కైకలూరు(కృష్ణా జిల్లా): రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో మందులు లేవనే మాట వినిపించకూడదని, అలా కాకుంటే చర్యలు తప్పవని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు. గతి లేకే ప్రభుత్వాస్పత్రులకు వస్తున్నామనే ఆలోచనలు రోగులకు కలగకుండా చూసి, వారి ప్రశంసలు పొందాలని సూచించారు. మంగళవారం కృష్ణా జిల్లా కైకలూరులో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ రూ.340 కోట్ల నాబార్డు నిధులతో రాష్ట్రంలోని 71 ఆస్పత్రుల్లో నూతన భవనాల నిర్మాణం, మరమ్మతులు జరుగుతున్నాయన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవల రివాల్వింగ్ ఫండ్ ద్వారా అందుబాటులో ఉన్న రూ.60 కోట్లలో రూ.59 కోట్లతో 68 ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ప్రకటించారు.
గుంటూరు ప్రభుత్వాస్పత్రి, కాకినాడ కిమ్స్, వైజాగ్ కేర్ ఆస్పత్రుల్లో గుండెజబ్బులకు నిపుణులైన వైద్యులతో చికిత్స అందిస్తున్నామన్నారు. ప్రయివేటు ఆస్పత్రుల్లోనూ గుండె సంబంధిత వ్యాధులకు చికిత్స చేసేలా త్వరలో జీవో తెస్తామని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల తరహాల్లోనే కార్పొరేట్ మెడికల్ కళాశాలల్లోనూ మెరిట్ విద్యార్థులకు రూ.10 వేల ఫీజు మాత్రమే వసూలుచేసేలా రెండు రోజుల్లో జీవో తెస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ మాగంటి బాబు పాల్గొన్నారు.