సాక్షి, వరంగల్: కోతి తన చేష్టలతో కరెంటోళ్ళకే షాక్ ఇచ్చింది. 20 గ్రామాలకు కరెంటు సప్లై లేకుండా చేసింది. కోతి తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది. విద్యుత్ అధికారులను ముప్పుతిప్పలు పెట్టి, లక్షా రూపాయల వరకు నష్టం కలుగజేసింది. జనగామ జిల్లా వడ్లకొండ 220 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ లో విద్యుత్ స్తంభాలపై ఎగిరిన కోతి, ట్రాన్స్ ఫార్మర్‌ను పట్టుకుంది. దీంతో ట్రాన్స్ ఫార్మర్ పేలిపోవడంతో పాటు కోతికి తీవ్ర గాయాలయ్యాయి.
వడ్లకొండ 220 కేవీ సబ్ స్టేషన్ నుంచి లింగాలఘనపురం, జనగామ, అడవికేశ్వాపూర్, గానుగుపహాడ్, పసరమడ్ల 33/11 కేవీ ఫీడర్లకు విద్యుత్ సరఫరా అవుతుంది. విద్యుత్ సంబంధించి ఎప్పటికప్పుడు రీడింగ్ నమోదు చేసేలా అక్కడే ప్రొటెన్షల్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ప్రొటెన్షల్ ట్రాన్స్ ఫార్మర్‌ను కోతి పట్టుకోవడంతో పేలిపోవడంతో పాటు జంపర్లు పూర్తిగా తెగిపడ్డాయి. ఫలితంగా 20 గ్రామాలకు మూడుగంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న విద్యుత్ సిబ్బంది ట్రాన్స్ ఫార్మర్లో చిక్కుకున్న కోతిని కిందికి దింపి, మరమ్మతులు నిర్వహించి కరెంటు సరఫరాను పునరుద్ధరించారు. కోతి కారణంగా సంస్థకు లక్ష రూపాయల నష్టం వాటిల్లింది.
Comments
Please login to add a commentAdd a comment