లెక్కలు అడిగితే బురద జల్లుతారా..? | Kanna Lakshminarayana Fire on CM Chandrababu | Sakshi
Sakshi News home page

లెక్కలు అడిగితే బురద జల్లుతారా..?

Published Thu, Jun 21 2018 10:23 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

Kanna Lakshminarayana Fire on CM Chandrababu - Sakshi

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ధృడ సంకల్పంతో ప్రత్యేక ప్యాకేజీ కింద ఇచ్చిన రూ.16వేల కోట్లు, రోడ్లు, కాలువలు, మౌళిక వసతుల కల్పనకు 80 శాతం మేర ఉపాధి హామీ నిధులు వాడుకుని వాటికి లెక్కలడిగితే బీజేపీపై సీఎం చంద్రబాబు బురద జల్లడం తగదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారా యణ అన్నారు. పార్టీ రాష్ట్రాధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన బుధవారం శ్రీకాకుళం నుంచే పర్యటన ప్రారంభించారు. 

ముందుగా ఆ మదాలవలస రైల్వేస్టేషన్‌లో దిగి అక్కడ నుంచి  శ్రీకాకుళం చేరుకుని కొత్త వంతెన పక్కన గల ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 జిల్లాలో జాతీ య విద్యా సంస్థలు ఏర్పాటు చేశారని, శ్రీకాకుళంలో కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. అలాగే 190 కిలోమీటర్ల కోస్టల్‌ కారిడార్‌ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఎన్నికలకు పది నెలలే సమయం ఉందని, అంతలోనే టీడీపీ నాయకుల దోపిడీని ప్రజలకు చెప్పాలని కోరారు. దళితులను, నాయీ బ్రాహ్మణులను తక్కువ చేసి మాట్లాడడం చంద్రబాబుకు తగదన్నారు. జిల్లాలో 150 మత్స్యకార గ్రామాలకి మంచినీటి సౌకర్యాన్ని కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో 33 అమృత్‌ సిటీలు చేసిం ది మోదీయేనన్నారు. విశాఖ అభివృద్ధి అంతా కేం ద్ర నిధులతోనే జరిగిందని తెలిపారు. చంద్రబా బునాయుడు తిరుపతి సభలో రాష్ట్రానికి  కేంద్రం అడిగినదానికంటే ఎక్కువే ఇచ్చిందని చెప్పి, తీరా ఇప్పుడు కేంద్రం ఏమీ ఇవ్వలేదని ఫిరాయిస్తున్నారన్నారు. రాష్ట్రంలో 43 కులాలను ఎస్సీ, ఎస్టీల్లో చేరుస్తానని హామీనిచ్చి తీరా అధికారం చేపట్టాక వాటన్నింటిని గాలికొదిలేశారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి భారీగా ని«ధులు తీసుకుని తీరా ఇప్పుడు ఏమిచ్చారని ప్రశ్నించడం సరి కాదన్నారు. 

అనంతరం సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీ కణితి విశ్వనాథం మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుకబడిన జిల్లా శ్రీకాకుళంను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా దత్తత తీసుకోవాలని కోరారు. చిన్న, సన్నకారు రైతులు అధికంగా ఉన్నారని వారి కోసం కేంద్రం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలన్నారు. జిల్లాలో గిరిజన యూనివర్సిటీ, జాతీయ విద్యాసంస్థ ఏర్పాటుచేయాలన్నారు. జిల్లా నుంచి అధికంగా వలసలు వెళ్లిపోతున్నారని నివారించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం పార్టీ నాయకులు పైడి వేణుగోపాలం మాట్లాడుతూ వ్యవసాయాధారిత జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఎంతోమందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు.

 కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పూడి తిరుపతిరావు మాట్లాడుతూ టీడీపీ నాయకులు లాభాలు వచ్చే పనులు తప్ప మరే ఇతర పనులు చేపట్టలేదన్నారు. సమావేశంలో ఎస్సీ మోర్చా  రాష్ట్ర అధ్యక్షులు దారా సాంబయ్య, జమ్ముల శ్యామ్‌కిషోర్, జిల్లా అధ్యక్షులు కోటగిరి నారాయణరావు, ఓబీసీ మోర్చా దుప్పల రవీంధ్ర, ఆర్‌.డి విల్సన్,  శవ్వాన ఉమామహేశ్వరి, చల్లా వెంకటేశ్వరులు, అట్టాడ రవిబాబ్జీ, సంపతిరావు నాగేశ్వరరావు, దువ్వాడ ఉమామహేశ్వరరావు, కొప్పురోతు వెంకటరావు, రెడ్డి నారాయణరావు, మోర్చాల జిల్లా అధ్యక్షులు, మండల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement