- రైల్వేబోర్డు సేఫ్టీ అడ్వైజర్ సంజయ్‌గార్గ్
మచిలీపట్నం/గుడివాడ టౌన్ : రైల్వే ప్రయాణికుల భద్రతకు ఏమాత్రం భంగం కలిగినా కారకులైన అధికారులను ఇంటికి పంపిస్తామని రైల్వే సేఫ్టీ బోర్డు అత్యున్నత స్థాయి కమిటీ సభ్యుడు సంజీవ్‌గార్గ్ హెచ్చరించారు. శుక్రవారం గుడివాడ, మచిలీ పట్నం, పెడన రైల్వేస్టేషన్లను కమిటీ సభ్యులతో కలసి ఆయన పరిశీలించారు. గుడివాడ - పెడన రైల్వే ట్రాక్ వెంబడి కాపలా లేని 24వ నంబరు రైల్వేక్రాసింగ్ వద్ద ఆయన అక్కడి పరిస్థితులను అంచనా వేశారు. పెడన సమీపంలో బుడమేరు - సింగ్‌నగర్ మధ్య ఉన్న వంతెనను పరిశీలించారు.
ఆయా స్టేషన్ మాస్టార్లు, గేట్ మెన్లతో మాట్లాడి మరిన్ని వివరాలు సేకరించారు. సిబ్బందితోనూ మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసు కున్నారు. ప్రమాదాలను నివారించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నట్లు చెప్పారు. సాధారణ తనిఖీల్లో భాగంగా స్టేషన్ల పనితీరును పరిశీలించడానికి వచ్చా మన్నారు. ప్రధానంగా ద్విచక్రవాహనాలు పాసింజర్ రైళ్లలో పంపేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క చుక్క కూడా పెట్రోల్ ఉండకూడదని సూచించారు.
గుడివాడ ప్లాట్‌ఫాంపై రైలు ఎక్కించేందుకు సిద్ధంగా ఉన్న పార్సిల్ చేసిన ద్విచక్రవాహనాన్ని ఆయన పరిశీలించారు. ఈ విషయంలో ఏమాత్రం రాజీపడే ప్రసక్తే లేదన్నారు. జూలై, ఆగస్టు నెలల్లో 8 రైళ్లు ఆలస్యంగా నడిచాయని, దానికి కారణాలు తెలియ జేయాలని ఆదేశించారు. ట్రాక్ నిర్వహణ, వాటికి కావాల్సిన సామాగ్రి అందుబాటులో ఉందా లేదా అని తెలుసుకున్నారు. మొత్తం 8 మంది సభ్యులతో కూడిన ఈ బృందం అన్ని శాఖల పనితీరుపై పరిశీలన జరిపింది.
స్టేషన్ మేనేజర్ శేషగిరిరావు, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు సేప్టీ ఆఫ్ ట్రాఫిక్ ఓమ్‌ప్రకాష్, సిగ్నల్ అండ్ టెలికమ్ విజయలక్ష్మికౌశిక్, డెరైక్టర్ సేఫ్టీ ఎలక్ట్రికల్ అలోక్‌కుమార్, ఇంజినీరింగ్ అషీష్ కుమార్, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జనరల్ పద్మజ, అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఎన్‌ఎస్‌ఆర్.ప్రసాద్, సీనియర్ డివిజనల్ ఆపరేషన్ మేనేజర్ సత్యనారాయణ, సేఫ్టీ ఆఫీసర్ ఎం. ప్రసాద్, ఆయా రైల్వేస్టేషన్ల సిబ్బంది ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
రక్షణలేని రైల్వేగేట్ల వద్ద ఆగుతున్నారా?.....
గుడ్లవల్లేరు : రక్షణ లేని రైల్వేగేట్ల వద్ద కాపలా ఉంటున్న గార్డుల సమస్యలపై సంజీవ్ గార్గ్ ఆరా తీశారు. గుడ్లవల్లేరు మండలంలోని గాదేపూడి రక్షణ లేని రైల్వేగేటు వద్ద పరిస్థితిని పరిశీలించారు. రైలు వచ్చేటపుడు ఆగుతున్నారా అని గార్డును అడిగారు. తాను స్థానికుడిని కావడంతో తన మాట విని, ఆగుతున్నారని గార్డు కాగిత చంటిబాబు చెప్పాడు.
హడావుడిగా రైల్వే శాఖ ఏర్పాట్లు...
గార్గ్ వస్తున్నారని తెలుసుకున్న రైల్వేశాఖ అధికారులు పక్కనున్న పొలాల సరిహద్దుల్లో రాత్రికి రాత్రి సరిహద్దు రాళ్లను పాతారు. గేట్ల వద్ద గార్డులకు అప్పటికపుడే తాత్కాలిక గూడులను ఏర్పాటు చేశారు. రైళ్ల వలన రక్షణ లేని గేట్ల వద్ద జరిగే ప్రమాదాలపై కరపత్రాల్ని గార్గ్ ఎదుటే పంచిపెట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. పోస్టర్లను ఆయన వచ్చే గంట ముందు అంటించడంతో హడావుడి నెలకొంది. గార్గ్‌కు గాదేపూడి, వడ్లమన్నాడు వాసులు సమస్యల ఏకరువు పెట్టారు. సమస్యలన్నీ పరిష్కరిస్తానని గార్గ్ సమాధానమిచ్చారు.