intimidation
-
మహిళా కమిషన్ల ముందుకు నవ్య కేసు
ధర్మసాగర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ కురుసపల్లి నవ్య చేసిన లైంగిక వేధింపులు, బెదిరింపుల ఆరోపణల కేసు కీలక మలుపు తిరిగింది. ఈ వివాదాన్ని జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు సుమోటోగా స్వీకరించాయి. ఎమ్మెల్యే రాజయ్యపై సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలమీద విచారణ చేపట్టి నివేదిక అందజేయాల్సిందిగా మహిళా కమిషన్లు పోలీసు శాఖను ఆదేశించాయి. కాగా, ఎమ్మెల్యే రాజయ్య, ఆయన అనుచరుల ద్వారా తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని సర్పంచ్ నవ్య శనివారం మరోసారి మండిపడ్డారు. తాను ఎమ్మెల్యే వద్ద నయాపైసా కూడా తీసుకోలేదని మరోమారు స్పష్టం చేశారు. సీడీఎఫ్ నిధుల నుంచి గ్రామాభివృద్ధికి రూ.25 లక్షలు ఇస్తానని చెప్పిన ఎమ్మెల్యే రాజయ్య, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. గతంలో ఎమ్మెల్యే రాజయ్యపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని ఆమె తెలిపారు. ఈ వ్యవహారంలో ఉన్న వారిని ఎవరినీ వదిలిపెట్టనని.. అందరి బండారం బయట పెడతానని ఆమె హెచ్చరించారు. నోటీసులు జారీ చేసిన పోలీసులు రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతోపాటు ఆయన పీఏ శ్రీనివాస్, ధర్మసాగర్ ఎంపీపీ నిమ్మ కవిత, తన భర్త ప్రవీణ్‌పై నవ్య ధర్మసాగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేతోపాటు మిగతావారిపై ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి సరైన సాక్ష్యాధారాలు, ఫోన్ రికార్డులు, డాక్యుమెంటరీ సాక్ష్యం, ఇతర ఏ విధమైన ఆధారాలు ఉన్నా తమకు అందజేయాలని ధర్మసాగర్ పోలీసులు, కాజీపేట ఏసీపీ ఆమెకు వేర్వేరుగా నోటీసులు జారీ చేశారు. కాగా, ఈ నోటీసులపై ఏ విధంగా స్పందిస్తారని మీడియా నవ్యను ప్రశ్నించగా అడ్వొకేట్ ద్వారా తన దగ్గర ఉన్న అన్ని ఆధారాలను పోలీసులకు అప్పగిస్తానని తెలిపారు. -
ప్రజల పై బెదిరింపు చర్యలకు దిగొద్దు! రష్యాని తిట్టిపోసిన యూఎన్
UN Human Rights Council, deputy UN rights chief Nada: ఉక్రెయిన్ యుద్ధానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న తమ దేశ ప్రజలపై బెదిరింపులకు దిగుతున్న రష్యా దుస్సాహాసాన్ని యూఎన్ తాత్కాలిక మానవ హక్కుల చీఫ్ నాడా అల్ నషిఫ్ తీవ్రంగా ఖండించారు. ప్రాథమిక హక్కలు అణగదొక్కే చర్యలకు పాల్పడవద్దంటూ హెచ్చరించారు. డిప్యూటీ యూఎన్ హక్కుల చీఫ్ నాడా అల్ నషిఫ్ యూఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ముందు మాట్లాడుతూ...ఉక్రెయిన్‌లో యుద్ధానికి వ్యతిరేకంగా గళం విప్పే వ్యక్తులపై బెదిరింపులు, నిర్బంధ చర్యలు, ఆంక్షలు విధించడటం తదితరాలన్నింటిని తప్పుపట్టారు. ఇది రాజ్యంగబద్ధంగా ఇవ్వబడ్డ ప్రాథమిక హక్కులకు సంబంధించి.. భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగించినట్లేనని హెచ్చరించింది. అలాగే రష్యలో జర్నలిస్టులపై పెంచుతున్న ఒత్తిడి, ఇంటర్నెట్ వనరులను నిరోధించడం తదితరాలన్నింటిని