కడప సిటీ: ఎన్నో ఏళ్లుగా జిల్లా వాసుల కలగా మిగిలిన కడప వయా మదనపల్లె-బెంగళూరు రైలు మార్గంలో మలిదశ పనులు మొదలయ్యాయి. రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఆర్‌ఐడీసీ)లోకి ఆ మార్గాన్ని తీసుకోవడంతో ఊరట లభించినట్లయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కడప-బెంగుళూరు రైల్వే లైన్ పూర్తి చేసేందుకు నడుం బిగించాయి. జాయింట్ వెంచర్‌లోకి కడప–బెంగుళూరు రైల్వే లైన్ తీసుకురావడంతో వీలైనంత త్వరలో పనులు ప్రారంభమవుతాయని అధికారులు చెబుతున్నారు. కడప–బెంగుళూరు మధ్య రైలుమార్గం నిర్మాణానికి 2010 సెప్టెంబర్‌లో అప్పటి రైల్వేశాఖమంత్రి మునియప్ప శంకుస్థాపన చేశారు. ఇది దివంగత సీఎం వైఎస్సార్ మానసపుత్రిక.
ఈ రైలు మార్గానికి 2008–2009 బడ్జెట్‌లో ఆమోదం లభించింది. రూ.1,000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు మొదలయ్యాయి. 258 కిలోమీటర్ల మేర రైలుమార్గం నిర్మాణానికి 1,531 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. మొత్తం ఐదేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ లక్ష్యం ఐదేళ్లు కాదు కదా 15ఏళ్లు దాటిపోయేటట్లు కనిపిస్తోంది. భూసేకరణకు రూ.199.2 కోట్లు కేటాయించారు. కాగా 2016–2017లో రూ.58 కోట్లు, 2017–18లో రూ.240 కోట్లు కేటాయించారు. మొదటి దశలో భాగంగా ఇప్పటికే పెండ్లిమర్రి వరకు లైను సిద్దం చేసి డెమో రైలును నడిపిస్తున్నారు. మొత్తం నాలుగుదశల్లో కడప–బెంగుళూరు రైలుమార్గం చేపట్టాలని రైల్వేశాఖ నిర్ణయించుకుంది.
మొదటి దశలో రూ.153 కోట్లు కేటాయింపులు జరిగాయి. ఈ దశలో 21.8 కి.మీ వరకు లైన్ నిర్మాణం చేపట్టారు. కడప నుంచి గంగనపల్లె,పెండ్లిమర్రి వరకు పట్టాలు వేశారు.311.84 ఎకరాల భూమిని సేకరించారు. 54 చిన్నబ్రిడ్జిలు, ఆరుపెద్ద బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు. రూ.199.2 కోట్లు నిర్మాణం కోసం వ్యయం చేశారు. రెండవదశలో పెండ్లిమర్రి–రాయచోటి, రాయచోటి టు వాల్మీకిపురం వరకు లైన్‌ను చేపట్టనున్నారు. మూడవ దశలో మదనపల్లెరోడ్డు టు మదగట్ట(ఆంధ్రప్రదేశ్ సరిహద్దు), మదగట్ట– ముల్బాగల్ (కర్ణాటక రాష్ట్ర సరిహద్దు) లైను పూర్తి చేయాలనుకుంటున్నారు. నాలుగో దశలో ముల్బాగల్ టు కోలార్ వరకు నిర్మాణం చేపట్టేలా రూపకల్పన చేశారు.
కడప-బెంగళూరు రైలు మార్గానికి మోక్షం
Published Sun, Aug 20 2017 7:40 PM | Last Updated on Sat, Jul 7 2018 2:52 PM
Advertisement
Advertisement