కొండవీటి వాగు వ్యధ మళ్లీ మొదటికి..! | Kondaveeti brook distressing start again ..! | Sakshi
Sakshi News home page

కొండవీటి వాగు వ్యధ మళ్లీ మొదటికి..!

Published Thu, Jan 15 2015 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 7:43 PM

Kondaveeti brook distressing start again ..!

సాక్షి ప్రతినిధి, గుంటూరు : కొండవీటివాగు మరమ్మతులు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. మరో ఏడాది తరువాతనే పనులు ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. రాజధాని మాస్టర్ ప్లాన్‌తో వాగు మరమ్మతులు ముడిపడి ఉన్న నేపథ్యంలో ఈ పరిస్థితి ఉత్పన్నమైనట్టు సమాచారం.
     
కొండవీటి వాగుకు ప్రత్యేక మరమ్మతులు చేసేందుకు ఆరు నెలల క్రితమే ఇరిగేషన్ శాఖ అంచనాలు తయారు చేసింది. ఆ మేరకు పనులు చేపడితే కొత్తగా రూపొం దించనున్న రాజధాని మాస్టర్ ప్లాన్‌లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. అలాచేస్తే ప్రభుత్వ నిధులు నిరుపయోగంగా మారే అవకాశం ఉండటంతో రాజధాని మాస్టర్‌ప్లాన్ తరువాతనే కొండవీటివాగుకు మరమ్మతులు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఏడాది వరకు కొండవీటివాగు మరమ్మతులు ప్రారంభమయ్యే పరిస్థితే లేదు.
     
కొండవీటివాగు కారణంగా మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోని తాడేపల్లి, మంగళగిరి, తాడికొండ, అమరావతి మండలాలకు సంబంధించి 12 వేల హెక్టార్లలో వాణిజ్య పంటలు ప్రతి ఏటా నీట మునిగి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. వాగుకు వచ్చే 5,600 క్యూసెక్కుల వరదనీటి వల్ల ఉల్లి, పత్తి, కూరగాయలు, మిరప, చెరకు, పసుపు, కంద, వరి తదితర పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు అప్పులపాలవుతున్నారు.
     
ఈ నేపథ్యంలో కొండవీటివాగుకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఇరిగేషన్ రంగ నిపుణల కమిటీ ఈ ప్రాంతంలో పర్యటించి పరిస్థితులను అధ్యయనం చేసింది. ఆ తరువాత కొన్ని పరిష్కార మార్గాలను ప్రభుత్వానికి అందజేసింది.
     
ముఖ్యంగా వాగు ప్రవహించే గ్రామాల్లో చిన్న, చిన్న రిజర్వాయర్లు, చెరువులు నిర్మించి నీటిని నిల్వ చేయడం వల్ల వాగు ఉధృతి తగ్గుతుందని సూచించారు. వాగుకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణం, రవాణా సౌకర్యం మెరుగుపరిచి రైతుల పంటలను త్వరితగతిన మార్కెట్‌కు తరలించేందుకు అనువుగా రహదారులు, డబుల్ వే బ్రిడ్జిలను నిర్మించాలని కూడా సూచనలు చేసింది.
     
వీటి ప్రకారం ఇరిగేషన్‌శాఖ అంచనాలు తయారు చేసింది. వాగు పరివాహక ప్రాంతంలో 23 బ్రిడ్జిల నిర్మాణాలు ఉన్నాయి.  ఆ మేరకునిర్మిస్తే రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం కొన్నింటిని తొలగించే అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా జరిగితే ప్రభుత్వ నిధులు నిరుపయోగం అయ్యే అవకాశం ఉండటంతో కొండవీటి వాగు అంచనాలన్నింటినీ ప్రభుత్వం కొంతకాలం  పక్కన పెట్టింది.
     
రాజధాని మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల  సింగపూర్ కంపెనీతో ఎంఓయు కుదుర్చుకున్నది. ఆ కంపెనీ ఆరు నెలల్లోపే మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తామని ప్రకటించినప్పటికీ, మరికొంత జాప్యం జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
     
ఆ మాస్టర్‌ప్లాన్ ప్రకారం రాజధాని ప్రాంతంలోనే ప్రవహిస్తున్న కొండవీటివాగుకు ఎక్కడ బ్రిడ్జిలు,రహదారులు నిర్మించాలో తెలుస్తుంది.  అప్పటి వరకు కొండవీటి వాగు పనులు జరిగే అవకాశాలు లేవు.
     
దివంగత ముఖ్యమంత్రి  చెన్నారెడ్డి హయాం నుంచి కొండవీటి వాగు సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు ప్రారంభమైనా అనేక కారణాల రీత్యా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు రాజధాని మాస్టర్ ప్లాన్ కారణంగా మరోసారి వాయిదా పడటంతో రైతులు నిరాశ చెందుతున్నారు.

Advertisement
Advertisement