ఖబడ్దార్..! | Khabaddar ..! | Sakshi
Sakshi News home page

ఖబడ్దార్..!

Published Wed, Nov 19 2014 3:04 AM | Last Updated on Thu, Mar 28 2019 6:26 PM

ఖబడ్దార్..! - Sakshi

ఖబడ్దార్..!

మా జోలికి వస్తే చంపేస్తాం!
 
 సాక్షి ప్రతినిధి, కర్నూలు :  అధికారపార్టీ నేతల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. తమ అక్రమాల జోలికి వస్తే ఏకంగా చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాము చేస్తున్న అక్రమ వ్యాపారాలను చూస్తూ ఊరుకోవాలని హెచ్చరిస్తున్నారు. లేదంటే బదిలీ తప్పదని భయపెడుతున్నారు. తాజాగా అక్రమ మైనింగ్ వ్యవహారంలో గనులశాఖ అధికారులకు తెలుగు తమ్ముళ్లు అసభ్య పదజాలంతో హెచ్చరించారు. దారికి రాకపోతే చంపేస్తామని కూడా బెదిరించారు.

వీరి అసభ్య పదజాలం భరించలేక సదరు అధికారులు.. ఈ బెదిరింపులను సెల్‌ఫోన్‌లో రికార్డు కూడా చేసినట్టు సమాచారం. ఈ రికార్డును ఎస్పీకి వినిపించి కేసు పెట్టాలని మొదట్లో భావించిన అధికారులు.. చివరికి భయపడి ఊరుకున్నట్టు తెలుస్తోంది. చివరకు అధికార పార్టీ ‘ఉప’నేతను కలిసి తమ బాధను విన్నవించుకున్నట్టు సమాచారం. అయితే, తమ అనుచరులను అదుపులో పెట్టాల్సిన ఆయన.. సర్దుకుపోవాలంటూ అధికారులకు సూచనలు ఇచ్చినట్టు తెలిసింది.

 భారీగా అక్రమ మైనింగ్!
 జిల్లాలో అక్రమ మైనింగ్ భారీగా సాగుతోంది. వాస్తవానికి జిల్లా వ్యాప్తంగా కల్లూరు, ప్యాపిలి, బేతంచెర్ల, వెల్దుర్తి, డోన్ ప్రాంతాల్లో 1200 లీజులకుగానూ సుమారు 7 వేల హెక్టార్లకుపైగా మైనింగ్‌కు అనుమతులున్నాయి. అయితే, వీటిలో కేవలం ఒకటి రెండు ప్రాంతాల్లో మినహా ఎక్కడా నాణ్యమైన ఇనుప ఖనిజం (ఐరన్‌ఓర్) లేదు. లీజులు అనుమతి ఉన్న ప్రాంతాల్లో కేవలం బీ గ్రేడ్, సీ గ్రేడ్ ఐరన్‌ఓర్ మాత్రమే దొరుకుతోంది. వీటి ధర కూడా మార్కెట్లో చాలా తక్కువ.

టన్ను కేవలం 2 వేల రూపాయలు మించే పరిస్థితి లేదు. అయితే అటవీశాఖ, దేవాదాయశాఖ భూముల్లో నాణ్యమైన ఇనుప ఖనిజం లభిస్తోంది. కానీ ఈ భూముల్లో మైనింగ్ తవ్వకాలకు అనుమతులు లేవు. అయినప్పటికీ అధికారపార్టీ నేతలు ఎక్కడపడితే అక్కడ మైనింగ్‌కు పూనుకుంటున్నారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో అటవీశాఖ భూములతో పాటు దేవాదాయశాఖ భూముల్లో అధికారపార్టీ నేతలు విచ్చలవిడిగా ఇనుప ఖనిజాన్ని తవ్వి.. తమకు మైనింగ్ అనుమతులు ఉన్న భూముల్లోనే తవ్వుతున్నట్టు లెక్కలు చూపుతున్నారు.

ఇదే కోవలోనే తాజాగా కొద్దిరోజుల క్రితం వెల్దుర్తి ప్రాంతంలో అధికార పార్టీ ఎంపీటీసీ సభ్యులు అక్రమ మైనింగ్ జరుపుతున్నట్టు గనులశాఖ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో అధికారులు కాస్తా విచారణ చేపట్టారు. ఇది గిట్టని అధికార పార్టీ ఎంపీటీసీ సభ్యుడు ఒకరు నేరుగా అధికారులకే ఫోను చేసి మరీ బెదిరించారు. ‘మా మైనింగ్ వైపు రావొద్దు. మా జోలికి వస్తే జాగ్రత్త. ప్రాణాలు తీస్తా’ అంటూ నేరుగా బెదిరింపులకు దిగారు.

ఇదే విధంగా మరొక ఎంపీటీసీ సభ్యుడు కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. బెదిరింపులతో పాటు సదరు నేతల అసభ్య పదజాలాన్ని భరించలేక ఫోన్‌లో రికార్డు చేసి ఏకంగా ఎస్పీకి ఫిర్యాదు చేద్దామని గనులశాఖ అధికారులు మొదట్లో భావించినట్టు తెలిసింది. అయితే, చివరికి ‘ఉప’నేత వద్దకు పంచాయితీకి వెళ్లినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.  

