ఏలూరు సిటీ : ప్రభుత్వ ఉద్యోగాల ఊసేలేదు. కనీసం అవుట్ సోర్సింగ్‌లో చిన్నపాటి ఉద్యోగమైనా దక్కుతుందేమోనని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నా ఫలితం లేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని.. ఉద్యోగం దక్కని వారికి నెలకు రూ.2వేల చొప్పున నిరుద్యోగ భృతి కల్పిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ నేటికీ అమలుకు నోచుకోలేదు. ఉద్యోగం దొరక్క.. నిరుద్యోగ భృతి అయినా అందక నిరుద్యోగుల ఆశలు ఆవిరైపోతున్నాయి. ఉన్నత చదువులు చదివినా ప్రయోజనం ఏమిటంటూ యువత నిరుత్సాహంలో కూరుకుపోతోంది. జిల్లాలో 58 వేల 300 మంది ఉద్యోగాల కోసం ఉపాధి కార్యాలయంలో పేర్లు నమోదు చేయించుకున్నారు.
వీరిలో ఎస్సీలు 18,547మంది, ఎస్టీలు 249 మంది, బీసీలు 28,915 మంది ఉన్నారు. పేర్లు నమోదు చేయించుకున్న అభ్యర్థుల్లో మహిళలు 17,581 మంది కాగా.. వారిలో ఎస్సీలు 3,843 మంది, ఎస్టీలు 58మంది, బీసీలు 6,326 మంది ఉన్నారు. మొత్తంగా వికలాంగులు 5,873 మంది ఉండగా, 378 మంది మూగ, చెవిటి అభ్యర్థులు, 458 మంది అంధులు, 5,005 మంది శారీరక వైకల్యం గలవారు ఉన్నారు. ఉపాధి కార్యాలయంలో పేర్లు నమోదు చేయించుకోని నిరుద్యోగుల సంఖ్య భారీగానే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పట్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేవని, సీఎం హామీ ఇచ్చినట్టుగా కనీసం నిరుద్యోగ భృతి ఇప్పించాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
భరోసా ఏదీ : డీఎస్సీ-14 ప్రకటించినా జిల్లాలో కేవలం 506 పోస్టులు మాత్రమే భర్తీ చేయనున్నారు. బీఎడ్ అభ్యర్థులు 25వేల మంది ఉంటే వారికి కేవలం వారికి 223 పోస్టులు మాత్రమే ఉన్నాయి. మిగిలిన అభ్యర్థులంతా నిరుద్యోగులుగానే మిగిలిపోయే పరి స్థితి ఉంది. జిల్లాలోని ప్రభుత్వ జూని యర్ కాలేజీల్లో 500 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు పనిచేస్తుండగా వారి ఉద్యోగాలకు నేటికీ భరోసా లేదు. రాజీవ్ విద్యామిషన్‌లో పనిచేస్తున్న సుమారు 1,200 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దినదిన గండంగానే ఉంది. గృహ నిర్మాణ సంస్థలో 70మంది అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగాలు లేకుండా పోయాయి. బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, పాలిటెక్నిక్ చదివిన నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు తరలివెళ్లాల్సి వస్తోంది.
జాబివ్వండి.. ప్లీజ్
Published Thu, May 28 2015 2:01 AM | Last Updated on Sun, Sep 3 2017 2:47 AM
Advertisement
Advertisement