చింతబాయితండాలో రైతులతో మాట్లాడుతున్న హరీశ్‌రావు, ఎర్రబెల్లి తదితరులు
ప్రభుత్వానికి హరీశ్‌రావు, ఎర్రబెల్లి, సత్యవతి, కడియం హితవు
రైతాంగ సమస్యలపై సచివాలయాన్ని ముట్టడిస్తాం
పంట నష్టపోయిన రైతుకు ఎకరానికి రూ. 25 వేలు పరిహారం ఇవ్వాలి
దేవరుప్పుల: కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎమ్మెల్యేల ఫిరాయింపునకు గేట్లు తెరవకుండా, అన్నదాతల పంటల రక్షణకు ప్రాజెక్టుల గేట్లు తెరవాలని మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, కడియం శ్రీహరి హితవు పలికారు. ఆదివారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చింతబాయితండాలో బోర్లు ఎత్తిపోయి, సాగునీరు అందక ఎండిపోయిన వరి పొలాలను వారు సందర్శించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు బృందం రైతులతో మాట్లాడింది. నీళ్లు లేక ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు శివశంకర్ అనే రైతు అప్పులు చేసి మూడు నెలల్లో 6 బోర్లు, సత్యమ్మ 4 బోర్లు, నర్సింహ 3 బోర్లు, జంకు 9 బోర్లు, లక్ష్మి 6 బోర్లు, విజయ 4 బోర్లు వేశారు. అయినా ఫలితం లేదని రైతులు వాపోయారు.
హరీశ్‌రావు, ఎర్రబెల్లి, కడియం వీరి కష్టాలను ప్రస్తావిస్తూ, సీఎం, మంత్రులు హైదరాబాద్‌లో రాజకీయాలు మాని వ్యవసాయ క్షేత్రాలకు వచ్చి.. రైతులకు ఆత్మవిశ్వాసం కల్పించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా పలకరించిన పాపానపోలేదన్నారు. గోదావరి నదిలో నీళ్లున్నా ప్రభుత్వం రైతులకు అందించలేక చేతులెత్తేసిందని, రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. రూ.2 లక్షల రుణం మాఫీ చేస్తామని చెప్పి వంద రోజులు దాటినా నెరవేర్చలేదని, రైతుబంధు కింద రూ.15 వేలు ఇస్తామని మోసం చేశారని ధ్వజమెత్తారు. గతంలో తామిచ్చిన రూ.పది వేలు కూడా ఇవ్వడం లేదని, కౌలు రైతులను సైతం దగా చేస్తున్నారని విమర్శించారు.
బీఆర్‌ఎస్ హయాంలో కాల్వలకు పుష్కలంగా నీళ్లు ఇవ్వగా రెండు పంటలు పండించుకుని రైతులు సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ వచ్చాక నీళ్లు, కరెంటుకు కష్టాలు ప్రారంభమయ్యాయని, మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థ పాలనతో రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోవడమే కాకుండా.. వడగళ్ల వానలతో లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అన్నారు. అయినా ముఖ్యమంత్రికి, మంత్రులకు పట్టడం లేదన్నారు. సత్వరమే దెబ్బతిన్న వరి పంటకు ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలని, వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోకపోతే ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని, అవసరమైతే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు పల్లా సుందర్‌రామిరెడ్డి వారి వెంట ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment