జననేత జక్కంపూడి
సాక్షి, రాజమండ్రి :పేద ప్రజల సమస్యలపై స్పందించి వారికి అండగా నిలిచిన జననేత దివంగత జక్కంపూడి రామ్మోహనరావు అని పలువురు వక్తలు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. జక్కంపూడి రామ్మోహనరావు 61వ జయంతిని బుధవారం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. నాడు వైఎస్ రాజశేరరెడ్డి పిలుపుమేరకు తమ తండ్రి ఏవిధంగా స్పందించి ప్రజా ఉద్యమాల్లో ముందున్నారో, అదే విధంగా నేడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏ ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చినా తమ కుటుంబం యావత్తూ ముందుండి నడిపిస్తుందని రామ్మోహనరావు కుమారుడు జక్కంపూడి రాజా అన్నారు.
కంబాలచెరువు జక్కంపూడి చౌక్ వద్ద ఉన్న జక్కంపూడి విగ్రహం వద్ద ఆయన ఇద్దరు కుమారులు రాజా, గణేష్‌ల ఆధ్వర్యంలో జక్కంపూడి జయంతి నిర్వహించారు. పలువురు పార్టీ నేతలతో కలిసి జక్కంపూడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం 61 కిలోల భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచారు. పార్టీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని, నగరపాలక సంస్థలో పార్టీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలా రెడ్డి, కార్పొరేటర్లు మింది నాగేంద్ర, బొంతా శ్రీహరి, మజ్జి నూకరత్నం, పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యులు లంకా సత్యనారాయణ, ఎండీ ఆరిఫ్, యువజన విభాగం కన్వీనర్ గుర్రం గౌతం తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గెడ్డం రమణ ఆధ్వర్యంలో రాజమండ్రి స్వర్ణాంధ్ర వృద్ధుల ఆశ్రమంలో స్వీట్లు పంచిపెట్టారు.
జిల్లాలో ఘనంగా వేడుకలు
మండపేటలో వైఎస్సార్ సీపీ వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రి పాపారాయుడు ఆధ్వర్యంలో పార్టీనేతలు అల్లూరి రామకృష్ణ, మేడిశెట్టి సూర్యభాస్కరరావు తదితరులు జక్కంపూడికి ఘనంగా నివాళులు అర్పించారు. రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరులో కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు పాల్గొన్నారు. ధవళేశ్వరంలో విప్పర్తి వేణుగోపాల రావు ఇంటి వద్ద జక్కంపూడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ధవళేశ్వరం బస్టాండ్‌సెంటర్‌లో, రాజమండ్రి రూరల్ మండలం తొర్రేడు, శాటిలైట్ సిటీ వద్ద జరిగిన కార్యక్రమాల్లో పార్టీ నేతలు కార్యకర్తలు జక్కంపూడికి ఘనంగా నివాళులు అర్పించారు. కడియం మండలం బుర్రిలంకలో పార్టీ నేతలు రావిపాటి రామచంద్రరావు, కొత్తపల్లి మూర్తి తదితరులు జక్కంపూడిని స్మరించుకున్నారు.
కాకినాడ రూరల్ తిమ్మాపురంలోని గ్రీన్ ఫీల్డు అంధుల పాఠశాలలో వైఎస్సార్ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ సభ్యులు లింగం రవి తదితరులు పళ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. రాయుడుపాలెం వద్ద వద్ద పార్టీ నేత నాగరాణి ఇతర కార్యకర్తతో కలిసి వృద్ధులకు పళ్లు పంపిణీ చేశారు. ఏలేశ్వరంలో జేవీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో జువ్విన వీర్రాజు నేతృత్వంలో ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు రొట్టెలు, పాలు పంపిణీ చేశారు. కోరుకొండలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ చింతపల్లి చంద్రం ఆధ్వర్యంలో జక్కంపూడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాజానగరం మండ లం రామస్వామిపేటలో గొర్రెల శివప్రసాద్ తన కుమార్తె సత్యకాంతతో కలిసి ఇంటిలోనే జక్కంపూడి జయంతి నిర్వహించి చుట్టుపక్కల వారికి స్వీట్లు పంపిణీ చేశారు.
రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో అమలాపురంలో కాటన్ పార్కు వద్ద ఉన్న జక్కంపూడి విగ్రహానికి పూలమాల వేసి నివాళుల అర్పించారు. బోడసకుర్రు-పాశర్లపూడి వంతెనకు జక్కంపూడి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అల్డా చైర్మన్ యాళ్ల దొరబాబు, పార్టీ జిల్లా కో ఆర్డినేటర్ మిండగుదిటి మోహన్, పట్ణణ పార్టీ యూత్ కన్వీనర్ గనిశెట్టి రమణ్‌లాల్, రంగా మిత్రమండలి అధ్యక్షుడు జక్కంపూడి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. రావులపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు రామ్మోహనరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించాయి. మామిడికుదురు, పి.గన్నవరం తదితర ప్రాంతాల్లో జక్కంపూడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పార్టీ రైతు విభాగం రాష్ట్ర కమిటీ సభ్యుల జక్కంపూడి తాతాజీ స్వీట్లు పంచారు. సఖినేటిపల్లిలో కేక్ కట్ చేసి అందరికీ పంచారు.