
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు తన చర్యల ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం కలిగించారని, కావాల్సిన వారికి విలువైన భూములను నామమాత్రపు ధరలకు కేటాయించారని, సన్నిహితులకు అత్యంత విలువైన కాంట్రాక్టులు కట్టబెట్టారని, వీటన్నింటిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఇందులో కేంద్ర కేబినెట్ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీబీఐ జాయింట్ డైరెక్టర్, ఏపీఐఐసీ, విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్), వైద్య విద్య డైరెక్టర్, ఏపీసీఆర్‌డీఏ కమిషనర్, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, రేచెమ్ ఆర్‌పీజీ ప్రైవేట్ లిమిటెడ్‌లను ప్రతివాదులుగా చేర్చారు. సీఎం చంద్రబాబు, ఏపీఈపీడీసీఎల్ ఎండీ హెచ్.వై.దొరను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు.
ఈ వ్యాజ్యంపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) డి.రమేశ్ చేసిన అభ్యర్థన మేరకు తదుపరి విచారణను ఫిబ్రవరి 4కి వాయిదా వేసింది. కన్నా వ్యాజ్యంలోని ముఖ్యాంశాలు.. ‘‘కండక్టర్ల కొనుగోళ్లకు సంబంధించి కాంట్రాక్టును ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) బెంగళూరుకు చెందిన రేచమ్ ఆర్‌పీడీ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించాయి. ఇందులో రూ.131 కోట్ల మేర అక్రమాలు జరిగాయని విజిలెన్స్ విభాగం తేల్చింది. అక్రమాలకు పాల్పడిన ఏపీఈపీడీసీఎల్ ఎండీ హైచ్.వై.దొరను చంద్రబాబు కాపాడుతున్నారు. ఈ–సెంట్రిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విశాఖ మధురవాడలో అత్యంత ఖరీదైన 50 ఎకరాలను కేటాయించారు. ఈ కంపెనీ డైరెక్టర్ జి.శ్రీధర్‌రాజు సీఎం తనయుడు, మంత్రి లోకేష్‌కు అత్యంత సన్నిహితుడు. బహిరంగ మార్కెట్‌లో ఈ 50 ఎకరాల విలువ రూ.500 కోట్ల వరకు ఉంటుంది. అయితే సీఎం జోక్యంతో ఈ భూమిని ఆ కంపెనీకి రూ.25 కోట్లకే కేటాయించారు.
బాలకృష్ణ బంధువులకు 498.93 ఎకరాలు
కృష్ణా జిల్లా జయతీపురం గ్రామంలోని సర్వే నెంబర్ 93లో వీబీసీ ఫెర్టిలైజర్స్‌కు యూరియా ప్లాంట్ నిమిత్తం 498.93 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ కంపెనీ ముఖ్యమంత్రి వియ్యంకుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సమీప బంధువులది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘అందరికీ ఇల్లు’ పథకం పేరు మార్చి.. కాంట్రాక్టర్లకు రూ.38 వేల కోట్లను ప్రభుత్వం దోచిపెడుతోంది. ప్రభుత్వ ఖజానాకు కలిగిన నష్టాలపై సీఎం చంద్రబాబుకు స్వయంగా పలు లేఖలు రాశాను. రాష్ట్రపతి, గవర్నర్, కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించాను. అయినా చర్యలు తీసుకోలేదు. అందుకే న్యాయస్థానం జోక్యాన్ని కోరుతూ ఈ వ్యాజ్యం దాఖలు చేస్తున్నా’’ అని కన్నా పిటిషన్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment