
ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి పొన్నాడ సతీష్‌కుమార్, ఎంపీ అభ్యర్థి చింతా అనురాధలను ప్రజలకు పరిచయం చేస్తున్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమలాపురం/ ముమ్మిడివరం/ ఐ.పోలవరం: 35 డిగ్రీల ఉష్ణోగ్రత. మండుటెండ. సమయం మిట్ట మధ్యాహ్నం ఒంటి గంట. వాస్తవానికి ఉష్ణతాపానికి రహదారులు నిర్మానుష్యంగా ఉండాలి. కాని ముమ్మిడివరంలో అమలాపురం–కాకినాడ రోడ్డు మాత్రం జనసంద్రాన్ని తలపించింది. ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం కావడంతో నిప్పులు చెరిగే ఎండను ఏ మాత్రం లెక్కచేయకుండా నిండు మనసుతో ఆయనకు స్వాగతం పలికేందుకు జనం అక్కడకు తరలివచ్చారు. మధ్యాహ్నం 1.30 నిమిషాలకు వస్తారని తెలిసినా పార్టీ కార్యకర్తలు, అభిమానులు మధ్యాహ్నం 12 గంటలకే మెయిన్‌రోడ్డులో సభా వేదిక వద్దకు చేరుకున్నారు. జగన్ వచ్చే సమయానికి మెయిన్ రోడ్డు జనంతో కిక్కిరిసిపోయింది.
విశాఖ జిల్లా పాయకరావుపేటకు హెలీకాప్టర్‌లో వచ్చిన జగన్ 2.50 నిమషాలకు ముమ్మిడివరం చేరుకున్నారు. గంటన్నర ఆలస్యమైనా జనం నిరాశచెందలేదు. జగన్ ప్రసంగం 40 నిమిషాల పాటు జరిగింది. అంతకుముందు అసెంబ్లీ అభ్యర్థులు పినిపే విశ్వరూప్, పొన్నాడ సతీష్, ఎంపీ అభ్యర్థి చింతా అనురాధ ప్రసంగించారు. అనంతరం జగన్ తన ప్రసంగం ప్రారంభించారు. ముమ్మిడివరం నియోజకవర్గ ప్రజల సమస్యలను జగన్ ప్రస్తావించిన ప్రతీసారి జనం హర్షధ్వానాలు చేశారు. నియోజకవర్గంలో తాళ్లరేవు, ముమ్మిడివరం, ఐ.పోలవరం గ్రామాల్లో ఉన్న మత్స్యకారులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించకపోవడాన్ని, తాగునీటి సమస్యను ప్రస్తావించారు. చంద్రబాబు పార్టనర్, యాక్టర్ అంటూ పరోక్షంగా జనసేన అధ్యక్షుడు పవన్‌పై చేసిన విమర్శలకు జనం పెద్ద ఎత్తున స్పందించారు. బహిరంగ సభ ముగించుకుని జగన్ నాలుగు గంటలకు బయలుదేరి మండపేట బహిరంగ సభకు వెళ్లారు.
డ్వాక్రా రుణాల మాఫీ పెద్దమోసం
అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి చింతా అనురాధ మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకొనేందుకు రాష్ట్రంలో 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన మహోన్నత వ్యక్తి జగన్ అని అన్నారు. ఆనాడు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు డ్వాక్రా రుణమాఫీ చేయకుండా మోసం చేశాడన్నారు. ఇప్పుడు డ్వాక్రా మహిళలకు రూ.మూడు వేల చెక్కులు ఇస్తూ మరో సారి మోసానికి తెరతీశారన్నారు. మహిళలు మరోసారి మోసపోకుండా జగనన్నను సీఎం చేసుకుందామన్నారు. ఈ సమావేశంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు, అమలాపురం అసెంబ్లీ అభ్యర్థి పినిపే విశ్వరూప్, మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి, పార్టీ నాయకులు యేడిద చక్రపాణిరావు, భూపతిరాజు సుదర్శనబాబు, పెయ్యల చిట్టిబాబు, పెన్మత్స చిట్టిరాజు, కాశి మునికుమారి, యనమదల మురళీకృష్ణ, వేగిరౌతు రాజబాబు, నడింపల్లి సూరిబాబు, జగతా పద్మనాభం, చెల్లుబోయిన శ్రీనివాసరావు, చింతలపాటి శ్రీనివాసరాజు, కాదా గోవిందకుమర్, నల్లా నరసింహమూర్తి, పిన్నమరాజు శ్రీనివాసరాజు, కోలా బాబ్జీ, బొంతు సత్యశ్రీనివాస్, మాట్టా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
కుటుంబ పాలనకు చరమగీతం పాడుదాం
గత ఐదేళ్లలో ముమ్మిడివరంలో కొనసాగిన కుటుంబ పాలనకు చరమ గీతం పాడాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ పిలుపునిచ్చారు. ముమ్మిడివరం లంకతల్లమ్మ గుడివద్ద బుధవారం జరిగిన పార్టీ అధినేత జగన్ నిర్వహించిన ప్రచార సభలో చైతన్య రథంపై నుంచి కార్యకర్తలను ఉద్దేశించి పొన్నాడ మాట్లాడారు. రోడ్లు వేసినంత మాత్రానే అభివృద్ధి జరిగిందని చెప్పుకొంటున్న టీడీపీ నాయకులు ఐదేళ్లలో ప్రజలకు గుక్కెడు తాగునీరు ఇవ్వలేని స్థితిలో ఉన్నారన్నారు. గతంలో తాను, విశ్వరూప్ ఎమ్మెల్యేగా పనిచేసి కులాలకు అతీతంగా పాలన చేశామని, ప్రస్తుతం కుటుంబ పాలన సాగుతోందని అన్నారు. అన్న ఒకవైపు, తమ్ముడు మరోవైపు, బావమరిది ఇంకో వైపు పాలన కొనసాగిస్తూ ప్రజలపై అక్రమ కేసులు బనాయించి చిత్ర హింసలకు గురి చేశారన్నారు.
అన్న వస్తున్నాడు, ఇక వీరి ఆటలు చెల్లవన్నారు. జగన్ అనే నేనూ.. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను అనే మాటలు వినే ఘడియ అతిత్వరలో రాబోతోందన్నారు. అబద్దపు, సాధ్యం కాని హామీలతో గద్దె నెక్కిన టీడీపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని దోపిడీ చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులకు చట్టబద్ధత కల్పిస్తే టీడీపీ ప్రభుత్వం ఆ చట్టానికి తూట్లు పొడుస్తూ ఆ నిధులను దారి మళ్లించిందన్నారు. సబ్‌ప్లాన్ నిధులకు నోడలైజేషన్ చేసేలా పార్టీ మేనిఫెస్టోలో ఆ నిధులు ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు అందేలా చర్యలు తీసుకోవాలని పొన్నాడ జగన్‌ను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment