
‘రియల్’ తిరోగమనం
పాలకొండ: జనాభా పెరుగుతోంది. ఇళ్ల నిర్మాణాలు పెరిగాయి. ఫలితంగా భూముల ధరలు అడ్డూఅదుపూ లేకుండా పైపైకి ఎగబాకాయి. రియల్ ఎస్టేట్ రంగం మూడు స్థలాలు.. ఆరు లే అవుట్లుగా వర్థిల్లింది. అయితే ఇది ఏడాది క్రితంనాటి ముచ్చట. ఏడాది కాలంగా పరిస్థితి తిరగబడింది. ఆకాశాన్నంటిన స్థలాల ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు చుక్కలు చూపిం చాయి. కొనుగోలు చేయలేని స్థాయికి పెరిగిపోయాయి. ఫలితంగా రియల్ బూ మ్.. గాలి బుడగలా ఢామ్మని పేలిపోయింది. స్థలాల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రియల్ ఎస్టేట్ రంగం చతికిలబడింది. పాలకొండ డివిజన్‌తోపాటు జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. దీని ప్రభావం రిజిస్ట్రేషన్ శాఖ లక్ష్యాలపైనా పడింది. ఏడాది క్రితం వరకు ఇళ్ల స్థలాలకు విపరీతమైన గిరాకీ ఉండేది. ప్రధాన పట్టణాలతోపాటు పాలకొండ డివిజన్‌లోనూ క్రయవిక్రయాలు జోరుగా సాగేవి. ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు కనిపించిన భూమినంతా కొనేసి లే అవుట్లు వేసి.. ప్లాట్లుగా అమ్మేసి లక్షలకు లక్షలు వెనకేసుకునేవారు.
ఫలితంగా భూముల ధరలు ఆకాశాన్నంటాయి. అప్పటివరకు రూ.30 వేలు పలికిన ఎకరా భూమి అమాంతం కోటి రూపాయల వరకు చేరిన ఉదంతాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఖాళీ భూములన్నీ రియల్ ఎస్టేట్ లే అవుట్లగా మారిపోయాయి. అయితే రేట్లు అందుబాటులో లేకుండా పోవడంతో కొనుగోలుదారులు వెనుకంజ వేయడం ప్రారంభించారు. ఇప్పటికే భూములు పలు చేతులు మారి.. రేట్లు పెంచుకుంటూ పోవడంతో.. తగ్గితే చూద్దాం అన్న ధోరణి మొదలైంది. ఫలితంగా కొనుగోళ్లు పూర్తిగా తగ్గిపోయాయి. అడ్వాన్సులు చెల్లించి, ఒప్పందాలు చేసుకున్న వారు సైతం పూర్తి మొత్తాలు చెల్లించలేక, అగ్రిమెంట్ సమయం పూర్తి అయినా రిజిస్ట్రేషన్ చేయించుకోలేక సతమతమవుతున్నారు. ఈ పరిస్థితి చివరి దశలో రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టిన వారిని ముంచేశాయి. లక్షలు పెట్టుబడి పెట్టి కొన్న స్థలాల్లో వేసిన ప్లాట్లు అమ్ముడుపోక.. చేతిలో డబ్బులు ఆడక ఇప్పటికే పలువురు అర్ధాంతరంగా ఈ రంగం నుంచి పలాయనం చిత్తగించారు. మరికొందురు అప్పులపాలయ్యారు.
రిజిస్ట్రేషన్లు అంతంత మాత్రమే
రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా బాగా తగ్గింది. జిల్లాలోని 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోను గత ఏడాది నవంబర్ నాటితో పోల్చి చూస్తే ఈ ఏడాది నవంబర్ నాటికి రిజిస్ట్రేషన్లు 21 శాతం కూడా జరగలేదు. పాలకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఈ ఆర్థిక సంవత్సరానికి సుమారు 5 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే నవంబర్ నెలాఖరునాటికి సుమారు కోటి రూపాయల ఆదాయం మాత్రమే లభించింది. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారు లేక కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో లక్ష్యాల మాట అటుంచితే కనీస ఆదాయం లభించడమే కనాకష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.