కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం అయిదు గంటల వరకూ జరగనుంది. మొత్తం 241మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీఆ 48 వార్డుల్లో పోటీ చేయగా, టీడీపీ 39 వార్డులు, బీజేపీ 9 వార్డుల్లో పోటీ చేసింది. అలాగే 17 వార్డుల్లో కాంగ్రెస్, చెరో నాలుగు వార్డుల్లో సీపీఐ, సీపీఎం పోటీకి దిగాయి.
అలాగే 121మంది ఇండిపెండెంట్లు బరిలో నిలవగా, 2,29,373 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నగర్ కాలనీలో పోలింగ్‌కు స్వల్ప అంతరాయం ఏర్పడగా, పవర్ కట్ కారణంగా మున్సిపల్ గర్ల్స్ హైస్కూల్‌లో చీకటిలోనే పోలింగ్ జరుగుతోంది.
ఇక 50 వార్డుల్లో 48 వార్డులకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. మిగతా రెండు వార్డులకు కోర్టు వ్యాజ్యం మూలంగా ఎన్నికలు జరగడం లేదు. 196 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సెప్టెంబరు 1న ఓట్లు లెక్కించనున్నారు. మరోవైపు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం బందోబస్తు ఏర్పాటు చేసింది. ప్రతిష్టాత్మక మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అధికార టీడీపీ, ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి.