
ఏపీలో లక్షల్లో నిరుద్యోగులు
► ఉద్యోగం కావాలంటూ 9.28 లక్షల మంది పేర్లు నమోదు
► కార్మిక, ఉపాధి శాఖ బడ్జెట్ పద్దులో వెల్లడించిన ఏపీ సర్కారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య లక్షల్లో ఉందని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే వెల్లడించింది. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కార్ వైఫల్యం చెందింది. జాబు కావాలంటే బాబు రావాలంటూ ఎన్నికల్లో పెద్దఎత్తున ప్రచారం చేయడమే కాకుండా ఉద్యోగం ఇచ్చే వరకు నెలకు రూ.రెండు వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన హామీని కూడా టీడీపీ ప్రభుత్వం విస్మరించింది.
బడ్జెట్ సమావేశాల ముందు ప్రతిపక్ష నేత జగన్ నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాయడంతో నిరుద్యోగులకు అసిస్టెంట్ పేరుతో బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. ఈ సహాయం కూడా ఎలా ఇస్తారు, ఎంత ఇస్తారనే మార్గదర్శకాలను కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం రూపొందించలేదు. పైగా ఆర్థిక సాయం పొందేవారు సామాజిక సేవ చేయాలంటూ ముడిపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవల ముగిసిన బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రంలో ఉద్యోగాలు కావాలంటూ ఎంప్లాయిమెంట్ ఎక్పేంజీల్లో పేర్లు నమోదు చేసుకున్న వారి సంఖ్య 9,28,566 ఉన్నట్లు కార్మిక, ఉపాధి శాఖ స్పష్టం చేసింది.
2016 డిసెంబర్ నాటికి ఇంత మంది ఉద్యోగాల కోసం పేర్లు రిజిష్టర్ చేసుకుని కొలువుల కోసం ఎదురుచూస్తున్నారని ప్రభుత్వమే పేర్కొంది. ఎంప్లాయిమెంట్ ఎక్సేంజీల్లో నమోదు చేసుకున్న నిరుద్యోగుల సంఖ్యే 9.28 లక్షల మందిగాప్రభుత్వం వెల్లడించగా ఎక్సేంజీల్లో పేర్లు నమోదు చేసుకోని నిరుద్యోగుల సంఖ్య మరో 20 లక్షలకు పైగా ఉంటుందని అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టకపోగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పన చర్యలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి.
గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు 474 జాబ్ మేళాలను నిర్వహించగా ఈ మేళాలకు 35,061 మంది హాజరయ్యారు. ఇందులో 11,542 మంది ఎంపికవ్వగా కేవలం 3,111 మందికి మాత్రమే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇప్పించగలిగారు. నిరుద్యోగులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైన సర్కారు మరో వైపు ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ పోతోంది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికలకు ముందు ప్రకటించిన సర్కారు మూడేళ్ల అనంతరం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయబోమని ఇటీవలే తేల్చి చెప్పింది.
ఉద్యోగం కోసం నమోదు చేసుకున్న వారి సంఖ్య
కర్నూలు 91451 అనంతపురం 49574 చిత్తూరు 67087
వైఎస్‌ఆర్ కడప 72147 విజయవాడ 73791 ఏలూరు 64721
గుంటూరు 51739 నెల్లూరు 53136 ఒంగోలు 53132
కాకినాడ 82735 శ్రీకాకుళం 53631 విశాఖపట్టణం (ఎస్‌పీ) 7627
విజయనగరం 59295 పీ అండ్ ఈ ఆంధ్రప్రదేశ్ 37,288
విశాఖపట్టణం (సీఐ) 72897, విశాఖపట్టణం (టీ అండ్ ఎస్) 38315
మొత్తం 9,28,566