కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం
గుంతకల్లు రూరల్: ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒక్కటైన కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో అక్రమాలు పెచ్చుమీరిపోతున్నాయి. ఆలయ అధికారుల వైఖరి కారణంగా ఆలయ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పాలన వ్యవహారాలు అధికారుల చేజారాయి.సెక్యూరిటీ గార్డులదే ఇష్టారాజ్యంగా కొనసాగుతోంది. దీంతో దేవుడి సొమ్ముకు భద్రత లేకుండా పోతోంది.
గాడితప్పిన భద్రతా వ్యవస్థ
డిప్యూటీ కమిషనర్ హోదా కలిగిన ఈ ఆలయంలో ఈవో, ఏఈవోతోపాటు, ఇద్దరు సూపరింటెండెంట్‌లు, ముగ్గురు సీనియర్ అసిస్టెంట్‌లు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్‌లు, ఒక రికార్డ్ అసిస్టెంట్, మరో రెండు అటెండర్ పోస్టులు ఉన్నాయి. వీటిలో ఒక సూపరింటెండెంట్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు చాలా కాలంగా ఖాళీగా ఉన్నాయి. ఉన్న సీనియర్ అసిస్టెంట్‌లలో ఇద్దరు టెంపుల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. దర్శనం టికెట్లు, ప్రసాదాల కౌంటర్, అద్దె గదుల కేటాయింపులు, ఆర్జిత సేవల టికెట్ల విక్రయాలు తదితర పనులను ప్రైవేట్ పరం చేశారు. ఈ పనులు దక్కించుకున్న పవన్ సెక్యూరిటీ ఏజెన్సీ సంస్థ 63 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించింది. వీరు విధుల్లో అక్రమాలకు తెరలేపినట్లు ఆరోపణలున్నాయి. విధులు కేటాయించిన చోటు కాకుండా ఇష్టానుసారంగా మార్చుకుంటూ ఆలయ భద్రతకు తిలోదకాలిచ్చేశారు.
ఆభరణాల భద్రత ఇలా..
ప్రతి రోజూ ఉదయం 3.45 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 3 నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఆలయంలో పూజా కార్యక్రమాలు జరుగుతాయి. శని, మంగళవారాల్లో ఉదయం నుంచి రాత్రి వరకూ నిరంతరాయంగా ప్రత్యేక పూజలు ఉంటాయి. మూలవిరాట్‌కు అలంకరించే నగలను ఉదయాన్నే అర్చకులకు అప్పగించి, తిరిగి రాత్రి వాటిని ముఖమంటపంలో భద్రపరుస్తుంటారు. ప్రత్యేక దినాలు, పర్వదినాలు, వజ్రకవచ అలంకరణ ఉన్న రోజుల్లో ముందు రోజు రాత్రి ఆలయ అధికారుల నుంచి ఆభరణాలను అర్చకులు తీసుకుని, మరుసటిరోజు రాత్రి ఆలయం మూసే సమయంలో అధికారులకు అప్పగిస్తారు.
అంతా సెక్యూరిటీ గార్డులే..
మూలవిరాట్‌కు అలంకరించే ఆభరణాల భద్రతపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వేకువజామున 3 గంటలకే ఆలయానికి చేరుకుని ఆభరణాలను తీసివ్వాల్సిన అధికారులు ఉదయం తొమ్మిది గంటలైనా కార్యాలయానికి చేరుకోవడం లేదు. దీంతో ఈ పని కాస్త కాంట్రాక్ట్ పద్ధతిలో పనిలో చేరిన సెక్యూరిటీ గార్డుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆభరణాలను భద్రపరిచి, తీసిచ్చే సమయంలో అర్చకులు, వేద పండితులు, పరిచారికల సమక్షంలోనే ముఖమంటపానికి వేసిన తాళం తీయాల్సి ఉంటుంది. ఆ సమయంలో అందరి చేత రిజిస్టర్‌లో సంతకాలు చేయించాలి. ఇందుకు విరుద్ధంగా జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఆలయానికి నియమితులైన ఈవోలు ఎవరూ స్థానికంగా ఎక్కువ రోజులు ఉండడకపోవడం కూడా అక్రమాలకు కారణమవుతోంది. కర్నూలు జిల్లా ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ దేముళ్లు ని కసాపురం ఆలయానికి ఈవోగా నియమించడంతో శని, పర్వదినాల్లో తప్ప ఆయన ఇక్కడ అందుబాటులో ఉండడం లేదు. దీంతో స్థానికంగా ఉంటూ పాతుకుపోయిన కొందరు అధికారులు, సెక్యూరిటీ గార్డులతో కలిసి అక్రమాలకు తెరలేపారు. ఆలయంలో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన పాలకమండలి సభ్యులు కూడా పట్టించుకోకపోవడంతో అక్రమార్కులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.
విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం
ఆలయ నిర్వహణకు సంబంధించి ప్రతి పనిని అధికారులు, సిబ్బంది దగ్గరుండి పర్యవేక్షించాలి. అలాకాకుండా విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే విచారణ జరిపించి వెంటనే చర్యలు తీసుకుంటాం
– దేముళ్లు, ఆలయ కార్యనిర్వహణాధికారి, కసాపురం
Comments
Please login to add a commentAdd a comment