 వాళ్ల జోలికి వెళ్లొద్దు!
 అధికారపార్టీ నేతలతో ఎందుకు తగాదా అనుకున్న అధికారులు న్యాయం కోసం జిల్లాకు చెందిన ‘ఉప’నేతను ఆశ్రయించారు. తమకు ఫోన్ చేసి తెలుగు తమ్ముళ్ల బెదిరింపు రికార్డును కూడా ఆయనకు వినిపించినట్టు తెలిసింది. అంతా విన్న సదరు నేత తెలుగు తమ్ముళ్లను ఏమీ అనలేదని తెలిసింది. సదరు టీడీపీ నేతలకు ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండాలని, అధికారులను బెదిరించడం సరికాదని మాత్రమే చెప్పిన ఆయన.. సర్దుకుపోవాలంటూ అధికారులకు సూచన చేసినట్టు సమాచారం.

ఇది విని విస్తుపోవడం అధికారుల వంతయింది. చివరికి చేసేదేమీ లేక మిన్నకుండిపోయినట్టు సమాచారం. మరోవైపు అటవీశాఖ అధికారులకు కూడా అధికార పార్టీ నేతల ఆగడాలపై ఫిర్యాదు అందింది. అటవీశాఖ భూముల్లో మైనింగ్ జరుపుతున్నారంటూ సర్వే నెంబర్లతో సహా ఫిర్యాదు చేసినప్పటికీ చేష్టలుడిగి చూస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, గనులశాఖ అధికారులకు వచ్చిన ఫోన్ల బెదిరింపుల నేపథ్యంలోనే అటవీశాఖ అధికారులు కూడా అటువైపు చూసేందుకు సాహసించడం లేదని తెలుస్తోంది.  

 అక్రమ మైనింగ్ జరుగుతోంది ఇక్కడే..!
 జిల్లాలో భారీగా అక్రమ మైనింగ్ జరుగుతోంది. వాస్తవానికి లీజు పొందిన అనేక మంది భూముల్లో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఏ మాత్రమూ లేవు. ఇటువంటి వారు అనుమతి లేని అటవీ, దేవాదాయ భూముల్లో అక్రమంగా తవ్వకాలు జరిపి.. తప్పుడు బిల్లులు సృష్టించి రాష్ట్ర సరిహద్దులను దాటిస్తున్నారు.

వాస్తవానికి రామళ్లకోట గ్రామ పరిధిలోని 359 సర్వే నంబరులోని 53.81 ఎకరాల్లోని లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవుని మాన్యంతోపాటు, 344-బి, 406-బి సర్వే నంబరులోని ప్రభుత్వ భూమిలోని 365, 372 సర్వే నంబర్లు, 365, 364, 366-ఎ, 363, 344, 361, 362, 357, 356, 344-సి, 344-ఎ, 355, 344, 343, 346, 345, 353, 347 సర్వే నంబర్లలోని దాదాపు 300 ఎకరాల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండా తవ్వకాలు జరుపుతున్నారు.

వాస్తవానికి రత్నపల్లి ప్రాంతంలో ఇప్పటి వరకు మైనింగ్‌కు అనుమతే లేదు. అయితే, ఇక్కడ కూడా అధికారపార్టీ నేతలు అక్రమంగా మైనింగ్ కొనసాగిస్తున్నారు.

ప్యాపిలి మండలంలోని జలదుర్గం, గొల్లపల్లి బుగ్గ ప్రాంతంలో ఐరన్‌ఓర్, డోలమైట్ ఖనిజాల కోసం ఏకంగా అటవీ భూముల్లో పాగా వేశారు.

ఈ అక్రమ మైనింగ్ సమాచారమంతా అధికారికంగా అధికారుల వద్ద ఉన్నదే. అయినప్పటికీ అటువైపు తొంగిచూస్తే ఎక్కడ ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ తాము రోజులు లెక్కపెడుతున్నామని స్వయంగా అధికారులే పేర్కొంటుండం గమనార్హం.
 
 రద్దు కాకుండా పైరవీలు
 ఒకవైపు ప్రభుత్వం సకాలంలో పనులు ప్రారంభించని మైనింగ్ లీజులను రద్దు చేస్తోంది. అయితే, జిల్లాలో మాత్రం ఇప్పటివరకు కేవలం నాలుగు మైనింగ్ లీజులను రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి జిల్లాలో మొత్తం 1200 మైనింగ్ లీజులు ఉన్నాయి. ఇందులో సుమారు 50 వరకూ ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదని సమాచారం.

ఈ లీజులన్నింటినీ రద్దు చేయాలని ఇప్పటికే గనులశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే, ఇందులో సుమారు 20 లీజుల వెనుక ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో లీజులు రద్దుకాకుండా సచివాలయం చుట్టూ తెలుగు తమ్ముళ్లు చక్కర్లు కొడుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement