మూడు కబ్జాలు.. ఆరు దోపిడీలు!
మూడేళ్లలో రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు
► కాల్‌మనీ నుంచి హవాలా వరకు అభాసుపాలు
► సవాలుగా మారిన ఎర్రచందనం, గంజాయి స్మగ్లింగ్
► అక్రమార్జన కోసం అధికార పార్టీ నేతల బరితెగింపు
► చోద్యం చూడటం తప్ప చర్యలు తీసుకోలేకపోతున్న పోలీసులు
► నలిగిపోతున్న సామాన్యులు.. అడకత్తెరలో ఉద్యోగులు
► 2015 కంటే 2016లో పెరిగిన హత్యల శాతం 1.60
► దాడుల శాతం 4.01
►ఆర్థిక నేరాల శాతం 11.16
► మహిళలపై వేధింపుల శాతం 10.98
ఆంధ్రప్రదేశ్ అంటే అశాంతికి చిరునామాగా మారింది. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, ఆర్థిక నేరాలు, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, కాల్ ‘నాగు’ల విషపు కాట్లు, కేటుగాళ్ల కేరింతలు.. ఇదీ రాష్ట్రంలో మూడేళ్ల ప్రగతి. తరతరాలు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి సంపాదించాలన్న ఏకైక లక్ష్యంతో అధికార పార్టీ నేతలు బరితెగించడం సర్వత్రా కలవరపెడుతోంది. ‘అన్యాయం జరిగిందయ్యా.. న్యాయం చేయండ’ని వేడుకుని మరిన్ని ఇక్కట్ల పాలయ్యేకంటే నోరు కట్టేసుకుని కుమిలి పోవడమే ఉత్తమం అనే దుస్థితి దాపురించింది.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడేళ్లుగా శాంతిభద్రతలు అదుపు తప్పాయి. గడిచిన మూడేళ్లలో చోటుచేసుకున్న అకృత్యాలు, అరాచకాలే ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో మూడేళ్లుగా చోటుచేసుకున్న నేరాల్లో పోలీస్ రికార్డులకు ఎక్కినవి కొన్నే. నేర పరిశోధన విభాగం (సీఐడీ) గణాంకాలు పరిశీలిస్తే 2015 కంటే 2016లో హత్యలు, దాడులు, మహిళలపై వేధింపులు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాదీ హత్యలు, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు బాగా పెరిగాయి. మహిళల అక్రమ రవాణా (ఉమన్ ట్రాఫికింగ్) గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతున్నా అడ్డుకట్ట వేయడంలో విఫలమవుతున్నారు.
రాజధానిలో రాకాసి మూక
రాజధాని ప్రాంతం అరాచక శక్తులకు అడ్డాగా మారుతోంది. భూములు ఇవ్వని రైతుల పాకలు, అరటి తోటలను ధ్వంసం చేసి తగలబెట్టిన వారిని ఇప్పటి వరకు పట్టుకోలేపోయారు. విజయవాడలో ఎమ్మెల్యే బొండా ఉమా అనుచరుల దందాలో ఆదుకునే దిక్కులేక చిన్నారి సాయిశ్రీ క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్సకు నోచుకోక మే 15న మృత్యువాత పడింది. కండ్రికలో కార్పొరేషన్ భూమిని బొండా ఉమ సోదరుడు ఆక్రమించినా అధికారులు ప్రేకక్షపాత్ర వహించారు. మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్ అనుచరుల పేరుతో బెజవాడలో కొందరి దందాలు కేసుల వరకు వెళ్లాయి. గుంటూరులో ఎంపీ గల్లా జయదేవ్.. తాను అద్దెకు ఉంటున్న ఇల్లునే బ్యాంకు వేలం ద్వారా దక్కించుకోవడం దుమారమే రేపింది. స్పీకర్ కోడెల తనయుడు శివరాం తన అనుచరులతో నడికుడి – శ్రీకాళహస్తి రైల్వే కాంట్రాక్టర్ మామూళ్లు ఇవ్వలేదనే కారణంతో దాడి చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. కృష్ణా నదికి ఇరువైపులా టీడీపీ ప్రజాప్రతినిధుల అండతో ఇసుక మాఫియా కోట్లకు పడగలెత్తుతోంది.
