
నా స్నేహితుడు ఒక ప్రైవేటు చిట్‌ఫండ్ కంపెనీలో డబ్బు తీసుకునేటప్పుడు నేను హామీ (ష్యూరిటీ) ఇచ్చాను. ఇప్పుడు అతను పరారీ లో ఉన్నాడు. చిట్‌ఫండ్ వారు నాపై కేసు వేశారు. ఆ మొత్తం నేను కట్టవలసిందేనా?
– రాహుల్, ఖమ్మం
ష్యూరిటీ ఇమ్మని మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయలేదు కదా! ష్యూరిటీ ఇచ్చిన తర్వాత మీరు ఎంత మొత్తానికి హామీ ఇచ్చారో అంత మొత్తం మీ వద్ద నుండి వసూలు చేస్తారు. వాయిదా పద్ధతుల్లో చెల్లించవచ్చు. మీ స్నేహితుడికి ఏవైనా ఆస్తులు ఉంటే అవి జప్తు చేయవలసినదిగా కోరవచ్చు.
అలాంటివి ఏమైనా ఉన్నాయేమో చూడండి. ష్యూరిటీ ఇచ్చేముందు జాగ్రత్త వహించడం మంచిది. నమ్మకస్తులకి, డబ్బు తిరిగి చెల్లించే స్థితి ఉన్న వారికి మాత్రమే ష్యూరిటీ ఇవ్వడం మంచిది.
నేను ఒక ప్రైవేటు సంస్థలో చిట్టీ కట్టాను. మొత్తం 50 నెలలు కట్టాలి కానీ నా పరిస్థితులు బాగుండక 15 నెలలు మాత్రమే కట్టాను. చిట్టీ ఎత్తలేదు. నేను కట్టిన డబ్బు నాకు తిరిగి రావాలంటే ఏం చేయాలి?
– సుందర్, హైదరాబాద్
చిట్టీ కట్టడాన్ని మధ్యలోనే ఆపేయడం తరచుగానే చూస్తుంటాం. మంచి సంస్థలలో అయితే లిఖితపూర్వక హామీపత్రాలు (అగ్రిమెంట్) ఉంటాయి కాబట్టి, అందులోని ఒప్పందం ప్రకారం కొంత జరిమానా విధించి మీరు అప్పటివరకు కట్టిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తుంటారు. కొన్ని సంస్థలు అయితే చిట్టీ గడువు పూర్తిగా ముగిశాక లేదా మీ బదులు ఇంకెవరైనా మీ గ్రూపు చిట్టీలో కలిస్తే కొంత కమీషన్ తీసుకొని డబ్బు తిరిగి ఇస్తుంటారు.
ఏది ఏమైనా, మీరు కట్టినన్ని డబ్బులు మీకు రావు కానీ పూర్తి నష్టం మాత్రం ఉండదు. మీరు చిట్టీ కట్టిన సంస్థని సంప్రదించి క్యాన్సిలేషన్ అడగండి. వారి నిబంధనల మేరకు వారికి రావలసిన మొత్తాన్ని మినహాయించుకుని మిగిలినది ఇస్తారు.
(చదవండి: ప్లంబర్లుగా మహిళా శక్తి!)