ధర్మసాగర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ కురుసపల్లి నవ్య చేసిన లైంగిక వేధింపులు, బెదిరింపుల ఆరోపణల కేసు కీలక మలుపు తిరిగింది. ఈ వివాదాన్ని జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు సుమోటోగా స్వీకరించాయి. ఎమ్మెల్యే రాజయ్యపై సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలమీద విచారణ చేపట్టి నివేదిక అందజేయాల్సిందిగా మహిళా కమిషన్లు పోలీసు శాఖను ఆదేశించాయి.
కాగా, ఎమ్మెల్యే రాజయ్య, ఆయన అనుచరుల ద్వారా తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని సర్పంచ్ నవ్య శనివారం మరోసారి మండిపడ్డారు. తాను ఎమ్మెల్యే వద్ద నయాపైసా కూడా తీసుకోలేదని మరోమారు స్పష్టం చేశారు. సీడీఎఫ్ నిధుల నుంచి గ్రామాభివృద్ధికి రూ.25 లక్షలు ఇస్తానని చెప్పిన ఎమ్మెల్యే రాజయ్య, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. గతంలో ఎమ్మెల్యే రాజయ్యపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని ఆమె తెలిపారు. ఈ వ్యవహారంలో ఉన్న వారిని ఎవరినీ వదిలిపెట్టనని.. అందరి బండారం బయట పెడతానని ఆమె హెచ్చరించారు.
నోటీసులు జారీ చేసిన పోలీసులు
రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతోపాటు ఆయన పీఏ శ్రీనివాస్, ధర్మసాగర్ ఎంపీపీ నిమ్మ కవిత, తన భర్త ప్రవీణ్‌పై నవ్య ధర్మసాగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేతోపాటు మిగతావారిపై ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి సరైన సాక్ష్యాధారాలు, ఫోన్ రికార్డులు, డాక్యుమెంటరీ సాక్ష్యం, ఇతర ఏ విధమైన ఆధారాలు ఉన్నా తమకు అందజేయాలని ధర్మసాగర్ పోలీసులు, కాజీపేట ఏసీపీ ఆమెకు వేర్వేరుగా నోటీసులు జారీ చేశారు.
కాగా, ఈ నోటీసులపై ఏ విధంగా స్పందిస్తారని మీడియా నవ్యను ప్రశ్నించగా అడ్వొకేట్ ద్వారా తన దగ్గర ఉన్న అన్ని ఆధారాలను పోలీసులకు అప్పగిస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment