అందరినీ కలుపుకెళతాం
కుట్రతో జైలుకు పంపారు
నేడు రైతు సంఘాలతో సమావేశం
వైఎస్సార్ సీపీ నేత పేర్ని నాని
మచిలీపట్నం టౌన్ : తెలుగుదేశం అరాచక పాలనకు, అక్రమ అరెస్టులకు బెదిరేది లేదని, రైతుల పక్షాన భూఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని స్పష్టం చేశారు. రైతుల తరఫున పోరాడుతున్న తమ పార్టీ, వామపక్ష నాయకులను కేసుల ద్వారా భయపెట్టాలనుకుంటే సహించేది లేదన్నారు. మచిలీపట్నం సబ్‌జైలు నుంచి విడుదలైన ఆయనకు బుధవారం సాయంత్రం ఆ పార్టీ నాయకులు, రైతులు, ప్రజాసంఘాల ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. భారీ ర్యాలీ నిర్వహించారు. సబ్‌జైలు నుంచి రేవతి సెంటరు వరకు ఆయనను రిక్షాపై ఊరేగింపుగా తీసుకువచ్చారు. రేవతి సెంటరులోని వంగవీటి మోహనరంగా విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడి నుంచి పేర్ని నాని గృహం వరకు కార్యకర్తలు, నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. బాణసంచా పేల్చి దారి పొడవునా పూలు చల్లారు. యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు.
పేర్ని నాని మాట్లాడుతూ భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపితే రైతుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని టీడీపీ నాయకులు భావించి ఉంటారన్నారు. పోర్టు అనుబంధ పరిశ్రమల స్థాపన పేరుతో 30వేల ఎకరాల చేజిక్కించుకునేందుకు జరిగిన రాజకీయ కుట్రకు రైతాంగం, వైఎస్సార్ సీపీ, వామపక్షాల కార్యకర్తలు వ్యతిరేకంగా నిలబడ్డారన్నారు. ఎంతమందిని జైలులో పెట్టినా భూ పోరాట ఉద్యమం ఆగదని చెప్పారు. రైతుల నుంచి పొలాలను గుంజుకుని పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని చెప్పారు. అధికారుల విధులకు ఆటంకం కలిగించారని తనను అరెస్టు చేశారని, సీపీఎం పట్టణ కార్యదర్శి, పోతేపల్లి ఎంపీటీసీ సభ్యుడు నాగబాబును ఏ కారణంతో అరెస్టు చేశారని ప్రశ్నించారు. తమను అరెస్టు చేసిన సమయంలో అన్నీ స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులైనా ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చారని న్యాయమూర్తి ప్రశ్నిస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఉందని, తమపై రకరకాల ఒత్తిళ్లు ఉన్నాయని దయచేసి వీరిని జైలుకు పంపాలని పోలీసు అధికారులు చెప్పుకున్నారని ఆయన అన్నారు. జైలుకు పంపిన టీడీపీ నాయకులు పేర్ని నాని బందరులో రౌడీయిజం చేశారనే ప్రచారం చేస్తున్నారని, నిజంగా రౌడీయిజం చేస్తే ఈ రోజు మీరు ఊళ్లో ఉండగలరా అని ప్రశ్నించారు. మూడు రోజులు కాదు మూడు నెలలు జైల్లో పెట్టినా భూ పోరాటాన్ని ఆపే ప్రసక్తి లేదన్నారు.
ఉధృతం చేస్తాం...
భూపోరాటాన్ని ఉధృతం చేసేందుకు మరింత పటిష్టవంతంగా వ్యవహరిస్తామని పేర్ని నాని అన్నారు. రైతు సంఘాలు, ప్రజాసంఘాలతో గురువారం అఖిలపక్ష నాయకులతో సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామన్నారు. ప్రతి గ్రామంలోనూ భూఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు తాను మారానని రైతులకు మేలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత భూదందా కొనసాగిస్తున్నారన్నారు. కాగా జైలు నుంచి విడుదలైన పేర్ని నానిని నూజివీడు, తిరువూరు ఎమ్మెల్యేలు మేకా ప్రతాప్‌అప్పారావు, కొక్కిలిగడ్డ రక్షణనిధి, వైఎస్సార్ సీపీ నాయకులు సామినేని ఉదయభాను, ఉప్పాల రాంప్రసాద్ తదితరులు పరామర్శించారు.
భూ ఉద్యమాన్ని ఆపేది లేదు
Published Thu, Nov 19 2015 12:41 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement