేమలత. సర్పంచ్‌గా ప్రజలు పట్టం కట్టినా భేషజాలకు పోకుండా కూలి పనులకు వెళుతూ పదిమందికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామాభివృద్ధే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారు. ఆమె జీవనం ఆదర్శం.. ఆ మార్గం అనుసరణీయం.
చంద్రగిరి: మండలంలోని పులిత్తివారిపల్లె పంచాయతీకి అనుబంధంగా నాలుగు గ్రామాలున్నాయి. ప్రజలు దళితులు కావడంతో నాలుగు గ్రామాలను కలుపుతూ గత ప్రభుత్వం ఒక పంచాయతీని గుర్తించింది. గత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా వైఎస్సార్ సీపీ తరపున నారమల్లి హేమలత బరిలో నిలిచి విజయం సాధించారు. అప్పటి నుంచి పార్టీలకతీతంగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చే స్తున్నారు. సర్పంచ్ అనే డాబు, దర్పం లేకుండా ఆమె సాధారణ మహిళగా ఉపాధి పనులు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నారమల్లి హేమలత సొంత గ్రామం చిన్నగొట్టిగల్లు మండలంలోని తట్టేవారిపాళ్యం. పొట్టిగానితోపునకు చెందిన రాణెమ్మ, కృష్ణయ్యల మొదటి కుమార్తె. తిరుపతిలోని ప్రభుత్వ హాస్టల్‌లో పదో తరగతి వరకు చదువుకున్నారు. 2000లో చంద్రగిరి మండలంలోని పులిత్తివారిపల్లెకి చెందిన ఎంపీ శివప్రసాద్ బంధువు నారమల్లి ప్రసాద్‌ను వివాహమాడారు. గ్రామంలో అందరితో కలసి మెలసి ఉంటూ సమస్యలను పరిష్కరించే వారు. ఏడాది కిందట సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు ఆమెకు పట్టం కట్టారు. ఓపక్క గ్రామ సమస్యల పరిష్కారానికి అధికారులతో సంప్రదిస్తూ, మరోపక్క సాధారణ మహిళగా కూలి పనులు చేస్తున్నారు.
ఈ ఏడాది పులిత్తివారిపల్లిలో కరువు కాటేసింది. దీంతో గ్రామ ప్రజలకు కూలి పనులు లేక వలస వెళుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పంచాయతీలో ఉపాధి హామీ పనులు కూడా లేకపోవడంతో సర్పంచ్, గ్రామస్తులు సమీప పంచాయతీల్లో కూలి పనులు చేసుకుంటున్నారు. సొంత గ్రామంలో కరువు విలయ తాండవం చేస్తున్నా ఎంపీ శివప్రసాద్ పట్టించుకున్న పాపాన పోలేదు. ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీగా ఎన్నో కీలక పదవుల్లో కొనసాగిన శివప్రసాద్ సొంత గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారనే చెప్పాలి. పార్టీలకతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.