గోదావరిలో లాంచీలు రయ్ రయ్
కొవ్వూరు : కొవ్వూరు-రాజమండ్రి మధ్య గోదావరి నదిపై జలమార్గంలో ప్రయా ణించేందుకు వీలుగా అధికారులు లాంచీలను సిద్ధం చేశారు. శని వారం ఉదయం 10గంటల నుంచి లాంచీల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. మరమ్మతుల నేపథ్యంలో రోడ్ కం రైలు వంతెనను గురువారం నుంచి మూసివేసిన విషయం విది తమే. 45 రోజులపాటు వంతెనపై వాహనాల రాకపోకలను నిషేధించడంతో కొవ్వూరు-రాజమండ్రి మధ్య జలమార్గంలో ప్రయాణించేందుకు వీలుగా లాంచీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కొవ్వూరు ప్రాంత ప్రయాణికులు ధవళేశ్వరం ఆనకట్ట మీదుగా సుమారు 25 కిలోమీటర్లు చుట్టు తిరిగి రాజమండ్రి వెళుతున్నారు.
శనివారం నుంచి లాంచీల ప్రయాణం ప్రారంభం కానుండటంతో ప్రయాణికులకు కొంత మేరకు ఇబ్బందులు తప్పనున్నాయి. కొవ్వూరులోని లాంచీల రేవులో ప్రయాణికులు లాంచీలు ఎక్కిదిగేందుకు అనువుగా పంట్లను, రేవులో ప్రయాణికులు నిరీక్షించేందుకు టెంట్లను ఏర్పాటు చేశారు. లాంచీ టికెట్ ధర పెద్దలకు రూ.15, పిల్లలకు రూ.10గా నిర్ణయించారు. కొవ్వూరు లాంచీల రేవు నుంచి రాజమండ్రి లాంచీల రేవు (శ్రద్ధానంద ఘాట్) వరకు లాంచీలు నడుస్తాయి.
కొవ్వూరు నుంచి రాజమండ్రి చేరుకోవడానికి 25 నుంచి 30 నిమిషాలు సమయం పడుతుంది. ప్రయాణికుల సౌకర్యార్థం మొత్తం 10 లాంచీలు ఏర్పాటు చేశారు. నిత్యం ఉదయం 6నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే లాంచీలు నడుపుతామని బోట్ సూపరింటెండెంట్ జి.ప్రసన్నకుమార్ తెలిపారు. నదిలో తిరిగే పది బోట్ల కండిషన్‌ను పరిశీలించి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేసినట్టు ఆయన చెప్పారు.