జూనియర్లకే లెసైన్సింగ్ ఆఫీసర్ పోస్టులు
నిబంధనలకు తూట్లు కౌన్సిల్‌కు సిద్ధమైన ఫైల్
విజయవాడ సెంట్రల్ : అక్కడ జీవోలతో పనిలేదు. కొంచెం రాజకీయ పలుకుబడి, ఉన్నతాధికారులను మెప్పించగల సత్తా, కాస్త కాసులిస్తే చాలు అడ్డదారిలో పోస్ట్‌ను పట్టేయొచ్చు. హెల్త్ అసిస్టెంట్ల నియామకానికి సంబంధించి కమిషనర్ అండ్ డెరైక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) జారీ చేసిన 780 జీవోను పక్కన పడేసిన ప్రజారోగ్య శాఖాధికారులు అదే జీవో లెసైన్సింగ్ ఆఫీసర్ల పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఫైల్ సిద్ధం చేయడం వివాదాస్పదమైంది. ఈ పోస్ట్‌ల పంపకానికి సంబంధించి భారీగా ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని మూడు సర్కిళ్ల పరిధిలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు డేంజరస్ అండ్ అఫెన్సివ్ (డీఅండ్‌ఓ) ట్రేడ్ లెసైన్స్ మంజూరుకు సంబంధించి లెసైన్సింగ్ ఆఫీసర్లను నియమించాల్సిందిగా ప్రభుత్వం జీఓ 780 ను జారీచేసింది. సీనియర్ శానిటరీ సూపర్‌వైజర్లను లెసైన్సింగ్ ఆఫీసర్లుగా నియమించాలని జీవోలో పేర్కొన్నారు. ఇందుకు పూర్తి విరుద్ధంగా జూనియర్ శానిటరీ ఇన్స్‌పెక్టర్లతో పోస్టుల్ని భర్తీ చేయడం వివాదాస్పదంగా మారింది.
ఎగరేసుకుపోయారు
సర్కిల్-1కు ఓబేశ్వరరావు, సర్కిల్-2కు శ్రీధర్, సర్కిల్-3కి నారాయణను లెసైన్సింగ్ ఆఫీసర్లుగా నియమిస్తూ ఫైల్ సిద్ధం చేశారు. ప్రస్తుతం వీరు శానిటరీ ఇన్స్‌పెక్టర్లుగా పనిచేస్తున్న డివిజన్లలో ఇన్‌చార్జి బాధ్యతలను మురళీ, సోమరాజు, ఎం.వెంకటే శ్వరరావుకు అప్పగించినట్లు తెలుస్తోంది. వీరు మలేరియా ఇన్స్‌పెక్టర్లుగా కూడా విధులు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారుల అనుగ్రహంతో కొందరు శానిటరీ ఇన్స్‌పెక్టర్లు రెండు, మూడు డివిజన్లకు ఇన్‌చార్జీలుగా వ్యవహరించడం కొసమెరుపు.
భర్తీకాని హెల్త్ అసిస్టెంట్ పోస్టులు
జీవో 780 ప్రకారం హెల్త్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాల్సిందిగా గత ఏడాది సీడీఎంఏ ఉత్తర్వులు జారీచేశారు. ఇంటర్ బైపీసీ లేదా ఎంపీసీ చదివి, డిప్లమో ఇన్ శానిటేషన్ కోర్సు పూర్తిచేసిన ప్రజారోగ్యశాఖ ఉద్యోగులను హెల్త్ అసిస్టెంట్లుగా నియమించాల్సిందిగా జీవోలో పేర్కొన్నారు. 43,84 జీవోల వివాదం నడస్తున్న దృష్ట్యా హెల్త్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడం లేదని చెబుతూ ప్రజారోగ్య శాఖాధికారులు కాలం వెళ్లబుచ్చుతున్నారు. నగర పాలక సంస్థలోని 24 హెల్త్ అసిస్టెంట్ పోస్టుల్లో 2000వ సంవత్సరం నుంచి ఇన్‌చార్జీలతో నడిపిస్తున్నారు.
క్యాష్ కొట్టు.. పోస్ట్ పట్టు
Published Fri, Jan 15 2016 2:25 AM | Last Updated on Sun, Sep 3 2017 3:41 PM
Advertisement
Advertisement