కనకదుర్గ ఫ్లైఓవర్: నిధులకు గ్రహణం!
సాక్షి, విజయవాడ: బెజవాడ ట్రాఫిక్ సమస్యలు తీర్చేందుకు చేపట్టిన కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణానికి నిధుల గ్రహణం పట్టింది. ఫ్లైఓవర్ నిర్మాణానికి తగినంతగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అందకపోవడంతో ఏడాదిన్నరగా ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ సత్వరమే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టి.. ట్రాఫిక్ కష్టాలు దూరం చేస్తానని సీఎం చంద్రబాబునాయుడు హామీలు ఇచ్చినప్పటికీ.. అవి ఆచరణకు నోచుకోవడం లేదు.
కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనట్టు కనిపిస్తోంది. ఫ్లైఓవర్ నిర్మాణంలో డిజైన్‌లను రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. దీంతో మార్పులకు అదనంగా అయ్యే వ్యయాన్ని ఇచ్చేదిలేదంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్ నిర్మాణానికి ఎంతలేదన్న మరో ఏడాది సమయం పడుతుందని అధికారులు అంటున్నారు.