సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించి రాష్ట్రపతి పంపిన ముసాయిదా బిల్లుపై శాసనసభలో చర్చించకుండా అడ్డుకోవడం అప్రజాస్వామికమని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. ఈ నెల 7న ఇందిరాపార్కు వద్ద నిర్వహించబోయే సంపూర్ణ తెలంగాణ సాధనాదీక్ష పోస్టర్‌ను శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీమాంధ్ర ఎమ్మెల్యేల వైఖరి రాజ్యాంగ విరుద్ధమన్నారు. సభలో చర్చ జరుగకుండా అడ్డుకోవడం ద్వారా రాజ్యాంగాన్ని, రాష్ట్రపతిని అవమానిస్తున్నారని విమర్శించారు. ముసాయిదా బిల్లుపై సత్వరమే చర్చను పూర్తిచేసి, ప్రక్రియను వేగంగా ముగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంక్షలు లేని తెలంగాణ కోసం ఈ నెల 7న చేస్తున్న దీక్షను విజయవంతం చేయాలని కోదండరాం ప్రజలను కోరారు.
జేఏసీ ముఖ్యనేతలు సి.విఠల్, అద్దంకి దయాకర్, వి.శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ సీమాంధ్ర ఎంపీలు చేసిన సంకల్పదీక్షకు స్పష్టత లేదని, సీమాంధ్రలో రాజకీయ ఆధిపత్యం కోసమే దీక్ష చేశారని అన్నారు. రాజ్యాంగాధినేత రాష్ట్రపతి పంపిన ముసాయిదా బిల్లుపై కనీస గౌరవం లేకుండా చర్చను అడ్డుకుంటున్న వారంతా దేశద్రోహులేనని అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటైపోయిందని అనుకుంటున్న ఈ సమయంలోనూ కీలకమైన ప్రభుత్వ స్థానాల్లోకి సీమాం ధ్రులు అక్రమంగా డిప్యుటేషన్లు వేయించుకుంటున్నారని విఠల్ ఆరోపించారు. సమైక్యమని అంటున్నవారిలోనే సమైక్యత లేదని శ్రీనివాస్‌గౌడ్ ఎద్దేవా చేశారు.
29న రాష్ట్రపతి ఆమోదముద్ర ఖాయం..
డైరీలు తెలంగాణ ఉద్యమ కరదీపికలుగా పనిచేస్తున్నాయని కోదండరాం అన్నారు. శనివారం ఎర్రమంజిల్‌లోని గ్రామీణ నీటి పారుదల సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్) కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా ఇంజనీర్స్ సంఘం డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ... జనవరి23న టి బిల్లు ఢిల్లీకి వెళ్లుతుందని, 29న బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఇంజనీర్స్ జేఏసీ చైర్మన్ వెంకటేశం, యూనియన్ ప్రతినిధులు ఎల్లారెడ్డి, నరేందర్, రాములునాయక్, భూమన్న తదితరులు పాల్గొన్నారు.
చర్చను అడ్డుకోవడం అప్రజాస్వామికం
Published Sun, Jan 5 2014 2:48 AM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM
Advertisement