వ్యతిరేకించారు. మిచెల్ బాచెలెట్ స్థానంలో కొత్త చీఫ్ వోల్కర్టర్క్ వచ్చే వరకు ప్రస్తుతం మానవ హక్కుల కోసం తాత్కాలికి హైకమిషనర్‌గా నాడా అల్ నషీఫ్ పనిచేస్తున్నారు. రష్యా ప్రభుత్వ వైఖరి మీడియా స్వేచ్ఛకు విరుద్ధంగా, సమాచారాన్ని యాక్సెస్ చేసే హక్కును ఉల్లంఘించేవిగా ఉన్నాయన్నారు. అలాగే నిర్దేశిత విదేశీ లేదా అంతర్జాతీయ ప్రతినిధులతో అప్రకటిత పరిచయాలను రష్యన్ ఫెడరేషన్ భద్రతకు వ్యతిరేకమైన నేరంగా పరిగణించవద్దని రష్యాకి పులపునిచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌లో పూర్తి స్థాయి దాడి చేసినప్పటి నుంచి రష్యా దళాల ఉల్లంఘలపై ఉన్నత స్థాయి విచారణకు యూఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అదేశించింది. మరోవైపు రష్యాలో హక్కుల ఉల్లంఘనలపై దృష్టి పెట్టాలని ఒత్తిడి కూడా పెరుగుతోంది. అంతేగాదు అక్కడ పరిస్థితిని సమీక్షించే ఒక రిపోర్టర్ని నియమించాలని యూరోపియన్ యూనియన్ దేశాల హ్యూమన్ రైట్స్ కౌన్సిల్‌ని కోరాయి కూడా. (చదవండి: 50 మిలియన్ల మందికి పైగా ప్రజలు బానిసత్వంలోనే: యూఎస్ రిపోర్ట్) -
‘ఇక్కడి నుంచి వెళ్లిపోరా.. లేదంటే చంపేస్తా’
అనంతగిరి: బాధ్యతగల ఓ ప్రభుత్వోద్యోగి ఓ వ్యక్తిని ఎయిర్‌గన్‌తో బెదిరించిన సంఘటన శుక్రవారం రాత్రి వికారాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు.. పట్టణంలోని సాకేత్‌నగర్‌లో నివసించే షేక్ ఫయాజ్ అహ్మద్ కలెక్టరేట్లోని పౌరసరఫరాల శాఖలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి కమలానగర్‌కు చెందిన ప్రణీత్‌కుమార్ అనే వ్యక్తి గౌలికార్ ఫంక్షన్ హాల్ వెనక ఉన్న ఖాళీ స్థలంలో మూత్ర విసర్జన కోసం ఆగగా.. ఫయాజ్ అహ్మద్ వచ్చి పరుష పదజాలంతో తిట్టాడు. ‘ఇక్కడి నుంచి వెళ్లిపోరా.. లేదంటే చంపేస్తా’అంటూ కారులో నుంచి తుపాకీ తీసి బెదిరించాడు. దీంతో ప్రణీత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనాస్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఫయాజ్ అహ్మద్ ఇంట్లో వెతకగా ఎయిర్‌గన్‌తో పాటు తల్వార్, కత్తులు దొరికాయి. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని ఎయిర్‌గన్, మారణాయుధాలు ఎక్కడివని ఆరా తీశారు. అతని ఇండికా కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని, నిందితుడిని కోర్టులో హాజరు పర్చి, రిమాండ్‌కు తరలించామని సీఐ రాజశేఖర్ తెలిపారు. కాగా, ఫయాజ్ అహ్మద్ వద్ద అసలైన తుపాకీ ఉందని, పోలీసులు కేసును తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తు్తన్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. చదవండి: Banjara Hills: సహజీవనం.. విషాదం -
పిల్లలను భయపెట్టేందుకు.. నీళ్లలో హిట్ కలుపుకుని
చిలకలగూడ: అల్లరి చేస్తున్న పిల్లలను భయపెట్టేందుకు నీటిలో పురుగుల మందు కలుపుకుని తాగింది. అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్‌గూడ ఏక్‌మినార్‌గల్లీకి చెందిన ఫర్హిన్‌బేగం (26), ఫిరోజ్‌లు భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు. ఈనెల 1వ తేదీన పిల్లలు విపరీతంగా అల్లరి చేస్తుండడంతో అదుపు చేయడంతోపాటు వారిని భయపెట్టేందుకు ఇంట్లో ఉన్న బొద్దింకల మందు (హిట్)ను నీళ్లలో కలుపుకుని తాగింది. తల్లి పురుగుల మందు తాగిందని కుమారుడు సమీపంలో ఉన్న అమ్మమ్మకు చెప్పాడు. ఆమె వచ్చి అడగ్గా పిల్లలను భయపెట్టేందుకు కొంచెం పురుగుల మందు తాగానని చెప్పింది. కొంత సమయం తర్వాత అస్వస్థతకు గురికావడంతో గాంధీ ఆస్పత్రిలో చేరి్పంచారు. చికిత్స పొందుతూ ఫర్హిన్‌బేగం శనివారం మృతి చెందింది. తల్లి అస్మాసుల్తానా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విషాదం: తలనొప్పి భరించలేక కంటోన్మెంట్: తలనొప్పి భరించలేక ఓ గర్భిణి చెట్ల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. బోయిన్పల్లి ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్ బోయిన్పల్లి శ్రీనాథ్, స్వప్న (33) దంపతులు ఓల్డ్ బోయిన్పల్లి సాయికృష్ణ డ్రీమ్ హోమ్స్ అపార్ట్మెంట్లో నివాసముంటున్నారు. వీరికి హరిణి (12), చేతన (6) ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న స్వప్న కొద్దిరోజులుగా తీవ్ర తలనొప్పితో బాధపడుతుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం తలనొప్పి మరింత తీవ్రం కావడంతో ఇంట్లో చెట్ల మందు తాగింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భారత దౌత్యవేత్తకు పాక్ ఐఎస్ఐ బెదిరింపు
లాహోర్: భారత సీనియర్ దౌత్యవేత్తను పాకిస్తాన్ ఐఎస్ఐ(ఇంటర్ సర్వీస్ ఇంటిలిజెన్స్)కు చెందిన ఓ వ్యక్తి వేధించాడు. ఐఎస్ఐ వ్యక్తి, భారత దౌత్యవేత్త గౌరవ్ అహ్లువాలియా నివాసం వెలుపల వేచి ఉండి బయటకు రాగానే అతడి కారును వెంబడిస్తూ.. బెదిరించే ప్రయత్నం చేశాడు. ఈ వీడియోలో గౌరవ్ అహ్లువాలియా కారును ఓ వ్యక్తి వెంబడించడం చూడవచ్చు. పాకిస్తాన్ ఐఎస్ఐ, గౌరవ్ ఇంటి బయట కార్లు, బైక్‌ల మీద మనుషులను ఉంచి అతడిని వేధింపులకు గురి చేయడమే కాక భయపెట్టేందుకు ప్రయత్నించింది. #WATCH Islamabad: Vehicle of India's Chargé d'affaires Gaurav Ahluwalia was chased by a Pakistan's Inter-Services Intelligence (ISI) member. ISI has stationed multiple persons in cars and bikes outside his residence to harass and intimidate him. pic.twitter.com/TVchxF8Exz — ANI (@ANI) June 4, 2020 న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు ఐఎస్ఐ అధికారులను భారత్ బహిష్కరించిన కొద్ది రోజులకే ఈ సంఘటన జరగడం గమనార్హం. కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్ ఐఎస్ఐ అధికారులు అబిద్ హుస్సేన్, ముహమ్మద్ తాహిర్‌లు న్యూ ఢిల్లీలోని భారత సైన్యానికి సంబంధించిన పత్రాలను పొందడానికి ప్రయత్నిస్తున్నప్పుడు భారత గూఢచార సంస్థలు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం వారిని దేశం నుంచి బహిష్కరించారు. -
మలేసియాలో మరణశిక్ష రద్దు
