సాక్షి ప్రతినిధి, వరంగల్/ధర్మసాగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జానకీపురం సర్పంచ్ నవ్య ఆరోపణలకు సంబంధించి.. ఆమెతోపాటు ఎమ్మెల్యే టి.రాజయ్య ఒకే వేదికపైకి వచ్చారు. ఆదివారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం గ్రామానికి వెళ్లిన రాజయ్య.. సర్పంచ్ కురుసవల్లి నవ్య, ఆమె భర్త ప్రవీణ్‌లతో చర్చించారు. తర్వాత వారంతా కలిసి జానకీపురంలోనే మీడియా సమావేశంలో మాట్లాడారు.
బాధ కలిగితే క్షమాపణలు చెప్తున్నా: రాజయ్య
మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. ‘‘నా వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమాపణలు కోరుతున్నాను. జరిగిన పరిణామాలకు చింతిస్తున్నాను. నాకు నలుగురు చెల్లెళ్లు. ఊపిరి ఉన్నంత వరకు మహిళల ఆత్మగౌరవం కోసం పనిచేస్తా. నేను పనిచేసే క్రమంలో ఎక్కడైనా, ఎవరైనా మానసిక క్షోభకు గురైతే మహిళా సమాజానికి క్షమాపణలు చెప్తున్నా.. తెలిసీ తెలియక తప్పులు జరిగితే ఒప్పుకోక తప్పదు.
జానకీపురం గ్రామ అభివృద్ధికి రూ.25 లక్షలు కేటాయిస్తున్నా. సర్పంచ్ నవ్య, ప్రవీణ్‌లను అన్నిరకాలుగా కాపాడుకుంటాను. నేను చేసిన శిఖండి వ్యాఖ్యలపై తర్వాత మాట్లాడుతా. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు..’’అని పేర్కొన్నారు.
పార్టీ పెద్దల ఆదేశాలతో..
సర్పంచ్ కె.నవ్యపై ఎమ్మెల్యే రాజయ్య లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా వచ్చి ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ప్రధాన మీడియాతోపాటు సోషల్ మీడియాలోనూ దీనిపై దుమారం రేగింది. ఈ క్రమంలో పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని వివాదాన్ని పరిష్కరించుకోవాల్సిందిగా ఆదేశించినట్టు తెలిసింది. ఈ మేరకే.. రాజయ్య, కొందరు పార్టీ నేతలతో కలిసి జానకీపురం వెళ్లినట్టు తెలిసింది.
రాజయ్యకు మహిళా కమిషన్ నోటీసు
సర్పంచ్ నవ్య ఆరోపణల అంశాన్ని సుమోటోగా తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా వచ్చిన అభ్యర్థనపై మహిళా కమిషన్ ఆదివారం స్పందించింది. రాజయ్యకు నోటీసులు జారీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఘటనపై విచారణ జరపాలని డీజీపీ అంజనీకుమార్‌కు కమిషన్ చైర్‌పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి లేఖ రాసినట్టు తెలిపింది.
మహిళల పట్ల పిచ్చి వేషాలు వేయొద్దు: నవ్య
ఎవరైనా సరే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే, వివక్ష చూపితే సహించేది లేదని సర్పంచ్ నవ్య పేర్కొన్నారు. ‘‘చెడును కచ్చితంగా ఖండిస్తాను. ఎవరికైనా పార్టీలో విలువ ముఖ్యం. ఎమ్మెల్యే రాజయ్య వల్లే నేను సర్పంచ్ అయ్యాను. అయితే రాజకీయాల్లో అణచివేతలు, వేధింపులు ఉండొద్దు. ఎవరైనా మహిళలపై పిచ్చివేషాలు వేస్తే పెట్రోల్ పోసి తగలబెట్టడానికైనా వెనుకాడను. ముఖ్య నాయకులు వారి పద్ధతి మార్చుకుని మహిళలను గౌరవించాలి. ఇక మీదట తప్పులు చేయకూడదు.
గతంలో జరిగిన తప్పులను క్షమిస్తున్నాను. బీఆర్‌ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తాను. నేను చేసిన ఆరోపణలు నిజం. సమాజంలో మహిళలు కొన్ని విషయాల్లో కొందరి చేత మోసపోతున్నారు. అలాంటి వారు బయటికి వచ్చి నిలదీయాలి. ఎవరికైనా అన్యాయం జరిగితే వారిపక్షాన నేను ముందుండి కొట్లాడుతా..’’అని చెప్పారు. ఎమ్మెల్యే రాజయ్య జానకీపురం గ్రామ అభివృద్ధికి ఎలాంటి సహకారం అందించడం లేదని.. ఇప్పటికైనా అభివృద్ధిపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment