వేంపల్లి (వైఎస్సార్ జిల్లా) : గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం వైఎస్సార్ జిల్లా వేంపల్లి మండలంలోని అలవలపాడు గ్రామంలో జరిగింది. అలవలపాడు గ్రామానికి చెందిన పల్లపు వెంకటేష్(45) అనే వ్యక్తి కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం గ్రామంలో ఉపాధి కూలీకి వెళ్లాడు.
అక్కడ మధ్యాహ్నం అన్నం తింటుండగా గుండెలో నొప్పిగా ఉందని ఇతర కూలీలతో చెప్పాడు. దీంతో వారు మజ్జిగ తాగించారు. మజ్జిగ తాగిన అనంతరం గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడికి భార్య ఉన్నట్లు సమాచారం. వెంకటేష్ మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.