కౌలాలంపూర్: మలేసియా ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. తీవ్రమైన నేరాలకు పాల్పడిన దోషులకు విధించే మరణశిక్షను త్వరలోనే రద్దు చేస్తామని ప్రకటించింది. ప్రధాని మహతీర్ మొహమ్మద్ అధ్యక్షతన బుధవారం నాడిక్కడ జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మలేసియా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో త్వరలో మరణశిక్ష అమలు కానున్న 1,200 మందికి పైగా ఖైదీలకు ఊరట లభించినట్లయింది. సాధారణంగా హత్య, డ్రగ్స్ అక్రమరవాణా, దేశద్రోహం, ఉగ్రదాడులు, కిడ్నాప్ వంటి ఘటనల్లో దోషులుగా తేలినవారికి మలేసియాలో ఇప్పటివరకూ మరణదండన విధిస్తున్నారు. తాజా నిర్ణయంపై మలేసియా న్యాయశాఖ మంత్రి ల్యూ వుయ్ కియాంగ్ మాట్లాడుతూ.. మరణదండనకు సంబంధిం చి సవరించిన బిల్లును వచ్చే సోమవారం పార్లమెంటులో ప్రవేశపెడతామని తెలిపారు. అవినీతి రహిత పాలన అందిస్తామనీ, మరణశిక్షను రద్దు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని తమ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని వెల్లడించారు. కాగా, మలేసియా ప్రభుత్వ నిర్ణయాన్ని అమ్నెస్టీ ఇంటర్నేషనల్, మానవహక్కుల సంస్థ‘లాయర్స్ ఫర్ లిబర్టీ’ స్వాగతించాయి. ఈ సందర్భంగా కొత్త చట్టంలో ఎలాంటి మినహాయింపులు లేకుండా అన్ని నేరాలకు మరణశిక్షను రద్దు చేయాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యదర్శి కుమీ నైదూ విజ్ఞప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 142 దేశాలు మరణదండనను తిరస్కరించాయని వెల్లడించారు. భారత్, సింగపూర్, చైనా, ఇండోనేసియా, థాయ్‌లాండ్, వియత్నాం దేశాలు ఇంకా మరణశిక్షను అమలు చేస్తున్నాయన్నారు. -
మతం పేరుతో భయపెడుతున్నారు: ప్రకాశ్‌రాజ్
చెన్నై: మతం, సంస్కృతి, నైతికత పేరుతో కొందరు ప్రజలను భయపెడుతున్నారంటూ నటుడు ప్రకాశ్‌రాజ్ శుక్రవారం ఆరోపించారు. ‘నైతికత పేరుతో నా దేశపు వీధుల్లో యువ జంటలపై దాడులు చేయడం భయపెట్టడం కాకపోతే మరేమిటి? గోవధ చేశారేమోనన్న చిన్న అనుమానంతో మనుషులపై సామూహిక దాడులు చేసి హతమార్చడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం భయపెట్టడం కాక మరేంటి? అసమ్మతితో చిన్న స్వరం వినిపించినా వారిని బెదిరించడం, దూషించడం అంటే భయపెట్టడం కాదా?’ అని ట్వీట్లు చేశారు. -
మంత్రి వలర్మతికి ఓటర్ బెదిరింపులు
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంకు మద్దతు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మంత్రి వలర్మతికి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. శ్రీరంగం నియోజకవర్గానికి చెందిన ఒక మహిళ ఫోన్ ద్వారా వలర్మతిని బుధవారం సాయంత్రం బెదిరింపులకు గురిచేసినట్లుగా ఒక ఆడియో సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన వ్యక్తిగా చెబుతున్నా పన్నీర్‌సెల్వంకు మద్దతు పలకండి, ఆయన చేత బలవంతంగా రాజీనామా చేయించడం సరికాదంటూ బెదిరించినట్లుగా ఆ ఆడియోలో సంభాషణలు సాగాయి. మరోవైపు పన్నీర్‌సెల్వంకు మద్దతుగా నిలిచిన పుదుచ్చేరికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఓంశక్తిశేఖర్ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించినట్లు శశికళ ప్రకటించారు. -
ఖబడ్దార్..!
