ఎప్పటికీ ఎవర్‌గ్రీన్
- అక్కినేని మృతితో శోకసంద్రంలో రాష్ట్రం
- గుండెలవిసేలా రోదిస్తున్న అభిమానులు
- కడసారి చూపునకు తరలివస్తున్న ప్రజలు
- జనసంద్రమైన అన్నపూర్ణ స్టూడియోస్
- సినీ దిగ్గజాలు, రాజకీయ ప్రముఖుల నివాళులు
- దేశవ్యాప్తంగా సంతాప సందేశాల వెల్లువ
- నేడు సినీ షూటింగులు, థియేటర్లు బంద్
- శాసనమండలి, అసెంబ్లీ సంతాప తీర్మానాలు
- మధ్యాహ్నం దాకా అన్నపూర్ణ స్టూడియోస్‌లో భౌతికకాయం
- అనంతరం ఫిల్మ్ చాంబర్ నుంచి అంతిమయాత్ర
-
అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రభుత్వ లాంఛనాలతో సాయంత్రం అంత్యక్రియలు
ఓ.. దేవదా..
బోరున వర్షం..
ఉరుములు.. మెరుపులు..
ఒకటే దగ్గు.. నోట్లోంచి తెరలు తెరలుగా రక్తం..
‘ఇంకెంత దూరం..’..
‘ఇంకో కోసెడు ఉంది బాబు..’
‘అంతవరకు
బతుకుతానో లేదో, కోరినంత డబ్బు ఇస్తాను త్వరగా పోనీ’
దుర్గాపురం వచ్చేసింది..
చావిట్లో గడ్డిపై పడిపోయిన ఆయన నోట మాట
పెగలటం లేదు..
పార్వతిని చూసేందుకు తపించిన ఆ కన్నులు కాసేపటికే
మూతపడ్డాయి..
ఇచ్చిన మాట కోసం ప్రాణాలకు తెగించి పట్నం నుంచి వచ్చిన
ఓ దేవదా..!
నిన్ను పార్వతి కన్నా అమితంగా ఆరాధిస్తున్న కొన్ని కోట్ల గుండెలు పిలుస్తున్నాయి..
మా కోసం మళ్లీ రావా..
మహా నటశిఖరం నేలకొరిగింది. అఖిలాంధ్ర ప్రేక్షకులను ఏకంగా ఏడు దశాబ్దాలకు పైగా ఆనంద సాగరంలో ఓలలాడించిన సినీ దిగ్గజం ఇక సెలవంటూ జీవిత రంగ స్థలం నుంచి నిష్ర్కమించింది. నటనకే కొత్త భాష్యం చెప్పడమే గాక హుషారైన డ్యాన్సులతో తెలుగు సినిమాకు కొత్త పోకడలు నేర్పిన నటసమ్రాట్ మరి లేరన్న వార్త తెలిసి ఆంధ్ర దేశమంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. బుధవారం తెల్లవారుజామున అక్కినేని నాగేశ్వరరావు మరణించారన్న విషాద వార్త సూర్యోదయానికి ముందే రాష్ట్రమంతటా దావానలంలా పాకింది. అశేష అభిమానులంతా ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. గుండెలవిసేలా రోదించారు. తమ అభిమాన నటుణ్ని కడసారి కళ్లారా చూసుకునేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. అక్కినేని భౌతికకాయాన్ని ఉంచిన హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ అభిమానుల తాకిడితో జనసంద్రంగా మారింది. ఏఎన్నార్ మరణ వార్త తెలిసి తెలుగు సినీ పరిశ్రమ కూడా తల్లడిల్లిపోయింది.
తెలుగుతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమ దిగ్గజాలు, ప్రముఖ నటీనటులంతా అక్కినేనికి శ్రద్ధాంజలి ఘటించేందుకు బారులు తీరుతున్నారు. దేశం నలుమూలల నుంచీ సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు బుధవారం ఆయన భౌతికకాయాన్ని సందర్శించి కడసారి నివాళులు అర్పించారు. శాసనమండలి, శాసనసభ అక్కినేని మృతికి సంతాపం ప్రకటించాయి. ఏఎన్నార్ మృతికి సంతాప సూచకంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లు మూతబడనున్నాయి. సినీ షూటింగులకు కూడా విరామం ప్రకటించారు. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని గురువారం ఉదయం 11.30 దాకా అన్నపూర్ణ స్టూడియోస్‌లో, అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఫిలిం చాంబర్‌లో ఉంచుతారు. 12.30 నుంచి అక్కినేని అంతిమయాత్ర మొదలవుతుందని ‘మా’ అధ్యక్షుడు మురళీమోహన్ ప్రకటించారు. ఫిలిం చాంబర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మీదుగా తిరిగి అన్నపూర్ణ స్టూడియోకు అంతిమయాత్ర చేరుతుందని తెలిపారు. గురువారం సాయంత్రం మూడింటి తర్వాత అక్కినేని పార్ధివ దేహానికి పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అన్నపూర్ణ స్టూడియోలో అంత్యక్రియలు జరగనున్నాయి.
తెలుగు సినీ పరిశ్రమను మకుటం లేని మహారాజుల్లా ఏలిన అగ్రశ్రేణి ద్వయంలో ఎన్టీఆర్ అనంతరం ఇప్పుడు ఏఎన్నార్ కూడా మహాభినిష్ర్కమణం చేసి కళామతల్లికి కడుపుకోత మిగిల్చారు. ఎన్నెన్ని పాత్రలు! ఎంతటి వైవిధ్యం! ఎంతటి నటనా వైదూష్యం! జానపద నాయకుడిగా మురిపించినా, అల్లరి ప్రియుడిగా కొంటె చేష్టలతో అలరించినా, భగ్న ప్రేమికుడిగా భేష్ అన్పించినా, నవలా నాయకునిగా రాణించినా, విషాదమూర్తిగా వైరాగ్యం పండించినా, సాంఘిక పాత్రల్లో సాటిలేని నటన ప్రదర్శించినా, మహా భక్తునిగా తత్వసారాన్ని రంగరించినా, వయసు పైబడ్డాక కుటుంబ పెద్దగా వెండితెరకే నిండుదనం తెచ్చినా ఆయనకే చెల్లింది. పద్మాలు మొదలుకుని ఫిల్మ్‌ఫేర్‌లు, దాదాసాహెబ్ ఫాల్కే దాకా అక్కినేనిని వరించినన్ని అవార్డులు, ఆయనకు దక్కినన్ని సన్మానాలు మరే సినీ ప్రముఖుడికీ లభించలేదు. తెలుగు సినీ పరిశ్రమ ఆనాటి మద్రాసు నుంచి హైదరాబాద్ తరలిరావడంలో ఆయనదే కీలక పాత్ర. 1974లోనూ, ఆ తర్వాత మరోసారి 1988లోనూ పెను సవాలు విసిరిన తీవ్రమైన గుండె జబ్బును అంతులేని ఆత్మవిశ్వాసంతో జయించి, ఆపరేషన్ చేసిన డాక్టర్లే ఆశ్చర్యపోయేలా ఆ తర్వాత కూడా దశాబ్దాల పాటు చెక్కుచెదరని ఆరోగ్యంతో జీవించి చూపించిన రియల్ హీరో ఏఎన్నార్. 90 ఏళ్ల వయసులో కూడా తన కుటుంబంలోని మూడు తరాల వారితోనూ కలసి తాజాగా ‘మనం’ అనే సినిమాలో నటించారాయన. కేన్సర్ మహమ్మారి తనను కబళించేందుకు ప్రయత్నిస్తోందని, అభిమానుల ఆశీర్వాద బలంతో దాన్ని కూడా జయిస్తానని ఆ షూటింగ్‌లో ఉండగానే విలేకరుల సమావేశం నిర్వహించి మరీ ప్రకటించిన అంతులేని ఆత్మబలం అక్కినేని సొంతం.
అక్కినేనిని కేర్‌కు చేర్చిన 108 అంబులెన్స్
ఏఎన్నార్‌కు ఇటీవలే కిమ్స్‌లో మలద్వార కేన్సర్ శస్త్రచికిత్స జరగడం తెలిసిందే. అప్పటినుంచీ ఆయన పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. కోలుకుంటున్నారని అంతా అనుకుంటున్న సమయంలో అధిక విరేచనాలతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో ఏఎన్నార్‌కు గుండెపోటు వచ్చింది. ఆయన మనవరాలు సుప్రియ వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. ఆ సమయంలో సరిగ్గా జూబ్లీహిల్స్ చౌరస్తాలోనే ఉన్న అంబులెన్స్ నాలుగు నిమిషాల్లో జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 17లోని అక్కినేని నివాసానికి చేరుకుంది. అంబులెన్స్ సిబ్బంది వడివడిగా ఆక్సిజన్ సిలిండర్‌తో పాటు లోనికి వెళ్లి అక్కినేనికి ప్రథమ చికిత్స చేశారు. కొన ఊపిరితో ఉన్న ఆయనను 10 నిమిషాల్లోనే బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రికి తరలించారు. అక్కినేనితో పాటు మనవరాలు సుప్రియ, మనవడు సుమంత్ కూడా అంబులెన్స్‌లోనే ఆస్పత్రికి వెళ్లారు.
కన్నీరుమున్నీరైన నాగార్జున
బుధవారం తెల్లవారుజాము 1.45 గంటలకు 108 అంబులెన్స్ అక్కినేనిని కేర్ ఆస్పత్రి అత్యవసర విభాగానికి చేర్చింది. డాక్టర్ సోమరాజు నేతృత్వంలోని వైద్య బృందం మొదట ఆయనకు సీపీఆర్, తర్వాత ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించింది. ఇదంతా జరుగుతుండగానే ఆయన పల్స్‌రేటు పడిపోయింది. వైద్యులు ఎంత శ్రమించినా ఫలితం లేకపోయింది. అక్కినేని చనిపోయినట్టు తెల్లవారుజాము 2.45కు వైద్యులు ధ్రువీకరించారు.ఆయన మృతికి గుండెపోటే కారణమని విశ్వసనీయంగా తెలిసింది.
అనంతరం ఆయన గుండెకు గతంలో అమర్చిన పేస్‌మేకర్‌ను కూడా తొలగించారు. ఈ సమయంలో ఏఎన్నార్ కుమారుడు నాగార్జున సహా కుటుంబసభ్యులంతా అక్కడే ఉన్నారు. తండ్రి లేడన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక నాగార్జున సహా వారంతా కన్నీరుమున్నీరయ్యారు. తర్వాత మృతదేహాన్ని తెల్లవారుజాము 3 గంటలకు ఆయన నివాసానికి తరలించారు. బుధవారం ఉదయం 9 గంటలకు బంజారాహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోకు తరలించారు. తండ్రి పార్ధివ దేహంతో పాటు నాగార్జున కూడా స్టూడియోకు చేరుకున్నారు. సోదరి నాగసుశీల అక్కడకు రావడంతోనే దుఃఖాన్ని ఆపుకోలేక బోరుమని విలపించారు. నాగార్జున రోదన చూసి ఆయన కుమారులు నాగచైతన్య, అఖిల్ కూడా కన్నీరుమున్నీరయ్యారు. నాగార్జునను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. అరగంట పాటు ఆయన గుక్కపట్టి ఏడ్చారు. అది చూసి అభిమానులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఏఎన్నార్ పేస్‌మేకర్‌ను హృద్రోగంతో బాధపడుతున్న ఎవరైనా నిరుపేద కళాకారునికి ఉచితంగా అందజేయవచ్చని సమాచారం.
అభిమానులతో కిక్కిరిసిన అన్నపూర్ణ స్టూడియో
అక్కినేని మరణవార్త తెలియగానే అభిమానులు తండోపతండాలుగా అన్నపూర్ణ స్టూడియో వద్ద బారులుతీరారు. బుధవారం తెల్లవారుజామున మూడింటి నుంచే అక్కడ క్యూలు కట్టారు. వారి సంఖ్య గంటగంటకూ పెరిగిపోవడంతో స్టూడియో పరిసరాలన్నీ కిటకిటలాడాయి. 70 వేల మందికి పైగా తరలిరావడంతో స్టూడియో ఆవరణంతా అభిమానులతో నిండిపోయింది. ఆ ప్రాంతమంతా ఇసకేస్తే రాలనంతగా కిక్కిరిసింది. ప్రముఖుల రాక మొదలవడంతో రోడ్లకు రెండు వైపులా వాహనాల పార్కింగ్‌లతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దాంతో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. స్టూడియో ప్రధాన ద్వారం నుంచి క్యూ ఏర్పాటు చేసి అభిమానులను లోనికి పంపారు. నుంచునేచోటు కూడా లేక చాలామంది చెట్ల పెకైక్కి, అక్కడి నుంచే తమ నటుణ్ని కడసారి చూసుకున్నారు. బుధవారం రాత్రి పొద్దుపోయేదాక కూడా రద్దీ కొనసాగుతూనే ఉంది.
సందర్శించిన ప్రముఖులు
అక్కినేని పార్ధివ దేహాన్నిపలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. ఆయన లోటు తీర్చలేనిదని కొనియాడారు. అక్కినేని భారతీయ చిత్ర పరిశ్రమకే మేరునగమని సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని పార్ధివ దేహాన్ని సందర్శించిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, కేంద్ర మంత్రులు చిరంజీవి, దగ్గుబాటి పురందేశ్వరి, సర్వే సత్యనారాయణ, శాసనమండలి చైర్మన్ కె.చక్రపాణి, స్పీకర్ నాదెండ్ల మనోహర్, మంత్రులు బొత్స సత్యనారాయణ, రఘువీరారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, టీజీ వెంకటేష్, గీతారెడ్డి, డీకే అరుణ, వట్టి వసంత్‌కుమార్, సి.రామచంద్రయ్య, దానం నాగేందర్, కె.జానారెడ్డి, గల్లా అరుణకుమారి, కాసు కృష్ణారెడ్డి, మాజీ మంత్రులు దేవేందర్‌గౌడ్, షబ్బీర్ అలీ, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, టి.సుబ్బిరామిరెడ్డి, లగడపాటి రాజగోపాల్, సీఎం రమేశ్, లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, రామోజీరావు, ఎమ్మెల్యేలు కేటీఆర్, ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, మర్రి శశిధర్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శంకర్రావు, జూలకంటి రంగారెడ్డి, డి.శ్రీనివాస్, నేదురుమల్లి రాజ్యలక్ష్మి, మ్యాట్రిక్స్ ప్రసాద్ తదితరులున్నారు.
సినీ ప్రముఖుల నివాళులు
అక్కినేనికి నివాళులర్పించిన సినీ ప్రముఖుల్లో నటుడు కృష్ణ, హీరోలు వెంకటేశ్, బాలకృష్ణ, పవన్‌కల్యాణ్, మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీరావు, కె.రాఘవేంద్రరావు, నిర్మాతలు రామానాయుడు, సురేశ్‌బాబు, వీబీ రాజేంద్రప్రసాద్, కవి సి.నారాయణరెడ్డి, నటి అనుష్క, రోజా, తమిళ నటులు శరత్‌కుమార్, రాధిక దంపతులు, నాగేంద్రబాబు, హరికృష్ణ, జయప్రద, రానా, సాయిధరమ్ తేజ్, అలీ, అల్లు అరవింద్, వేణుమాధవ్, శ్రీకాంత్, ప్రకాష్‌రాజ్, మురళీమోహన్, జయసుధ, వాణిశ్రీ, జమున, రమాప్రభ, గీతాంజలి, మోహన్‌బాబు తదితరులున్నారు.
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు: డీకే అరుణ
అక్కినేని మృతి పట్ల సమాచార, పౌరసంబంధాలు, సినిమాటోగ్రఫీ మంత్రి డీకే అరుణ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియల్ని పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్టు ప్రకటించారు.
- సాక్షి నెట్‌వర్క్