సీబీఐ వలలో అవినీతి అధికారి
తమ పని తాము చేయడానికీ లంచం తీసుకుంటున్న ఇద్దరు అవినీతి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. గిద్దలూరులో సిక్‌లీవ్ తీసుకున్న గ్యాంగ్‌మెన్‌ను మళ్లీ విధుల్లోకి చేర్చుకునేందుకు రూ.5 వేలు లంచం తీసుకుంటున్న రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ లక్ష్మీనారాయణను సీబీఐ అధికారులు పట్టుకున్నారు. అదేవిధంగా కందుకూరు తహశీల్దార్ కార్యాలయంలో 10వన్ అడంగుల్లో తప్పుగా పడిన పేరును సరిచేసేందుకు ఓ వ్యక్తి నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఆర్‌ఐ దాదా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
గిద్దలూరు రూరల్: గ్యాంగ్‌మెన్ నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటూ రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీరు బి.లక్ష్మీనారాయణ సీబీఐకి పట్టుబడ్డాడు. ఈ సంఘటన గిద్దలూరు రైల్వే సెక్షన్ ఇంజినీర్ కార్యాలయంలో మంగళవారం రాత్రి జరిగింది. వివరాల్లోకెళితే గ్యాంగ్‌మెన్ జరీన్‌బాషా అనారోగ్యంతో వారం రోజులు సెలవు పెట్టాడు. మళ్లీ విధుల్లో చేరాలంటే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ లక్ష్మీనారాయణ అనుమతి కావాలి. అనుమతిచ్చేందుకు ఆయన రూ.5 వేలు లంచం అడిగాడు. అంత ఇచ్చుకోలేనని చెప్పినా వినకపోవడంతో జరీన్‌బాషా సీబీఐ అధికారులకు ఫోన్‌లో సమాచారం అందించాడు. మంగళవారం రాత్రి గ్యాంగ్‌మెన్..సెక్షన్ ఆఫీసర్‌కు డబ్బులిస్తున్న సమయంలో విశాఖపట్టణానికి చెందిన సీబీఐ అధికారుల బృందం సభ్యులు జీవన్‌భరత్, శ్రీనివాసరావు లంచం తీసుకుంటున్న లక్ష్మీనారాయణను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అనంతరం లక్ష్మీనారాయణ కార్యాలయంలోనూ, ఆయన నివాస గృహంలోనూ రికార్డులను పరిశీలించి అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించారు. ట్రాక్‌పై పనులు చేసేందుకు రైల్వేశాఖ గ్యాంగ్‌మెన్‌లకు ఉచితంగా అందించే గునపం, గోళం తదితర వస్తువులను వారికిచ్చేందుకు లక్ష్మీనారాయణ నగదు వసూలు చేస్తుండేవాడని సమాచారం. సెలవులు మంజూరు చేయాలన్నా, బదిలీలు చేయాలన్నా గ్యాంగ్‌మెన్ల నుంచి వేలకు వేల రూపాయలు దండుకుంటున్నాడన్న ఆరోపణలున్నాయి. లక్ష్మీనారాయణను అరెస్టు చేసి విశాఖపట్నం సీబీఐ కార్యాలయానికి తరలించారు.