మా జోలికి వస్తే చంపేస్తాం! సాక్షి ప్రతినిధి, కర్నూలు : అధికారపార్టీ నేతల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. తమ అక్రమాల జోలికి వస్తే ఏకంగా చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాము చేస్తున్న అక్రమ వ్యాపారాలను చూస్తూ ఊరుకోవాలని హెచ్చరిస్తున్నారు. లేదంటే బదిలీ తప్పదని భయపెడుతున్నారు. తాజాగా అక్రమ మైనింగ్ వ్యవహారంలో గనులశాఖ అధికారులకు తెలుగు తమ్ముళ్లు అసభ్య పదజాలంతో హెచ్చరించారు. దారికి రాకపోతే చంపేస్తామని కూడా బెదిరించారు. వీరి అసభ్య పదజాలం భరించలేక సదరు అధికారులు.. ఈ బెదిరింపులను సెల్ఫోన్లో రికార్డు కూడా చేసినట్టు సమాచారం. ఈ రికార్డును ఎస్పీకి వినిపించి కేసు పెట్టాలని మొదట్లో భావించిన అధికారులు.. చివరికి భయపడి ఊరుకున్నట్టు తెలుస్తోంది. చివరకు అధికార పార్టీ ‘ఉప’నేతను కలిసి తమ బాధను విన్నవించుకున్నట్టు సమాచారం. అయితే, తమ అనుచరులను అదుపులో పెట్టాల్సిన ఆయన.. సర్దుకుపోవాలంటూ అధికారులకు సూచనలు ఇచ్చినట్టు తెలిసింది. భారీగా అక్రమ మైనింగ్! జిల్లాలో అక్రమ మైనింగ్ భారీగా సాగుతోంది. వాస్తవానికి జిల్లా వ్యాప్తంగా కల్లూరు, ప్యాపిలి, బేతంచెర్ల, వెల్దుర్తి, డోన్ ప్రాంతాల్లో 1200 లీజులకుగానూ సుమారు 7 వేల హెక్టార్లకుపైగా మైనింగ్‌కు అనుమతులున్నాయి. అయితే, వీటిలో కేవలం ఒకటి రెండు ప్రాంతాల్లో మినహా ఎక్కడా నాణ్యమైన ఇనుప ఖనిజం (ఐరన్‌ఓర్) లేదు. లీజులు అనుమతి ఉన్న ప్రాంతాల్లో కేవలం బీ గ్రేడ్, సీ గ్రేడ్ ఐరన్‌ఓర్ మాత్రమే దొరుకుతోంది. వీటి ధర కూడా మార్కెట్లో చాలా తక్కువ. టన్ను కేవలం 2 వేల రూపాయలు మించే పరిస్థితి లేదు. అయితే అటవీశాఖ, దేవాదాయశాఖ భూముల్లో నాణ్యమైన ఇనుప ఖనిజం లభిస్తోంది. కానీ ఈ భూముల్లో మైనింగ్ తవ్వకాలకు అనుమతులు లేవు. అయినప్పటికీ అధికారపార్టీ నేతలు ఎక్కడపడితే అక్కడ మైనింగ్‌కు పూనుకుంటున్నారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో అటవీశాఖ భూములతో పాటు దేవాదాయశాఖ భూముల్లో అధికారపార్టీ నేతలు విచ్చలవిడిగా ఇనుప ఖనిజాన్ని తవ్వి.. తమకు మైనింగ్ అనుమతులు ఉన్న భూముల్లోనే తవ్వుతున్నట్టు లెక్కలు చూపుతున్నారు. ఇదే కోవలోనే తాజాగా కొద్దిరోజుల క్రితం వెల్దుర్తి ప్రాంతంలో అధికార పార్టీ ఎంపీటీసీ సభ్యులు అక్రమ మైనింగ్ జరుపుతున్నట్టు గనులశాఖ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో అధికారులు కాస్తా విచారణ చేపట్టారు. ఇది గిట్టని అధికార పార్టీ ఎంపీటీసీ సభ్యుడు ఒకరు నేరుగా అధికారులకే ఫోను చేసి మరీ బెదిరించారు. ‘మా మైనింగ్ వైపు రావొద్దు. మా జోలికి వస్తే జాగ్రత్త. ప్రాణాలు తీస్తా’ అంటూ నేరుగా బెదిరింపులకు దిగారు. ఇదే విధంగా మరొక ఎంపీటీసీ సభ్యుడు కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. బెదిరింపులతో పాటు సదరు నేతల అసభ్య పదజాలాన్ని భరించలేక ఫోన్లో రికార్డు చేసి ఏకంగా ఎస్పీకి ఫిర్యాదు చేద్దామని గనులశాఖ అధికారులు మొదట్లో భావించినట్టు తెలిసింది. అయితే, చివరికి ‘ఉప’నేత వద్దకు పంచాయితీకి వెళ్లినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. వాళ్ల జోలికి వెళ్లొద్దు! అధికారపార్టీ నేతలతో ఎందుకు తగాదా అనుకున్న అధికారులు న్యాయం కోసం జిల్లాకు చెందిన ‘ఉప’నేతను