కన్నా లక్ష్మీనారాయణ
సాక్షి, విజయవాడ : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలో హనుమాన్ పేట ఆలపాటి ఫంక్షన్ హాల్‌లో ఆదివారం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన తొలిసారి రాష్ట్ర కార్యవర్గం భేటీ అయింది. ఈ సమావేశానికి ఎంపీ హరిబాబు, శాసనసభ పక్షనేత విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాష్ట్ర పరిశీలకుడు జి. సతీష్, నేతలు పురందేశ్వరి తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయా పరిణామాలపై చర్చలు జరిపారు. కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. బీజేపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలనే దుష్పచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేనతో సంబంధాలు అంటగట్టాలని చంద్రబాబు చూస్తున్నారు.. ఇదే ప్రస్తుతం బాబు ఎన్నికల ఎజెండా అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు సంస్కార హీనుడు, వ్యక్తిగత దూషణలు ఆయన నైజమని కన్నా విమర్శలు గుప్పించారు. స్టాక్ బ్రోకర్‌గా అనేక మందిని మోసం చేసిన వ్యక్తి కుటుంబరావు అని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అంతేకాక హత్య కేసులో ముద్దాయి, మోసాలు చేసేవారు కూడా ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తున్నారని కన్నా మండిపడ్డారు. ఇలాంటి వారిని సీఎం ప్రోత్సహిస్తున్నారని చురకలు అంటించారు. బాబు ఎన్నికుట్రలు పడిన వాటిని తిప్పి కొడతామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ నేతలను వేధింపులకు గురిచేస్తున్నారని, దీన్ని వ్యతిరేకిస్తూ జూన్11వ తేదీన(సోమవారం) విజయవాడలో ధర్నాకు దిగుతున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment