కల్యాణ వైభోగమే..! | large number of weddings | Sakshi
Sakshi News home page

కల్యాణ వైభోగమే..!

Published Mon, Feb 29 2016 12:45 AM | Last Updated on Sun, Sep 3 2017 6:37 PM

కల్యాణ వైభోగమే..!

కల్యాణ వైభోగమే..!

విశాఖలో పెద్ద సంఖ్యలో వివాహాలు
ఎక్కడ చూసినా సందడే
చైత్రమాసం వరకు ఇదే ఒరవడి

 
పెళ్లంటే పందిళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు.. మూడే ముళ్లు.. ఏడే అడుగులు.. మొత్తం కలిపి నూరేళ్లు... ఇపుడు జిల్లా అంతటా ఇదే సందడి. సన్నాయి మేళం గొంతెత్తింది. పెళ్లిబాజా చిందులేస్తోంది. కల్యాణ మండపాలు కళకళలాడుతున్నాయి. ముహూర్తాలు పెట్టే పురోహితుల గృహాల్లో సందడి నెలకొంది. విందుల రద్దీలో వంటమేస్త్రీలు దొరకడం లేదు. వస్త్ర, కిరాణా, పూల వ్యాపారాలన్నీ కిటకిటలాడుతున్నాయి. పసిడి ధర పెరిగిపోయింది. మొత్తంగా జిల్లాలో పెళ్లిళ్ల సందడి స్పష్టంగా కన్పిస్తోంది.
 
యలమంచిలి : పచ్చని తోరణాలతో, విరబూసిన పూల తో, విద్యుత్ కాంతులతో మండపాలు ముస్తాబవుతున్నాయి. వధూవరుల ఇంట బంధువుల, మిత్రుల కలయికలతో సందడి వాతావరణం చోటుచేసుకుంది. ప్రస్తుత మాఘమాసం ప్రారం భం నుంచే పెళ్లిల్లకు మంచిరోజులు కావడంతో ఇప్పటి వరకు శుభముహూర్తం  కోసం ఎదురు చూస్తున్నవారి ఇళ్లల్లో ఇపుడు బాజాలు మోగుతున్నాయి. ప్రధానంగా కార్తీకమాసంలో సం బంధాలు కుదుర్చుకున్నవారితో పాటు కొత్తగా కుదుర్చుకునేవారు కూడా చైత్రమాసంలోగానే వివాహాలు జరిపేందుకు శుభముహూర్తాలు నిర్ణయిస్తున్నారు. ఈనెల 12వ తేదీ నుంచి ముహూర్తాలు మొదలయ్యాయి. 17, 25, 26, 28 తేదీల్లో ముహూర్తాలు ఉండటంతో పెద్ద సంఖ్య లో వివాహాలు జరిగినట్టు పండితులు చెబుతున్నారు. మిగిలిన రోజుల్లోనూ అక్కడక్కడ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. పాల్గుణమాసం, చైత్రమాసా ల్లో అంటే ఏప్రిల్ నెలాఖరు వరకు మాత్రమే మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత శూన్యమాసం, మూఢం వంటివి వరుసగా రావడంతో జూలై నెల వరకు ముహూర్తాలు లేవు. శ్రావణమాసం ఆగస్టు 4వ తేదీ నుంచి మళ్లీ ముహూర్తాలు మొదలవుతాయి.

ఇదే నెలలో కృష్ణా పుష్కరాలు ప్రారంభం కావడంతో చాలా మంది వివాహాలకు దూరంగా ఉంటారు. గత ఏడాది గోదావరి పుష్కరాల వలన కూడా కొం దరు వివాహాలు చేసుకునేందుకు ఆసక్తి చూపలేరు. దీనికితోడు శూన్యమాసం, అమావాస్య తదితర కారణాలతో వివాహాలు పెద్దగా జరగలేదు. కార్తీకమాసంలో అక్కడక్కడా మాత్రం జరిగాయి. ప్రస్తుతం ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మాసాల్లో వివాహాలకు మంచిరోజులు. దీంతో జిల్లాలో పెళ్లి వాతావరణం స్పష్టంగా కన్పిస్తోంది. ఇప్పటికే కొందరు ముహూర్తాలు నిర్ణయించుకుని పెళ్లికి సిద్ధమవుతుండగా మరికొందరు పెళ్లి కుదుర్చుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. పెళ్లి ముహూర్తం ఖరారైన వధూవరుల కుటుంబ సభ్యులంతా పెళ్లి పిలుపుల పనుల్లో ఉన్నారు. వివాహాలతో పాటు ఈ మూడు నెలల్లో గృహ ప్రవేశాలు, ఉపనయనం, శంకుస్థాపనలు వంటి శుభకార్యాలు కూడా పెద్ద సంఖ్యలోనే చేపడుతున్నారు.

అన్నింటికీ డిమాండే...
పెళ్లి ముహూర్తాలు పెద్ద సంఖ్యలో ఉండటంతో కల్యాణ మండపాలు సైతం దొరకక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. దీంతో చిన్నచిన్న సత్రాలు కూడా ముందుగానే పెళ్లిళ్లకు బుక్ చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతవాసులు ఇళ్లముందే మండపాలు ఏర్పాటు చేసుకుని వివాహాలు జరిపించుకుంటున్నారు. మరికొందరు ఆలయాలను ఆశ్రయిస్తున్నారు. కొన్నిచోట్ల అవి కూడా ఖాళీ లేకపోవడంతో సామాజిక భవనాలు, పాఠశాలలు, ఖాళీ స్థలాల వైపే ఆధారపడాల్సి వస్తోంది. కల్యాణ మండపాలతో పాటు పురోహితులు కూడా దొరకక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు ఒక్కసారిగా జరగడంతో పురోహితులకు   డిమాండ్ ఏర్పడింది.  

పెళ్లిళ్లలో అతిముఖ్యమైన వంట నిర్వాహకులు, బాజాభజంత్రీలు దొరకడంలేదు. దీంతో వివాహాలు చేసుకునేవారికి తంటాలు తప్పడంలేదు. పసిడి, వస్త్రదుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి.   బంగారం ధర కూడా పెరిగింది. పెళ్లికి ముఖ్యమైన మంగళసూత్రాలు, తాడు ఇతర ఆభరణాలు కొనుగోలు చేసేవారితో దుకాణాలు రద్దీగా కన్పిస్తున్నాయి. .
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement