పలమనేరు: పలమనేరు నియోజకవర్గంలోని బెరైడ్డిపల్లె మండలంలో కైగల్ జలపాతం వద్ద ఎత్తిపోతల పథకాన్ని చేపడతామని గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీ నెరవేరకుండానే పోయింది. అప్పట్లో ఈ ప్రాజెక్టు పనులు కేవలం ప్రతిపాదనలతోనే అటకెక్కాయి. గత ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ కైగల్ ఎత్తిపోతలు తమకే సాధ్యం అంటూ గుప్పించిన హామీ ఉత్తుత్తి కోతలేనని తేలిపోయింది. ఫలితంగా ఏటా 60 ఎంసీఎఫ్‌టీ(మిలియన్ క్యూబిక్ ఫీట్)ల నీరు వృథాగా బంగాళాఖాతంలో చేరుతోంది. అసలే మెట్ట ప్రాంతమైన ఈ మండలంలో భూగర్భ జలాలు అడుగంటాయి.
ఈ మండలంలో 60కి పైగా చెరువులున్నాయి. ఇవి నిండి చాలా ఏళ్లైంది. ఇక్కడ కైగల్ నది మాత్రమే మండలవాసులకు దిక్కు. వర్షాకాలంలో నదిలో నీళ్లు ప్రవహిస్తే చుట్టు పక్కల ప్రాంతాల్లో బోర్లలో నీటి సామర్థ్యం ఉంటుంది. కర్ణాటక రాష్ర్టంలోని ముళబాగల్ ప్రాంతం నుంచి ఈ నది బెరైడ్డిపల్లె మండలం మీదుగా తమిళనాడు రాష్ట్రంలోని కౌండిన్య నదిలో కలసి, బంగాళాఖాతంలోకి లీనమవుతోంది.
రెడ్డెప్పరెడ్డి చొరవతో ప్రతిపాదనలు
కైగల్ దుముకురాళ్ల జలపాతం వద్ద ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి, ఈ ప్రాంతవాసులను ఆదుకోవాలని స్థాని కులు దశాబ్దాలుగా పోరాటం సాగిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ఎమ్మెల్సీ రెడ్డెప్పరెడ్డి చొరవతో ఈ ప్రాజెక్టు పనులు తెరమీదికొచ్చాయి. స్థానిక నాయకులు ఎమ్మెల్సీ ద్వారా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలసి ఎత్తిపోతల పథకం గురించి వివరించారు. దీంతో ఆయన స్పందించి ఇక్కడ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అధికారుల నివేదికలు, అంచనాలు సైతం సిద్ధమయ్యాయి.
దుముకురాళ్ల వద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి, అక్కడి నుంచి వృథా నీటిని బెరైడ్డిపల్లె, పలమనేరు మండలంలోని పెద్దచెరువులకు మళ్లించాలని ప్రభుత్వం భావించింది. అయితే ఆ తర్వాత ఈ ఎత్తిపోతల పథకం గురించి కిరణ్ సర్కార్ అంతటితోనే మరిచింది. దీంతో ఈ ప్రాంతవాసుల ఆశలు అడియాశలుగా మారాయి. ఫలితంగా ఈ నది నుంచి వర్షపు నీరు వృథాగా తమిళనాడు చేరుతోంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోని కిరణ్‌పై ఈ ప్రాంతవాసులు ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నారు.
ఇలా ఉండగా మొన్నటి శాసనసభ ఎన్నికల సందర్భంగా పలమనేరుకు ప్రచారనిమిత్తం విచ్చేసిన చంద్రబాబు సైతం బహిరంగసభలో ఎత్తిపోతల పథకాన్ని తప్పక చేపడుతామని హామీ ఇచ్చారు. అయితే ఇంతవరకు దీని గురించి పట్టించుకొన్నవారేలేదు. బడ్జెట్‌లో కేటాయింపులు పరిశీలిస్తే ఇక ఈ పథకం కొండెక్కినట్టేనని అర్థమవుతోంది. టీడీపీ ప్రభుత్వమైనా తమ గోడు విని పనులు చేపడుతుందోమోనని భావించిన ఈప్రాంత వాసులు ఆశలు గాల్లో కలిశాయి. ఇక తమ ఆశ అడియాసేనని రైతులు బాధపడుతున్నారు.
కైగల్ ఎత్తిపోతలు... ఉత్తుత్తి కోతలు
Published Mon, Mar 23 2015 2:41 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement