లాసెట్ ఫలితాల విడుదల | LAWCET-2014 results released | Sakshi
Sakshi News home page

లాసెట్ ఫలితాల విడుదల

Published Sun, Jun 22 2014 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 9:10 AM

LAWCET-2014 results released

సాక్షి, తిరుపతి: రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన లాసెట్ - 2014 ఫలితాలను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం విడుదల చేశారు. తిరుపతిలోని ఎస్‌వీయూ సెనేట్ హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో  మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే వెంకటరమణ, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డి, వర్సిటీ వీసీ రాజేంద్ర, లాసెట్ కన్వీనర్ వి.ఆర్.సి.కృష్ణయ్య పాల్గొన్నారు. మూడేళ్ల కోర్సుకు 17,656 మంది దరఖాస్తు చేసుకోగా 14,929 మంది అర్హత సాధించారు. ఐదేళ్ల కోర్సుకు 4,376 మంది దరఖాస్తు చేసుకోగా 3,156 మంది అర్హత సాధించారు. అలాగే పీజీ లాసెట్ కు 1,707 మంది దరఖాస్తు చేయగా 1,596 మంది అర్హత సాధించారు. త్వరలోనే ఆయా కోర్సుల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటిస్తామని లాసెట్ కన్వీనర్ కృష్ణయ్య తెలిపారు.
 
 టాప్ ర్యాంకర్లు హైదరాబాదీలే..
 
 లాసెట్ - 2014 ఫలితాలకు సంబంధించి పీజీ లాసెట్‌లో హైదరాబాద్‌కు చెందిన మిథున్‌కుమార్, టి.పద్మ మొదటి రెండు ర్యాంకులు సాధించారు. అలాగే మూడు సంవత్సరాల కోర్సుల్లో ఎస్.ప్రవీణ్ (నల్లగొండ), కె.శ్రీకాంత్‌రెడ్డి (గుంటూరు)లు ఒకటి, రెండో ర్యాంకులు సాధించారు. ఐదు సంవత్సరాల కోర్సులో అదిలాబాద్‌కు చెందిన వి.గంగాధర్ మొదటి ర్యాంకు, ఎం.వి.సూర్యకళ్యాణ్ రెండవ ర్యాంకు సాధించారు. సీమాంధ్ర నవ నిర్మాణంలో భాగంగా తిరుపతిని విద్యాకేంద్రంగా మార్చనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. తిరుపతి, విశాఖపట్నంలలో ఐఐటీఆర్ సంస్థలు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.
 
 ఎల్‌ఎల్‌ఎం చేస్తా: మిథున్


 లాసెట్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ప్రస్తుతం హైకోర్టులో న్యాయవాదిగా పనిచే స్తున్నా. చాలామంది ఇంజనీరింగ్, మెడిసిన్‌లకే పరిమితం అవుతారు. ‘లా’ లో ఉన్న ఆనందం మరి ఏ ఇతర దాంట్లో ఉండదు. భారత రాజ్యాంగంపై ఎల్‌ఎల్‌ఎం చేస్తాను.
 
 పట్టలేని ఆనందం: పద్మ  
 
 లాసెట్‌లో రాష్ట్రంలోనే రెండో ర్యాంక్ రావడం ఎంతో సంతోషాన్నిచ్చింది. అది కూడా ‘సాక్షి’ ప్రతినిధి ద్వారా తెలుసుకున్నా. నాగార్జున యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీలో గోల్డ్ మెడల్ సాధించాను. ప్రస్తుతం కేవి రంగారెడ్డి లా కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. బియాస్ నది దుర్ఘటన నుంచి నా కొడుకు రమన్‌తేజ కూడా బయటపడటంతో  పట్టలేనంత ఆనందంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement