సాక్షి, గుంటూరు : రాత్రి లేదు.. పగలు లేదు.. ఓవర్ డ్యూటీలు.. అడుగడుగునా తనిఖీలు.. కొంచెం రిమార్కు ఉన్నా మెమోలు, సస్పెన్షన్లు.. ఇన్ని కష్టాలకు ఎదురొడ్డి బతుకు చక్రాన్ని నడుపుతున్నా.. జీవిత భద్రత మాత్రం లేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ పోరాటాల జెండా ఎత్తినా, నిరసనల హారన్ మోగించినా పట్టించుకున్న దిక్కు లేదు. కనీసం వారి గోడు ఆలకించాలన్న ధ్యాస ప్రభుత్వానికి అంతకన్నా లేదు.
ఈ ఐదేళ్లలో డబుల్ డ్యూటీలు, ఇంక్రిమెంట్లలో కోతలు, పనిష్మెంట్ వాతలతో కార్మికుల జీవితాలు కమిలిపోయాయి. అందుకే ఆర్టీసీ కార్మికులను కదిలిస్తే వారి కష్టాలన్నీ కన్నీటి ధారలవుతున్నాయి. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో అనేక మంది ఆర్టీసీ కార్మికులను కలిశారు. వారి బాధలను మనసారా ఆలకించారు.
తమ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ కార్మికులు చేసిన విన్నపంపై జగన్ స్పందిస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మాట ఇచ్చారు. మడమతిప్పని నేత మాట ఇవ్వడంతో కార్మికులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక తమ జీవితాలు ప్రగతి బాట పడతాయని నమ్ముతున్నారు.
దశాబ్దాల నాటి డిమాండ్లు. ఆదుకోండయ్యా అంటే పట్టించుకోని ప్రభుత్వం. ఏకంగా సంస్థనే నిర్వీర్యం చేసే కుట్ర. ఇదీ టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీకి, అందులో పనిచేసే కార్మికులకు పట్టిన దుర్గతి. గత ఐదేళ్లలో తమకు జరిగిన అన్యాయానికి కార్మికులు రగిలిపోతున్నారు. రెండేళ్లకుపైగా ఎదురు చూస్తున్న 50 శాతం ఫిట్‌మెంట్‌ను ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో నామమాత్రంగా 25 శాతం ఇచ్చి కార్మికులను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు.
అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచి, ఆర్టీసీ కార్మికులకు విస్మరించడం వారిని తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ఈ క్రమంలో కష్టాల ఊబిలో కూరుకుపోయిన ఏపీఎస్ ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసి ఆదుకుంటామని ప్రజా సంకల్పయాత్రలో వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు, వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ వైపే కార్మికులంతా మొగ్గు చూపుతున్నారు.
నయవంచన..
- ఆర్టీసీ ఉద్యోగులను తగ్గించే విధంగా వీఆర్‌ఎస్ జీవోను తీసుకువచ్చారు. దీనితో సంస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం, యాజమాన్యం కుట్ర పన్నుతుందని, ఆ జీవోను వెంటనే నిలుపుదల చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
- ప్రజా రవాణా వ్యవస్థలైన విమానాలకు 1 శాతం, రైల్వేకు 4 శాతం వ్యాట్ విధిస్తున్న ప్రభుత్వాలు, ఆర్టీసీకి మాత్రం డీజిల్‌పై 29 శాతం వ్యాట్ విధిస్తుంది. దీంతో ఆర్టీసీ లాభాలన్నీ కూడా డీజిల్‌కే పెట్టాల్సిన పరిస్థితి. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో వ్యాట్‌ను సగానికి పైగా తగ్గించి కాస్త నష్టాల బారి నుంచి ఆర్టీసీని బయట పడేశారు.
- ఇప్పటికే పల్లె వెలుగు బస్సులను సగానికిపైగా రద్దు చేసి వాటి స్థానంలో ప్రైవేట్ బస్సులను అద్దె ప్రాతిపదికగా తీసుకుంది. అందులో కూడా టీడీపీకి చెందిన ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లనే నియమించారు. దీనికి తోడు మూడు శాతం ఉన్న ఎంవీ ట్యాక్స్‌ను 15 శాతానికి పెంచారు.
గుంటూరు రీజియన్‌లో సమస్యలు
గుంటూరు రీజియన్‌లో సిబ్బంది కొరత అధికంగా ఉండటంతో డబల్ డ్యూటీలు చేయాల్సిన దుస్థితి. ఇక మహిళల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. డబుల్ డ్యూటీలు, కొన్ని ఫిట్‌నెస్ బస్సుల్లో విధులు నిర్వర్తిస్తూ బస్సులు ఆగిపోవడంతో రాత్రిపూట ఇంటికి ఆలస్యంగా వెళ్లాల్సిన పరిస్థితులు దాపురించాయి. కనీసం మహిళల రెస్ట్ రూమ్ నిర్వహణ కూడా సక్రమంగా లేదు. గుంటూరు డిస్పెన్సరీలో మందుల కొరత అధికంగా ఉంది. గుంటూరులో మందులు దొరక్కపోతే విజయవాడ వెళ్లి తెచ్చుకోవాల్సిందే. గ్యారేజీల్లో ఇప్పటికీ ఔట్ సోర్సింగ్ విధానమే నడుస్తోంది.
ఏటా బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయించాలి
నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని జగన్ చెప్పడం మంచి నిర్ణయం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ జరిగే లోపు ప్రతి సంవత్సరం రూ.వెయ్యి కోట్లు ఆర్టీసీకి కేటాయించి, ఉన్న అప్పులను ప్రభుత్వమే తీర్చాలి. పల్లె వెలుగు సర్వీసులకు డీజీల్‌పై వ్యాట్ తగ్గించడం ద్వారా ఆర్టీసీకి వచ్చే నష్టాలను కొంతైన తగ్గించవచ్చు.
–రవీంద్రరెడ్డి, ఎన్‌ఎంయూ గుంటూరు రీజనల్ కార్యదర్శి
మంచి రోజులు వస్తాయి
ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం వలన సంస్థకు, అందులో పనిచేసే ఉద్యోగులకు మంచి రోజులు వస్తాయి. ఇప్పటి వరకు కాలం చెల్లిన బస్సులతో తంటాలు పడుతున్నాం. ఆ సర్వీసుల స్థానంలో కొత్త బస్సులు వస్తే ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఉంటుంది. విద్యా, వైద్యం లాగానే ఆర్టీసీకు కూడా ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తే.. కార్మికులకు న్యాయం జరుగుతుంది.
– బి.వి.రమణ, కండక్టర్
Comments
Please login to add a commentAdd a comment