
టీడీపీలో కాపు నేతల అసంతృప్తి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా పరిషత్ పీఠానికి సామాజిక వర్గాలు ‘కాపు’కాస్తున్నాయి. ఇప్పటికే జెడ్పీ చైర్‌పర్సన్ పదవిని కాళింగ సామాజిక వర్గానికి కట్టబెట్టేందుకు టీడీపీ అధిష్టానం నిర్ణయించిన విషయం తెలి సిందే. అయితే మంత్రివర్గ నిర్మాణం తర్వాత జిల్లా నుంచి తమ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కొరవడిందని అసంతృప్తి చెందిన కాపు సామాజికవర్గ నాయకులు జెడ్పీ పదవిపై కన్నేశారు. అధినేత చంద్రబాబుపై ఒత్తిడి ప్రారంభించారు. మరోవైపు ఆ పదవి చేజారిపోకుండా ఇప్పటికే హామీ పొందిన కాళింగ నేతలు ప్రయత్నాలు చేపట్టడంతో టీడీపీ అధినేతకు కొత్త తలనొప్పి ప్రారంభమైంది. జిల్లాలో కాపు, వెలమ, కాళింగ కులాల జనాభా అధికంగా ఉంది.
రాజకీయ పార్టీలు కూడా అదే స్థాయిలో వారికి ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్ పదవిని కాళింగ సామాజికవర్గానికి ఇస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. ఆ మేరకు చౌదరి ధనలక్ష్మి పేరును దాదాపు ఖరారు చేశారు. కాగా రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లా నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన కళా వెంకట్రావు, వెల మ సామాజికవర్గానికి చెందిన అచ్చెన్నాయుడులకు చోటు లభిస్తుందని భావించారు. కానీ ఒక్క అచ్చెన్నకే మంత్రి పదవి దక్కడంతో కాపు సామాజిక వర్గం చిన్నబోయింది. మంత్రి పదవి వెలమలకు, జెడ్పీ పీఠం కాళింగులకు ఇస్తే తమ పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
సీనియర్ నేత కళా వెంక ట్రావుకు మంత్రి లేదా స్పీకర్ పదవి రావాల్సి ఉన్నా.. ఆయన కుటుంబానికే చెందిన మృణాళినికి మంత్రి పదవి ఇవ్వడంతో కళా అవకాశం కోల్పోయారు. ఇదే కారణంతో భవిష్యత్తులోనూ ఆయనకు పెద్ద పదవి దక్కే అవకాశాలు కనిపించడం లేదు. దాంతో ఆయన వర్గం సామాజిక సమీకరణాలను తెరపైకి తెచ్చి అధినేతపై ఒత్తిడి ప్రారంభిం చింది. అయితే చీపురుపల్లిలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఢీకొని ఓడించిన మృణాళినికి మంత్రి పదవి ఇవ్వక తప్పలేదని.. ఆమె విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేసినా వాస్తవానికి శ్రీకాకుళం జిల్లాకు చెందినవారేనని.. ఆ విధంగా కాపు సామాజికవర్గానికి ప్రాతినిధ్యం కల్పించి నట్లేనని కాళింగ, వెలమ సామాజిక వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.
ఈ వాదనను కాపు నేతలు తిరస్కరి స్తున్నారు.
మృణాళిని పదవి విజయనగరం జిల్లా కోటాలోకే వెళుతుందని, పదేళ్లపాటు పార్టీని నమ్ముకున్న శ్రీకాకుళం జిల్లా నేతలకు అన్యాయం జరుగుతోందని ఆ సామాజికవర్గ నేతలు ఇటీవల చంద్రబాబును కలిసి మొరపెట్టుకున్నారు. తాజాగా కొంతమంది కాపు నేతలు తమ సామాజిక వర్గానికి కనీసం జడ్పీ వైస్ చైర్మన్ పదవైనా ఇప్పించాలని కోరుతూ అందుకు సంతకవిటి మహిళా జెడ్పీటీసీ పేరును ప్రతిపాదిస్తున్నారు. వాస్తవానికి ఆ పదవి అంత ముఖ్యమైనదేమీ కాదు. అయినా ఏమీ లేనిదానికంటే కొంత నయం కదా అని వారు భావిస్తున్నారు.
అలాగే మంత్రివర్గ విస్తరణ జరిగితే జిల్లా నుంచి తమ వర్గానికి అవకాశం కల్పించాలని, అలా కాని పక్షంలో కేబినెట్ హోదా కలిగిన నామినేటెడ్ పదవైనా ఇవ్వాలని జిల్లా కాపు నేతలు అధినేతను కోరుతున్నారు. ఇతర సామాజిక వర్గ నేతలు మాత్రం దీనికి అడ్డుపడుతున్నారు. ఈ విషయంలో కింజరాపు, కళా వర్గాల మధ్య మొదటినుంచీ ఉన్న విభేదాలు ప్రభావం చూపుతున్నాయి. ఈ వర్గాలన్నీ తమ వాదనలకు మద్దతుగా చంద్రబాబుకు ఫ్యాక్సులో వినతులు పంపినట్లు సమాచారం. దీంతో పార్టీలో తలెత్తిన ఈ సామాజిక సంక్షోభాన్ని అధినేత ఎలా పరిష్కరిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.