కొత్త సవాళ్లతో పోలీసులు సతమతం
అధికారులు, పోలీసులపై టీడీపీ నేతల దాడులు శాంతిభద్రతలకు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. 2015 జూలై 8న ముసునూరు మహిళా తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి, 2015 జూలైలో చిత్తూరు జిల్లా చిన్నగొట్టికల్లు మండల తహసీల్దార్ నారాయణమ్మపై టీడీపీ నేతల దాడి ఘటనల్లో చర్యలు లేవు. వైజాగ్‌లో 2015 నవంబర్‌లో అనూషా(హిజ్రా) హత్య మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. అనంతపురం జిల్లాలో అయితే టీడీపీ నేతల ఆగడాలు మితిమీరాయి. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ కూతురు డాక్టర్ మాధవికి అన్యాయం జరిగినా పట్టించుకోలేదు. తాము చెప్పినట్టు వినలేదనే అక్కసుతో విజయవాడ నడిబొడ్డున సీనియర్ ఐపీఎస్ అధికారి, ట్రాన్సుపోర్టు కమిషనర్ బాలసుబ్రమణ్యంను ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమ, ఎమ్మెల్సీ బుద్ద వెంకన్నలు దుర్భాషలాడారు. ఆయన గన్‌మెన్‌పై ఎమ్మెల్యే బొండా ఉమ చేయి చేసుకున్నా చట్టపరమైన చర్యలు లేవు. ఎమ్మెల్యే చింతమనేని ఏకంగా పోలీసులపైనే దాడి చేసి కొట్టినా దిక్కులేదు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ భూతానికి బలైపోయిన రిషితేశ్వరి, ఫ్రొఫెసర్ వేధింçపుల కారణంగా గుంటూరులో పీజీ మెడికో విద్యార్థిని బాల సంధ్యారాణి ఆత్మహత్య ఘటనల్లో పోలీసులు విమర్శలనెదుర్కొన్నారు. ఆయా ఘటనల్లో నిందితులు అధికార పార్టీ వారు కావడంతోనే చర్యలు తీసుకోలేక, బాధితులకు న్యాయం చేయలేక పోలీసులు సతమతమవుతున్నారు.
► ఎర్రచందనం స్మగ్లర్లకు చెక్ పెడతామని, స్మగ్లింగ్‌ను అరికడతామని ప్రభుత్వం చేసిన ప్రకటనలు ఆచరణలో అమలు కాలేదు. అసలు స్మగ్లర్లను పట్టుకోలేక చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో 2015 ఏప్రిల్‌లో 20 మంది కూలీలను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
► విజయవాడ నగరంలో కాల్‌మని కాలనాగులు కోరలు చాచి మహిళలపై లైగింక వేధింపులకు పాల్పడటం అధికార తెలుగుదేశం పార్టీకి మాయని మచ్చను తెచ్చింది.
► కొద్ది రోజుల క్రితం విశాఖ, విజయవాడలోను వెలుగు చూసిన హవాలా స్కామ్‌లోను టీడీపీ పెద్దల జోక్యం పలు అనుమానాలకు తావిచ్చింది.
► టీడీపీ నేతల వేధింపుల కారణంగానే గుంటూరు జిల్లా మాచర్ల మున్సిపల్ చైర్‌పర్సన్ గోపవరపు శ్రీదేవి భర్త గుండెపోటుతో మృతి చెందడం, ఆ తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకోవడం దుమారం రేగింది.
► పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రుల్లో ఫుడ్‌పార్కు విషయంలో నిరసన తెలిపిన మహిళలపై టీడీపీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు దాడి చేయించినా పోలీసులు స్పందించ లేదు. కర్నూలు జిల్లాలో వైఎస్సార్ సీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకేసులో అసలు నిందితులపై చర్యలు లేవు.
► విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో సాగు అవుతున్న గంజాయి రాజధాని ప్రాంతమైన విజయవాడ, గుంటూరుతోపాటు విద్యాలయాలు, శ్రమజీవులు ఉండే ప్రాంతాలకు పెద్ద ఎత్తున సరఫరా అవుతోంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, మద్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి గంజాయి, మాదకద్రవ్యాలు దిగుమతి అవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.
► ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచార యావతో 2015 జూలైలో జరిగిన గోదావరి పుష్కరాలు తొలి రోజునే రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాటలో 29 మంది భక్తులు దుర్మరణం చెందడం, పెద్ద సంఖ్యలో జనం గాయపడటం దేశ వ్యాప్తంగా సంచలనం అయింది.
► ఆంధ్ర – ఒడిశా బోర్డర్(ఏఓబి) మల్కన్‌గిరి ప్రాంతంలో 2016 అక్టోబర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టులు, గిరిజనులు మృతి చెందడం కలకలం రేపింది.