ఆశ్రయించారు. తమకు ఫోన్ చేసి తెలుగు తమ్ముళ్ల బెదిరింపు రికార్డును కూడా ఆయనకు వినిపించినట్టు తెలిసింది. అంతా విన్న సదరు నేత తెలుగు తమ్ముళ్లను ఏమీ అనలేదని తెలిసింది. సదరు టీడీపీ నేతలకు ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండాలని, అధికారులను బెదిరించడం సరికాదని మాత్రమే చెప్పిన ఆయన.. సర్దుకుపోవాలంటూ అధికారులకు సూచన చేసినట్టు సమాచారం. ఇది విని విస్తుపోవడం అధికారుల వంతయింది. చివరికి చేసేదేమీ లేక మిన్నకుండిపోయినట్టు సమాచారం. మరోవైపు అటవీశాఖ అధికారులకు కూడా అధికార పార్టీ నేతల ఆగడాలపై ఫిర్యాదు అందింది. అటవీశాఖ భూముల్లో మైనింగ్ జరుపుతున్నారంటూ సర్వే నెంబర్లతో సహా ఫిర్యాదు చేసినప్పటికీ చేష్టలుడిగి చూస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, గనులశాఖ అధికారులకు వచ్చిన ఫోన్ల బెదిరింపుల నేపథ్యంలోనే అటవీశాఖ అధికారులు కూడా అటువైపు చూసేందుకు సాహసించడం లేదని తెలుస్తోంది. అక్రమ మైనింగ్ జరుగుతోంది ఇక్కడే..! జిల్లాలో భారీగా అక్రమ మైనింగ్ జరుగుతోంది. వాస్తవానికి లీజు పొందిన అనేక మంది భూముల్లో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఏ మాత్రమూ లేవు. ఇటువంటి వారు అనుమతి లేని అటవీ, దేవాదాయ భూముల్లో అక్రమంగా తవ్వకాలు జరిపి.. తప్పుడు బిల్లులు సృష్టించి రాష్ట్ర సరిహద్దులను దాటిస్తున్నారు. వాస్తవానికి రామళ్లకోట గ్రామ పరిధిలోని 359 సర్వే నంబరులోని 53.81 ఎకరాల్లోని లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవుని మాన్యంతోపాటు, 344-బి, 406-బి సర్వే నంబరులోని ప్రభుత్వ భూమిలోని 365, 372 సర్వే నంబర్లు, 365, 364, 366-ఎ, 363, 344, 361, 362, 357, 356, 344-సి, 344-ఎ, 355, 344, 343, 346, 345, 353, 347 సర్వే నంబర్లలోని దాదాపు 300 ఎకరాల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండా తవ్వకాలు జరుపుతున్నారు. వాస్తవానికి రత్నపల్లి ప్రాంతంలో ఇప్పటి వరకు మైనింగ్‌కు అనుమతే లేదు. అయితే, ఇక్కడ కూడా అధికారపార్టీ నేతలు అక్రమంగా మైనింగ్ కొనసాగిస్తున్నారు. ప్యాపిలి మండలంలోని జలదుర్గం, గొల్లపల్లి బుగ్గ ప్రాంతంలో ఐరన్‌ఓర్, డోలమైట్ ఖనిజాల కోసం ఏకంగా అటవీ భూముల్లో పాగా వేశారు. ఈ అక్రమ మైనింగ్ సమాచారమంతా అధికారికంగా అధికారుల వద్ద ఉన్నదే. అయినప్పటికీ అటువైపు తొంగిచూస్తే ఎక్కడ ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ తాము రోజులు లెక్కపెడుతున్నామని స్వయంగా అధికారులే పేర్కొంటుండం గమనార్హం. రద్దు కాకుండా పైరవీలు ఒకవైపు ప్రభుత్వం సకాలంలో పనులు ప్రారంభించని మైనింగ్ లీజులను రద్దు చేస్తోంది. అయితే, జిల్లాలో మాత్రం ఇప్పటివరకు కేవలం నాలుగు మైనింగ్ లీజులను రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి జిల్లాలో మొత్తం 1200 మైనింగ్ లీజులు ఉన్నాయి. ఇందులో సుమారు 50 వరకూ ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదని సమాచారం. ఈ లీజులన్నింటినీ రద్దు చేయాలని ఇప్పటికే గనులశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే, ఇందులో సుమారు 20 లీజుల వెనుక ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో లీజులు రద్దుకాకుండా సచివాలయం చుట్టూ తెలుగు తమ్ముళ్లు చక్కర్లు కొడుతున్నారు.